నంబాల డెడ్​బాడీకి అంత్యక్రియలు.. మృతదేహం అప్పగించని నారాయణపూర్ పోలీసులు

నంబాల డెడ్​బాడీకి అంత్యక్రియలు.. మృతదేహం అప్పగించని నారాయణపూర్ పోలీసులు
  • తెలుగు రాష్ట్రాలకు చెందిన 8 డెడ్​బాడీల దహనం
  • ఏపీ హైకోర్టు ఉత్తర్వులు బేఖాతర్
  • నారాయణపూర్లోనే ఖననం చేయాలని కుటుంబ సభ్యులకు పోలీసుల కండీషన్
  • వారు ఒప్పుకోకపోవడంతో అక్కడే దహనం చేసిన పోలీసులు
  • తీవ్రంగా ఖండిస్తున్న పౌర హక్కుల, ప్రజా సంఘాల నేతలు

భద్రాచలం, వెలుగు: మావోయిస్టు చీఫ్ కమాండర్ నంబాల కేశవరావుతో సహా 8 మంది మావోయిస్టుల మృతదేహాలను చత్తీస్ గఢ్​లోని నారాయణ్​పూర్ పోలీసులు సోమవారం దహనం చేశారు. నంబాల కుటుంబ సభ్యులు ఏపీ హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నా.. వాటిని పోలీసులు పట్టించుకోలేదు. చత్తీస్​గఢ్​కు చెందినోళ్ల మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కానీ.. తెలుగు రాష్ట్రాలకు చెందిన 8 మంది డెడ్​బాడీలను మాత్రం ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ నెల 21న అబూజ్​మడ్ అడవుల్లో జరిగిన ఎన్​కౌంటర్​లో నంబాల కేశవరావు సహా 27 మంది మావోయిస్టులు చనిపోయారు. మరుసటిరోజే వీరి డెడ్​బాడీలన్నీ నారాయణపూర్ జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కుటుంబ సభ్యులంతా 5 రోజులుగా మృతదేహాల కోసం మార్చురీ వద్ద పడిగాపులు కాస్తున్నారు. నంబాల డెడ్​బాడీ అప్పగింతపై ఏపీ హైకోర్టు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కేశవ రావు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీ సజ్జ వెంకట నాగేశ్వర రావు, లలిత, విజయలక్ష్మి, రాకేశ్​తో సహా మరో ముగ్గురి డెడ్​బాడీలను కుటుంబ సభ్యులకు ఇచ్చేందుకు నారాయణపూర్ పోలీసులు నిరాకరించారు. సోమవారం సాయంత్రం 4 గంటల్లోపు డెడ్​బాడీలను ఇక్కడే ఖననం చేయాలని కండీషన్ పెట్టారు. లేదంటే తామే దహనం చేస్తామని హెచ్చరించారు. పోలీసుల కండీషన్​కు వారి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు.

డెడ్​బాడీలు ఇస్తే స్వగ్రామాలకు తీసుకెళ్లి దహన సంస్కారాలు చేపడ్తామన్నారు. చివరికి 8 మంది మావోయిస్టుల డెడ్​బాడీలకు ఆదివాసీ ముక్తిధామ్​లో పోలీసులే అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా.. పోలీసులు డెడ్​బాడీలను దహనం చేయడం చర్చనీయాంశం అవుతున్నది. తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టుల డెడ్​బాడీలను ఉద్దేశపూర్వకంగానే ఇవ్వకుండా నారాయణపూర్ పోలీసులు టైమ్​పాస్ చేశారని చత్తీస్​గఢ్ పౌరహక్కుల సంఘం నేత బేలా భాటియా ఆరోపించారు.

హైకోర్టు ఆదేశాలున్నా.. డెడ్​బాడీలు అప్పగించకుండా పోలీసులే దహనం చేయడం ఇదే తొలిసారని తెలిపారు. కేంద్రం కావాలనే ఇలా చేసిందని పౌర హక్కుల సంఘాల నేతలు మండిపడ్తున్నారు. నంబాల కేశవ రావుది ఏపీలోని శ్రీకాకుళం జిల్లా. నక్సల్ బరి ఉద్యమం ఈ జిల్లాలోనే ఊపిరి పోసుకున్నది. ఈ నేపథ్యంలో నంబాల డెడ్​బాడీ అప్పగిస్తే తిరిగి ఉద్యమం బలపడుతుందనే భయం కేంద్రం ప్రభుత్వం, పోలీసుల చర్యల్లో కనిపిస్తున్నదని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి.