పదేండ్లయినా బదిలీల్లేవ్

పదేండ్లయినా బదిలీల్లేవ్

పదేండ్లయినా బదిలీల్లేవ్
స్టాంప్స్​ అండ్​ రిజిస్ట్రేషన్స్​లో పాతుకుపోయిన సబ్​ రిజిస్ట్రార్లు, సిబ్బంది
చాలా చోట్ల వాళ్లు చెప్పిందే రాజ్యం
ప్రతి డాక్యుమెంట్​కు కమీషన్  ఇవ్వాల్సిందే
లేకపోతే ఫైలు ముందుకు కదలదు
డీఐజీలుగా పదోన్నతి వచ్చిన వారికి ఇంకా పోస్టింగ్  ఇయ్యలే

హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర సర్కారుకు కాసులు కురిపించే స్టాంప్స్​ అండ్​ రిజిస్ట్రేషన్ల శాఖలో చాలా మంది అధికారులు, సిబ్బంది ఏళ్ల తరబడి ఒకేచోట తిష్టవేసుకొని కూర్చుంటున్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇంతవరకు డిపార్ట్​మెంట్​లో బదిలీలు జరగలేదు. దీంతో కొన్ని జిల్లాల్లో 11 నుంచి 12 ఏండ్లుగా ఒకే చోట సబ్ రిజిస్ట్రార్లు పనిచేస్తున్నారు. ఆ ప్రాంతంపై తమకు పూర్తిగా పట్టురావడంతో వాళ్లు చెప్పిందే రాజ్యం అన్నట్లుగా నడుస్తున్నది. ప్రతి డాక్యుమెంట్​కు ఇంత అని ముందే ఒక కమీషన్​ను నిర్ధారించుకుని కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆయా సబ్‌‌‌‌ రిజిస్ట్రార్లు, సిబ్బందిపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు వస్తున్నా వారికి ఉన్న అండదండలతో అక్కడే కొనసాగుతున్నారు. దీంతో రిజిస్ర్టేషన్​ ఆఫీసులకు వెళ్లాలంటే ఎంతో కొంత ముట్టజెప్పాల్సిందేనని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

సబ్​ రిజిస్ర్టార్లు మాత్రమే కాకుండా సీనియర్​ అసిస్టెంట్లు, జూనియర్​ అసిస్టెంట్లకు కూడా బదిలీలు లేవు. జిల్లా రిజిస్ట్రార్లు కూడా అట్లనే ఉంటున్నారు.. చిట్‌‌‌‌ఫండ్‌‌‌‌ కంపెనీలకు లైసెన్సులు జారీచేసే రిజిస్ట్రార్లు కూడా 10 నుంచి12 సంవత్సరాలు ఒకేచోట పాతుకుపోయారు. ఇటీవల కొందరు డిస్ట్రిక్​ రిజిస్ట్రార్లకు డీఐజీలుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అయితే వారికి ఇంతవరకు ఎలాంటి పోస్టింగ్  ఇవ్వలేదు. రాష్ట్రవ్యాప్తంగా 143 సబ్ రిజిస్ట్రార్​ కార్యాలయాలు ఉన్నాయి. వారిలో సగం మంది ఇన్​చార్జి సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు. 

ఉమ్మడి రాష్ట్రంలో బదిలీలు

రిజిస్ట్రేషన్ల శాఖలో బదిలీలు జరిగి పదేండ్లు అవుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో సబ్‌‌‌‌ రిజిస్ట్రార్ల జనరల్​ ట్రాన్స్​ఫర్లు జరిగాయి. రాష్ట్రం ఏర్పడిన తరువాత బదిలీలు జరగలేదు. అయితే డిప్యూటేషన్లు, ఇన్​చార్జి పోస్టులు జోరుగా సాగాయి. మియాపూర్‌‌‌‌ భూ కుంభకోణం తర్వాత 2017లో కొందరు సబ్​ రిజిస్ట్రార్లను, అధికారులను బదిలీ చేశారు. ఆ తర్వాత ఇటీవల జరిగిన లోకల్‌‌‌‌ కేడర్‌‌‌‌ అలాట్‌‌‌‌మెంట్‌‌‌‌లో భాగంగా సీనియారిటీ ప్రాతిపదికన కొన్ని పోస్టులు అటుఇటు అయ్యాయి. కింది స్థాయి సిబ్బంది బదిలీలు 2010 తర్వాత జరగనే లేదు. స్టాంప్స్ అండ్​ రిజిస్ట్రేషన్​ డిపార్ట్​మెంట్​లో పూర్తిగా కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు ఆఫీసర్ల బదిలీలపై ఇప్పటికే మూడు, నాలుగుసార్లు ప్రతిపాదనలు సిద్ధం చేసినా అమలు చేయలేదు.

వారం రోజుల కిందట కూడా బదిలీలపై రెవెన్యూ శాఖ​ ప్రిన్సిపల్​ సెక్రటరీ, స్టాంప్స్​ అండ్​ రిజిస్ట్రేషన్స్​ ఐజీ, ఒక నోట్  తయారు చేశారు. అయితే, దానిని ఇటీవల సీఎంఓలో ఉన్నత స్థానంలో నియమితమైన అధికారికి తెలియజేయగా ఆయన ఇవన్నీ ఇప్పుడెందుకు అన్నట్లు తెలిసింది. ఏండ్లుగా ఒకే దగ్గర తిష్టవేయడంతో రిజిస్ట్రేషన్లు, ఇతర పనుల నిమిత్తం సబ్​రిజిస్ర్టార్​ ఆఫీసులు, జిల్లా రిజిస్ట్రేషన్​ కార్యాలయాలకు వచ్చే జనాలకు లంచాల బెడద తప్పడం లేదు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి పూర్తి స్థాయిలో బదిలీల ప్రక్రియ చేపట్టాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అయితే ప్రభుత్వంలో పైస్థాయిలో ఉన్న కొందరు దీనికి అడ్డుపడుతున్నట్లు తెలిసింది. 

ఎంతో కొంత ఇవ్వాల్సిందే

ప్రభుత్వానికి రాబడి తెచ్చే వాటిలో కీలకమైన స్టాంప్స్  అండ్  రిజిస్ట్రేషన్ల శాఖలో కొందరు సబ్‌‌‌‌ రిజిస్ట్రార్లు భారీగా కమీషన్లు తీసుకుంటున్నట్లు ప్రభుత్వానికి చాలా సార్లు ఫిర్యాదులు అందాయి. నిబంధనల మేరకు చేయాల్సిన పనులకు కూడా లక్షల రూపాయలు డిమాండ్‌‌‌‌  చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అడిగింది ఇవ్వకపోతే పనులు పెండింగ్​లో పెట్టడం, డాక్యుమెంట్లను రిజెక్ట్​ చేయడం వంటివి చేస్తున్నారు.

ప్రధానంగా హైదరాబాద్‌‌‌‌చుట్టుపక్కల విధులు నిర్వహిస్తున్న వారిలో కొందరు రోజువారి సంపాదనే లక్ష్యంగా రిజిస్ట్రేషన్లు చేస్తూ.. భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని సమాచారం. ఇప్పటికీ ఏదో ఒకచోట కొందరు సబ్‌‌‌‌ రిజిస్ట్రార్లు ఏసీబీకి పట్టుబడుతున్నారు. దీనికితోడు రిజిస్ట్రేషన్లు, పనిభారం తక్కువగా ఉన్న కార్యాలయాల్లో సీనియర్‌‌‌‌ సబ్‌‌‌‌ రిజిస్ట్రార్లు, అవసరానికి మించి ఉద్యోగులు ఉండగా.. రిజిస్ట్రేషన్లు భారీగా జరుగుతూ పని ఒత్తిడి ఉన్నచోట మాత్రం సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది.