కొత్త ఎమ్మెల్యేకు సవాళ్లెన్నో..

కొత్త ఎమ్మెల్యేకు సవాళ్లెన్నో..
  •     అసంపూర్తిగా నిలిచిన అభివృద్ధి పనులు
  •     ఎప్పుడెప్పుడు కంప్లీట్​అవుతాయని
  •     ఎదురు చూస్తున్న ప్రజలు

మెదక్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్​ప్రభుత్వం కొలువుదీరింది. మెదక్​ నియోజకవర్గంలో కాంగ్రెస్​తరపున  మైనంపల్లి రోహిత్ రావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  కొత్త ఎమ్మెల్యే ఏం చేస్తారా అని నియోజకవర్గ ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా ఎమ్మెల్యే ఫోకస్​పెట్టాల్సిన పనులు చాలానే ఉన్నాయి. బీఆర్ఎస్​హయాంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పనులన్నింటినీ కంప్లీట్​ చేస్తారని స్థానికులు ఆశిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి.

వనదుర్గ ప్రాజెక్ట్ ఎత్తు పెంపు..

 వనదుర్గ ప్రాజెక్ట్ (ఘనపూర్ ఆనకట్ట) ఎత్తు పెంపు పనులు పెండింగ్ లో ఉన్నాయి. 2015లోనే ఈ ఆనకట్ట ఎత్తు పెంపు పనులకు శ్రీకారం చుట్టారు. ఎనిమిదేళ్లయినా ఇన్ కంప్లీట్ గానే ఉన్నాయి. భూములు కోల్పోయే రైతులకు పరిహారం చెల్లించేందుకు గత ప్రభుత్వం రూ.8 కోట్లు మంజూరు చేసింది. అయితే ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ నుంచి క్లియరెన్స్ రాక రైతులకు పరిహారం చెల్లించ లేదు.

ఆ ఫండ్స్ రిలీజ్ చేయిస్తే ఆనకట్ట ఎత్తు పెంపు పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే పాపన్నపేట మండలంలో పెండింగ్ ఉన్న ఫతేనహర్ కెనాల్ సిమెంట్ లైనింగ్ పనులు కూడా పూర్తి చేయించాల్సి ఉంది. ఈ పనులు పూర్తయితే  ఆనకట్ట కింద 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 

మినీ ట్యాంక్ బండ్ పూర్తి కావాలి

మెదక్ పట్టణంలో దాదాపు రూ.20 కోట్లతో పిట్లం చెరువు, గోసముద్రం చెరువులను కలిపి చేపట్టిన మినీ ట్యాంక్ బండ్ పనులు ఆరేళ్లుగా అసంపూర్తిగా ఉన్నాయి. పనులు త్వరగా పూర్తి చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. దీనిని పర్యాటక కేంద్రంగా మార్చాల్సి ఉంటుంది. మినీ ట్యాంక్​ బండ్​ కోసం పట్టణ ప్రజలు చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు.  

రైతు బజార్ అందుబాటులోకి రావాలి..

మెదక్ పట్టణంలో దాదాపు ఆరేళ్ల కింద శంకుస్థాపన చేసిన రైతు బజార్ ఇంకా  పూర్తి కాలేదు. రూ.8.10 కోట్ల వ్యయంతో చేపట్టిన రైతు బజార్ పనులన్నీ కంప్లీట్ చేయించి అందుబాటులోకి తీసుకొస్తే ప్రజలకు, వ్యాపారులకు ఇబ్బందులు దూరమవుతాయి. అలాగే ఇరిగేషన్ ఆఫీస్ వద్ద చేపట్టిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం పిల్లర్ల లెవల్ లోనే ఉంది. దీనిని కూడా పూర్తి చేయాల్సి ఉంది.  

సర్కిల్స్ అసంపూర్తి..

మెదక్ పట్టణంలో మెయిన్ రోడ్డు విస్తరణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. వెల్కమ్ బోర్డ్ చౌరస్తా నుంచి చేగుంట రూట్​లో పుష్పాల వాగు బ్రిడ్జి వరకు విస్తరణ పనులు పూర్తి చేయాలి. అలాగే ధ్యాన్ చంద్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, రాందాస్ చౌరస్తా, వెల్కమ్ బోర్డ్ చౌరస్తా లో సర్కిల్స్ నిర్మాణం పనులు ఇన్ కంప్లీట్ గా ఉన్నాయి.

అలాగే పట్టణంలోని ప్రధాన కూడలి అయిన రాందాస్ చౌరస్తా నుంచి చమన్ మీదుగా దాయార వరకు రూ.7 కోట్లతో మంజూరైన రోడ్డు విస్తరణ పనులు తొందరగా పూర్తి చేయించాలి. రామాయంపేట పట్టణ పరిధిలో కూడా రూ.7.80 కోట్లతో చేపట్టిన మెయిన్ రోడ్డు విస్తరణ పనులు చాలా ఏళ్లుగా ఆగుతూ సాగుతున్నాయి. వీటిని త్వరగా పూర్తిచేస్తే వాహనదారుల ఇబ్బందులు తొలగిపోతాయి.

అకాడమీలు అవసరం

మెదక్ లోని ఇందిరా గాంధీ స్పోర్ట్స్ స్టేడియం, ఇండోర్​ స్టేడియాలను లక్షల రూపాయలతో ఆధునీకరించినా ఒక్క స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేయలేదు. రెండు స్టేడియాల్లో  స్పోర్ట్స్ అకాడమీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. చాలామంది క్రీడాకారులు స్పోర్ట్​ అకాడమీ ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్నారు. 

ఇండ్ల పంపిణీకి చర్యలు

మెదక్ మున్సిపాలిటీ పరిధి పిల్లికోటాల్ వద్ద దాదాపు వేయి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో సుమారు 400 ఇండ్లు మాత్రమే పంపిణీ చేశారు. మరో 300 ఇండ్ల నిర్మాణం చేపట్టినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు పూర్తికాక పంపిణీ చేయలేదు. మరికొన్ని ఇండ్ల నిర్మాణం పిల్లర్ల స్థాయిలోనే ఉంది. అసంపూర్తి పనులు పూర్తిచేసి ఇండ్లను పేదలకు పంపిణీ చేయాల్సి ఉంది. 

కాల్వ పనులు పూర్తయితే మేలు  

ఘనపూర్ ఆనకట్ట నుంచి పాపన్నపేట మండలంలోని ఆయకట్టు పొలాలకు నీరందించే బ్రాంచ్ కెనాల్స్​ అధ్వాన్నంగా మారాయి. గత ప్రభుత్వంలోనే కాల్వల సిమెంట్ లైనింగ్, తూముల రిపేర్ కోసం ఫండ్స్ మంజూరు అయినా పనులు పూర్తి కాలేదు. వ్యవసాయానికి పెద్ద పీట వేస్తామని చెప్పిన ఈ ప్రభుత్వమైనా కాల్వల సిమెంట్ లైనింగ్ పనులు జల్ది కంప్లీట్ చేస్తే రైతులకు సాగు నీటి ఇబ్బందులు దూరమవుతాయి. 
వెంకట్ రాంరెడ్డి, రైతు, గాంధారిపల్లి

పెండింగ్​పనులు పూర్తి చేయాలి

మెదక్ పట్టణంలో చాలా అభివృద్ధి పనులు పెండింగ్​లో ఉన్నాయి. నిధులు మంజూరైనా సకాలంలో పూర్తి చేయించడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ముఖ్యంగా ప్రజలందరికీ ఉపయోగపడే రైతు బజార్, మినీ ట్యాంక్ బండ్, మెయిన్ రోడ్ వైడనింగ్ పనులు త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలి. వీటిపై స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారిస్తే బాగుంటుంది.
హర్కార్ మహిపాల్, మెదక్ అభివృద్ధి పోరాట సమితి కన్వీనర్