
హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికల సందర్భంగా పలువురు ప్రముఖులు సోమవారం తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బర్కత్ పురా దీక్ష మోడల్ హైస్కూల్ లో కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఓటు వేయనున్నారు. ముషీరాబాద్ లోని కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఎదురుగా ఉన్న వెస్ట్ వింగ్ లో ఎంపీ లక్ష్మణ్, రాంనగర్ లోని జేవీ హైస్కూల్ లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మలక్ పేట సలీమ్ నగర్ లోని జీహెచ్ ఎంసీ కమ్యూనిటీ హాల్ లో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ధర్మసాగర్ గ్రామంలో బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీడీ కాలనీలో మురళీధర్ రావు, మలక్ పేటలోని తిరుమల హిల్స్ లో ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, తార్నాకలో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
జూబ్లీహిల్స్ లో సినీ సెలబ్రిటీలు..
జూబ్లీహిల్స్ లోని ఓబుల్‌రెడ్డి స్కూల్ లో జూనియర్ ఎన్టీఆర్ ఓటు వేయనున్నారు. బీఎస్ఎన్ఎల్ సెంటర్ లో అల్లు అర్జున్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో మహేశ్‌బాబు, నమ్రత, మోహన్‌బాబు, మంచు విష్ణు, లక్ష్మి, మనోజ్, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, శ్రీకాంత్, ఎఫ్‌ఎన్‌సీసీ లో రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్, విశ్వక్‌సేన్, దగ్గుబాటి రానా, సురేశ్ బాబు, జూబ్లీహిల్స్ క్లబ్ లో చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన, నితిన్. జూబ్లీహిల్స్ న్యూ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో రవితేజ , వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్, మణికొండ హైస్కూల్ లో వెంకటేశ్, బ్రహ్మానందం, షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్ లో రాజమౌళి, రమ, బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో రామ్ పోతినేని, గచ్చిబౌలి జడ్పీ స్కూల్ లో నాని ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
చింతమడకలో కేసీఆర్
బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ చింతమడకలో ఓటు వేయనున్నారు. ఆయన సోమవారం ఉదయం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి చింతమడకకు వెళ్లనున్నారు. 11 గంటలకు చింతమడక గ్రామంలో కేసీఆర్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని పార్టీ ప్రకటనలో పేర్కొంది. కాగా, హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నందినగర్ కమ్యూనిటీ హాల్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.