
సరూర్నగర్ విక్టోరియా మెమోరియల్ హోమ్ రెషిడెన్షియల్ స్కూల్ విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపింది. రాత్రి కనిపించకుండా పోయిన టెన్త్ క్లాస్ విద్యార్థి హరి నాయక్ తెల్లారేసరికి శవంగా మారాడు. కర్మాన్ ఘాట్లో ఓ చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. స్కూల్ ప్రిన్సిపాల్ పట్టించుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని బాలుడి బంధువులు ఆరోపిస్తున్నారు.
హరినాయక్ కు తల్లిదండ్రులు లేకపోవడంతో సరూర్ నగర్ లోని అనాధ విద్యార్థి గృహంలో ఉండి చదువుకుంటున్నాడు. శుక్రవారం సాయంత్రం తోటి విద్యార్థితో గొడవపడ్డ హరి నాయక్ ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. రాత్రి 10 గంటల సమయంలో వైస్ ప్రిన్సిపాల్.. హరి అన్నకు సమాచారం ఇచ్చాడు. వెంటనే వీఎం హోంకు చేరుకున్న అతను పోలీసులకు ఫిర్యాదు చేద్దామన్నా స్కూల్ యాజమాన్యం అంగీకరించలేదు. ఉదయం కర్మన్ ఘాట్ లో ఓ చెట్టుకు హరి మృతదేహం వేలాడుతూ కనిపించింది. రాత్రి నుంచి విద్యార్థి కనిపించకుండా పోయినా ప్రిన్సిపాల్ గానీ, వైస్ ప్రిన్సిపాల్ గానీ పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని మృతుని బంధువులు ప్రశ్నిస్తున్నారు.
హరి మరణం వెనుక మిస్టరీ ఉందని ఆరోపిస్తూ అతని బంధువులు వీఎం హోం ఎదుట ఆందోళనకు దిగారు. మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతుని బంధువుల ఆందోళనతో అనాధ విద్యార్థి గృహం వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. దీంతో అక్కడికి చేరుకున్న ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్ రెడ్డి వారికి నచ్చజెప్పారు. దర్యాప్తు జరిపి నిందితులను శిక్షిస్తామని చెప్పడంతో హరి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు.