ఏ ఉద్యోగికైనా ఎన్‌పీఎస్ ఖాతాతో ఎన్నో లాభాలు

ఏ ఉద్యోగికైనా ఎన్‌పీఎస్ ఖాతాతో ఎన్నో లాభాలు

బిజినెస్ డెస్క్‌‌, వెలుగు: ప్రతి ఎంప్లాయి వీలైనంత ముందుగా రిటైర్‌‌మెంట్‌‌ ప్లాన్‌‌ను తయారు చేసుకోవాలని పర్సనల్‌‌ ఫైనాన్స్ ఎక్స్‌‌పర్టులు చెబుతుంటారు. జాబ్‌‌ను వదిలిపెట్టాక ఫైనాన్షియల్‌‌ సెక్యూరిటీ ఉండాలంటే నేషనల్‌‌ పెన్షన్‌‌ సిస్టమ్‌‌ (ఎన్‌‌పీఎస్‌‌)లో తగినంత ఇన్వెస్ట్‌‌ చేయడం తప్పనిసరి. పబ్లిక్‌‌, ప్రైవేట్ సెక్టారుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఎంప్లాయి ఇందులో ఖాతా తెరవొచ్చు. ఆర్మ్‌‌డ్‌‌ ఫోర్సెస్‌‌ పనిచేసేవాళ్లకు మాత్రం ఎన్‌‌పీఎస్‌‌ స్కీమ్‌‌లో చేరడానికి పర్మిషన్‌‌ ఉండదు. ఎన్‌‌పీఎస్‌‌లో ఏటా కనీసం రూ.ఆరు వేలు జమచేయాలి. నెలకు రూ.500 చొప్పున కూడా డిపాజిట్‌‌ చేయవచ్చు. 18–60 ఏళ్లలోపు వయసున్న ఎంప్లాయిస్ అంతా ఎన్‌‌పీఎస్‌‌ కు అర్హులే! ఎన్‌‌పీఎస్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ ఉద్యోగికి 60 ఏళ్లు వచ్చాక మెచ్యూర్ అవుతుంది. కావాలంటే 70వ సంవత్సరం వరకు పొడగించుకోవచ్చు. ఎన్‌‌పీఎస్‌‌ డబ్బును సాధారణంగా డెట్‌‌, ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌‌ చేస్తారు. వాటి పనితీరు ఆధారంగా రాబడులు ఆధారపడి ఉంటాయి.

ఎన్‌‌పీఎస్‌‌తో లాభాలివి...
1. రాబడులు, వడ్డీలు
ప్రావిడెంట్‌‌ ఫండ్‌‌ వంటి సాధారణ ట్యాక్స్‌‌ సేవింగ్స్‌‌ స్కీమ్స్‌‌తో పోలిస్తే ఎన్‌‌పీఎస్‌‌ ఇన్వెస్ట్‌‌మెంట్ల ద్వారా వడ్డీ, రాబడులు ఎక్కువగా ఉంటాయి. ఎన్‌‌పీఎస్‌‌ డబ్బును ఈక్విటీ మార్కెట్లో పెడతారు కాబట్టి ఏడాదికి 9–12 శాతం వరకు వడ్డీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఎన్‌‌పీఎస్‌‌ ఖాతాను బట్టి కూడా రాబడుల్లో తేడాలు ఉంటాయి. 
2. పన్ను మినహాయింపులు
సెక్షన్‌‌ 80సి ప్రకారం ఎన్‌‌పీఎస్‌‌లో ఇన్వెస్ట్‌‌మెంట్లలో రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఎన్‌‌పీఎస్‌‌ ఖాతాకు డబ్బు ఎంప్లాయి నుంచి వచ్చినా, ఎంప్లాయర్‌‌ నుంచి వచ్చినా పన్ను మినహాయింపులు వర్తిస్తాయి. 
3. నచ్చినట్టుగా..
ఎన్‌‌పీఎస్‌‌లో చేరాలా ? వద్దా ? అనేది ఎంప్లాయ్‌‌ ఇష్టం. ఏ రకం ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ను ఎంచుకోవాలి?  ఎంత పెట్టుబడి పెట్టాలి ? వంటి విషయాలను కూడా ఆయనే నిర్ణయించుకోవచ్చు. ఎన్‌‌పీఎస్‌‌ లో ఖాతా తెరవడం చాలా ఈజీ. అయితే ఒకసారి ఖాతా తెరిచాక 60 ఏళ్లు వచ్చే వరకు ఇన్వెస్ట్‌‌ చేయాలి. 
4. విత్‌‌డ్రాయల్‌‌
ఏదైనా అవసరం పడితే చిన్న మొత్తాన్ని కూడా ఎన్‌‌పీఎస్‌‌ ఖాతా నుంచి తీసుకోవచ్చు. ఖాతా తెరిచాక మూడేళ్ల తరువాత అందులో 25 శాతం మొత్తాన్ని తీసుకోవచ్చు. మిగతాది ఖాతాలోఉంటుంది. అయితే ఎమర్జెన్సీ సమయంలోనే మాత్రమే విత్‌‌డ్రాయల్‌‌కు అనుమతి ఇస్తారు.
5. డబ్బు భద్రం
పెన్షన్ ఫండ్‌‌ రెగ్యులేటరీ అండ్‌‌ డెవెలప్‌‌మెంట్‌‌ అథారిటీ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌‌ఆర్‌‌డీఏ) ఎన్‌‌పీఎస్‌‌ స్కీమ్‌‌ను ఎప్పటికప్పుడు కంట్రోల్‌‌ చేస్తుంది. ఫలితంగా ప్రతి ట్రాన్సాక్షన్‌‌ పారదర్శకంగా ఉంటుంది. మోసాలకు అవకాశం ఉండదు. ఆన్​లైన్​లోనూ అన్ని వివరాలు చూసుకోవచ్చు. 

ఎన్‌‌పీఎస్‌‌లో రకాలు
ఎన్‌‌పీఎస్‌‌ రెండు రకాల ఖాతాలను ఇస్తుంది. వీటిని టైర్‌‌–1, టైర్‌‌–2 ఖాతాలు అంటారు. 
టైర్‌‌-1 ఖాతా
ఇది బేసిక్ పెన్షన్‌‌ అకౌంట్. ఉద్యోగికి 60 ఏళ్లు వచ్చాక ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ మెచ్యూర్‌‌ అవుతుంది. మధ్యలో కావాలనుకుంటే 25 శాతం మొత్తాన్ని విత్‌‌డ్రా చేసుకోవచ్చు. మిగతాది యాన్యూటీ కొనుగోలుకు ఖర్చు పెడతారు. ఫలితంగా ప్లాన్‌‌ మెచ్యూర్‌‌ అయ్యే వరకు ఇన్సూరర్‌‌ డబ్బు చెల్లిస్తారు. అంటే 60 ఏళ్ల నుంచి జీవితాంతం వరకు డబ్బు చేతికి వస్తుంది. 60 ఏళ్లు దాటితే పెన్షన్ ఫండ్ నుంచి దాదాపు 60 శాతం వెనక్కి తీసుకోవచ్చు. 
టైర్‌‌-2 ఖాతా
ఇది టైర్‌‌–1 ఖాతాకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఎన్‌‌పీఎస్‌‌ ఖాతాదారుడు తనకు నచ్చిన సమయంలో నచ్చినంత మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఇష్టముంటేనే ఖాతాలో డబ్బు వేయొచ్చు. టైర్‌‌–1 ఖాతాలో ఇన్వెస్ట్‌‌మెంట్లను తప్పక కొనసాగించాలి.