కరీంనగర్లో రైస్ మిల్లుల్లో వడ్లు మాయం

కరీంనగర్లో రైస్ మిల్లుల్లో వడ్లు మాయం
  •     రూ.50  కోట్ల విలువైన ధాన్యం పక్కదారి
  •     బియ్యంగా మార్చి సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇవ్వకుండ అమ్ముకున్న మిల్లర్లు
  •     జిల్లాలో టాస్క్ ఫోర్స్ దాడుల్లో వెలుగులోకి..

కరీంనగర్, వెలుగు: కస్టమ్ మిల్లింగ్ రైస్​(సీఎంఆర్) కోసం సర్కార్ ఇచ్చిన వడ్లను జిల్లాలోని పలువురు మిల్లర్లు మాయం చేశారు. హుజూరాబాద్, జమ్మికుంటకు చెందిన మిల్లుల్లో సుమారు 3 లక్షల క్వింటాళ్ల వడ్లను బియ్యం మార్చి బహిరంగ మార్కెట్ లో అమ్ముకుని కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారు. 

ఇటీవల సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ టీమ్‌‌‌‌‌‌‌‌ల దాడులతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. ప్రభుత్వం గట్టిగా ఒత్తిడి తీసుకొస్తే బియ్యం అమ్మడం ద్వారా వచ్చిన లాభాల్లో నుంచి వడ్ల రేటు సర్కార్ కు చెల్లించాలనే ఉద్దేశంతో మిల్లర్లు ఉన్నట్లు తెలిసింది.

హుజూరాబాద్, జమ్మికుంట మిల్లుల్లో అక్రమాలు.. 

ఇటీవల హైదరాబాద్ నుంచి వచ్చిన సివిల్ సప్లయీస్ టాస్క్ ఫోర్స్ టీంల దాడుల్లో హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంటలోని 6 రైస్ మిల్లుల్లో అక్రమాలు వెలుగు చూశాయి. వారి తనిఖీల్లో ఆయా మిల్లులకు కేటాయించిన వడ్ల లెక్కలు, నిల్వల్లో తేడాలు ఉన్నట్లు గుర్తించారు. హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌లోని వంశీ  ఇండస్ట్రీస్ లో 10 వేల క్వింటాళ్లు, పరమేశ్వర ఇండస్ట్రీస్ లో 10 వేలు, వినాయక  ఇండస్ట్రీస్ లో 20 వేలు, సాయిట్రేడర్స్ లో 25 వేల క్వింటాళ్ల వడ్లు తేడా ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ బృందం గుర్తించినట్లు సమాచారం. 

జమ్మికుంట కోరపల్లిలోని మహాశక్తి ఆగ్రో ఇండస్ట్రీస్, ఇల్లందకుంటలోని శ్రీ సీతారామ ఇండస్ట్రీస్ లో సుమారు 60వేల క్వింటాళ్ల చొప్పున వడ్లు మాయమైనట్లు తెలిసింది. ఈ ఆరు మిల్లుల్లో ధాన్యం విలువ రూ.60 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

బీఆర్ఎస్​ హయాంలో మిల్లర్ల ఇష్టారాజ్యం.. 

 గత సర్కార్ హయాంలో ఏ సీజన్ కు ఆ సీజన్ లో సీఎంఆర్ ఇవ్వకపోయినా మరుసటి ఏడాది ధాన్యం కేటాయించడమే మిల్లర్లకు కలిసొచ్చింది. అంతేగాక మిల్లర్లు అడిగినప్పుడల్లా సర్కార్ గడువు పొడగించడం కూడా వరంగా మారింది. దీంతో ఒక సీజన్ లో ఇవ్వాల్సిన సీఎంఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆ తర్వాతి సీజన్ లో అడ్జస్ట్ చేస్తూ దాటవేత వచ్చేవారు. ప్రతి సీజన్ లో కొంత బియ్యాన్ని బహిరంగ మార్కెట్ లో అమ్మేసుకుంటున్నారు. 

2022-–23 వానాకాలం, యాసంగిలో కలిపి 24,89,988 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉమ్మడి జిల్లాలోని రైస్ మిల్లర్లకు అప్పగిస్తే ఇప్పటివరకు 6,30,828 మెట్రిక్ టన్నుల బియ్యాన్నే ఇచ్చారు. ఇంకా 8,49,288 మెట్రిక్ టన్నుల బియ్యం పెండింగ్ లో ఉంది. ఈ బియ్యం ఇచ్చేందుకు గడువు డిసెంబర్ 31తో ముగియనుంది. ఇన్నాళ్లు సివిల్ సప్లయీస్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం, కొన్ని చోట్ల వారిచ్చే మామూళ్లకు అలవాటుపడి చూసీచూడనట్లు వదిలేయడంతో సీఎంఆర్ పెండింగ్ భారీగా పెరిగిపోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

ఇటీవల కరీంనగర్ పర్యటనలో రాష్ట్ర సివిల్ సప్లయీస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రీసైక్లింగ్ ను ఉపేక్షించబోమని, మిల్లర్ల అక్రమాలపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించినా వారిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.