పేద రోగులకు తప్పని ఇబ్బందులు

పేద రోగులకు తప్పని ఇబ్బందులు
  • ప్రైవేట్​లో మాత్రం రోజుకో కొత్త ఆస్పత్రి
  • రాష్ట్రంలో 7 వేల ప్రైవేటు ఆస్పత్రులు
  • సర్కారులో ఉన్నవి వెయ్యి
  • అందులో 840కిపైగా పీహెచ్‌‌సీలే

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ప్రభుత్వ వైద్య సేవలు పెరగట్లేదు. వైద్య సేవలకు ఉన్న డిమాండ్‌‌తో రోజుకో ప్రైవేటు దవాఖాన పుట్టుకొస్తోంది. కార్పొరేట్ కంపెనీలు కొత్త కొత్త బ్రాంచులు ప్రారంభిస్తూ.. రాష్ట్రమంతటా తమ నెట్‌‌వర్క్‌‌ను నెలకొల్పుతున్నయి. కానీ, సర్కార్ దవాఖాన్ల సంఖ్య మాత్రం దశాబ్దాలు గడిచినా పెరగట్లేదు. రాష్ట్రంలో దాదాపు 7000 వేల ప్రైవేటు హాస్పిటళ్లు ఉంటే, 1000 ప్రభుత్వ దవాఖానాలున్నాయి. ఇందులో చిన్నాచితక ట్రీట్‌‌మెంట్ అందించే పీహెచ్‌‌సీలే  840కి పైగా ఉన్నాయి. ఇవి పోను 30 బెడ్లు, అంతకంటే ఎక్కువ బెడ్ల కెపాసిటీతో ఉన్న సర్కార్ దవాఖాన్లు 120 దాకా ఉన్నాయి. రాష్ట్రంలో ఎవరు అనారోగ్యంపాలైనా ఈ హాస్పిటళ్లే దిక్కు అవుతున్నాయి. వీటిల్లో స్టాఫ్‌‌ రిక్రూట్‌‌మెంట్‌‌ సక్కగలేక, సరైన సౌలత్​లు కల్పించకపోవడంతో పేషెంట్లకు ఇబ్బందులు తప్పట్లేదు. రోగాల సీజన్‌‌లో బెడ్లు సరిపోక, పేషెంట్‌‌లోడుకు అనుగుణంగా స్టాఫ్​ లేక పేషెంట్లు అష్టకష్టాలు పడుతున్నారు. ఏటా వర్షాకాలంలో నీలోఫర్‌‌‌‌లో బెడ్లు సరిపోక, ఒక్కో బెడ్డుపై ఇద్దరు, ముగ్గురు పిల్లల్ని పడుకోబెట్టి ట్రీట్‌‌మెంట్ అందిస్తున్నారు. పదేండ్లుగా ప్రతి సీజన్‌‌లో ఇదే సీన్ రిపీట్ అవుతున్నా, మరో దవాఖాన నిర్మించకుండా ప్రభుత్వ పెద్దలు నిర్లక్ష్యం చేస్తున్నారు. 

పాత దవాఖాన్లకే లింకు
రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెంచిన సర్కార్..  ఆయా జిల్లాల్లో కొత్త హాస్పిటళ్లను మాత్రం నిర్మించలేదు. జిల్లా హెడ్ క్వార్టర్లుగా మారిన సిటీలోని ఏరియా  హాస్పిటల్‌‌కే.. డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌‌ అని ఓ బోర్డు తగిలించి చేతులు దులుపుకున్నారు. జిల్లాలు ఏర్పడి 6 ఏండ్లు కావొస్తున్నా.. జిల్లా దవాఖాన్ల స్థాయిలో వాటిని తీర్చిదిద్దలేదు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని అందుబాటులోకి తెస్తున్న సర్కార్, ఆయా కాలేజీలకు అనుబంధంగా కొత్త దవాఖాన్లను మాత్రం కట్టట్లేదు. ఇప్పటికే ఆయా జిల్లాల్లో ఉన్న దవాఖాన్లనే కాలేజీలకు లింకు చేసి వాటిల్లో బెడ్లు పెంచుతున్నారు. కానీ, సౌలత్​లు మాత్రం కల్పించట్లేదు. ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్‌‌ ప్రకారం 100 బెడ్లకు మించి ఉన్న ప్రతి దవాఖానాలో సీటీ స్కాన్ ఉండాలె. కానీ, మన దగ్గర కొత్తగా ఏర్పడ్డ సగం జిల్లా దవాఖాన్లలో సీటీ స్కాన్లు లేవు. ఎంఆర్‌‌‌‌ఐ అయితే పూర్తిగా పాత 10 జిల్లాల్లో కూడా లేకపోవడం గమనార్హం. అవి రిపేర్‌‌‌‌కు వస్తే నెలల తరబడి మూలకే వేస్తూ వస్తున్నారు. ఇటీవలే కొత్త ఎక్విప్‌‌మెంట్ రిపేర్ పాలసీ అందుబాటులోకి వచ్చింది. 

బెడ్ల మీద బెడ్లు పెంచి..
గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, ఎంఎన్‌‌జే, ఈఎన్‌‌టీ, కింగ్ కోఠి దవాఖాన్లు నిర్మించి ఎన్నో ఏండ్లు గడిచినా.. వాటి మాదిరి మరో కొత్త ఆస్పత్రి సిటీలో ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. కానీ, ఈ 20 ఏండ్లలో సిటీ జనాభా దాదాపు మూడింతలు పెరిగింది. దీంతో పెద్ద దవాఖాన్లన్నీ రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. జనాభాకు అనుగుణంగా కొత్త దవాఖాన్లు నిర్మించని సర్కార్, పాత దవాఖాన్లలోనే బెడ్ల మీద బెడ్లు పెంచి మేనేజ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో పేషెంట్  సంఖ్య పెరిగి దవాఖాన్లు కంపు కొడుతున్నాయి. శానిటేషన్ మెయింటేన్ చేయడం అసాధ్యంగా మారుతోంది. అరకొర డయాగ్నస్టిక్ ఎక్విప్‌‌మెంట్లతో ఎక్కువ మంది రోగులకు సేవలు అందించడం డాక్టర్లకు తలకుమించిన భారంగా మారింది. దీంతో ట్రీట్‌‌మెంట్‌‌ కూడా ఆలస్యమవుతోంది.

రెండేండ్లలో 700 కొత్త ఆస్పత్రులు
ప్రభుత్వ దవాఖాన్లు ఎక్కువగా లేకపోవడంతో ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో  ప్రైవేటు హాస్పిటళ్లకు పోవాల్సి వస్తోంది. ఇందుకు తగ్గట్లుగానే రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ప్రైవేటు హాస్పిటల్స్‌‌ వస్తున్నయి. గడిచిన రెండేండ్లలోనే దాదాపు 700 కొత్త హాస్పిటళ్లు రిజిస్టర్ అయ్యాయి. మండల కేంద్రం వరకూ ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లు పుట్టుకొచ్చాయి. కరీంనగర్‌‌‌‌, ఖమ్మం, వరంగల్ వంటి టౌన్లలో సర్కారు దవాఖాన్లు ఒకట్రెండు ఉంటే.. ప్రైవేటు హాస్పిటళ్ల సంఖ్య వందల్లో ఉంది. వైద్య సేవలకు డిమాండ్ ఉండడంతో కోట్లు వెచ్చించి హాస్పిటళ్లు పెడుతున్నారు. ప్రైవేటు వైద్య రంగంపై ప్రభుత్వ​అధికారుల నియంత్రణ లేకపోవడంతో ఇష్టారీతిన చార్జీలు వసూలు చేసి రెట్టింపు సంపాదిస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెంచినట్టు, ప్రభుత్వ హాస్పిటళ్ల సంఖ్య కూడా పెంచితే పేదలకు లబ్ధి  చేకూరుతుందని డాక్టర్లు చెప్తున్నారు.