
యాదగిరిగుట్ట, వెలుగు : మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు గురువారం యాదాద్రి జిల్లాలో పర్యటించారు. సాయంత్రం 5 గంటలకు యాదగిరిగుట్ట, భూదాన్‌పోచంపల్లికి వచ్చిన సౌతాఫ్రికా, కరేబియన్ ఖండాలకు చెందిన 24 మంది నల్ల కలువలు దాదాపు 4 గంటలపాటు సందడి చేశారు. యాదగిరిగుట్టలో సంప్రదాయ చీరకట్టులో కన్పించిన కరేబియన్‌కు చెందిన 9 మంది అందాల భామలు దేవదేవుడు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. కృష్ణశిలతో పునర్నిర్మితమైన ప్రధానాలయ సప్తగోపుర సముదాయంపై చెక్కిన శిల్పాలు, శిల్పసంపదకు వరల్డ్ బ్యూటీస్ ఫిదా అయ్యారు. మాడ వీధులు, ఆలయ ప్రాకారాలపై శిల్పాలకు ముగ్దులై ఫొటోలు, సెల్పీలు దిగారు. కాగా వీరి పర్యటన సందర్భంగా దర్శనాలు నిలిపివేశారు.
భూదాన్ పోచంపల్లిలో పర్యటించిన సౌతాఫ్రికా ఖండానికి చెందిన 25 మంది భామలు ఫ్యాషన్ డ్రస్సుల్లో సందడి చేశారు. మగ్గంపై చేనేత చీరల తయారీని చూసి ఫిదా అయ్యారు. మగ్గంపై కూర్చుని నేయడానికి ప్రయత్నించారు. సంప్రదాయ వాయిద్యాలను కళాకారులతో ఆడారు. చేతులకు మైదాకు పెట్టించుకొని మురిసిపోయారు. బతుకమ్మను పేరుస్తున్న దృశ్యాలను గమనించి ఆశ్చర్యపోయారు. ఇక్కత్ వస్త్రాలతో ఏర్పాటు చేసిన బొమ్మలతో సెల్ఫీ దిగారు. డప్పుల మోతకు అనుగుణంగా డ్యాన్సులు చేశారు. టూరిజం పార్కులో ఏర్పాటు చేసిన పది చేనేత స్టాళ్లను సందర్శించారు. పోచంపల్లిలో మోడల్స్ నిర్వహించిన ర్యాంప్‌వాక్‌ను చూసి చప్పట్ల వర్షం కురిపించారు. మోడల్స్‌ను అభినందించారు. - యాదాద్రి, భూదాన్ పోచంపల్లి