ఆర్కే మృతిపై మావోయిస్టు పార్టీ లేఖ

ఆర్కే మృతిపై మావోయిస్టు పార్టీ లేఖ

మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు రామకృష్ణ మృతిని ధ్రువీకరించారు మావోయిస్టులు. నిన్న ఉదయం 6 గంటలకు ఆయన చనిపోయారని లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో ఈ లేఖ ఉంది. హరగోపాల్ కు అకస్మాత్తుగా కిడ్నీల సమస్య మొదలైందన్నారు మావోయిస్టులు. డయాలసిస్ చేస్తున్న కిడ్నీలు ఫెయల్ అయి ఇతర అనారోగ్య సమస్యలు వచ్చాయని చెప్పారు. మంచి వైద్యం అందించినా రామకృష్ణ ప్రాణాలు దక్కలేదని లేఖలో తెలిపారు. పార్టీ శ్రేణుల మధ్యే ఆర్కే అంత్యక్రియలు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

ఆర్కే చనిపోవడం పార్టీకి తీరని లోటన్నారు మావోయిస్టులు. ఆయన విప్లవోద్యమంలో స్థిరచిత్తంతో పాల్గొన్నాడని చెప్పారు. మొక్కవోని ధైర్య సాహసాలతో పార్టీకి, విప్లవోద్యమానికి నాయకత్వం అందించాడని తెలిపారు. పార్టీ రాజకీయ డాక్యుమెంట్లను రూపొందించడంలో ఆర్కే చురుగ్గా చర్చలు చేసేవాడన్నారు. ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తూ, పార్టీకి అన్ని రంగాల్లో సేవలందించాడని లేఖలో తెలిపారు.

పల్నాడులో మొదలై..

1958 సంవత్సరం గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో జన్మించిన ఆర్కే..పోస్టు గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. తన తండ్రితో పాటు కొన్నాళ్లు టీచర్ గానూ పని చేశారు ఆర్కే. 1978లో విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితుడై...భారతీయ కమ్యూనిస్టు పార్టీ, పీపుల్స్ వార్ లో సభ్యత్వం తీసుకున్నారు. 1980లో గుంటూర్ జిల్లా పార్టీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు ఆర్కే. 

1982 లో పార్టీలోకి పూర్తి కాలం కార్యకర్తగా వచ్చిన ఆర్కే...పల్నాడు ప్రాంతంలో పార్టీ కార్యకలాపాలు చూశారు. 1986 నాటికి గుంటూరు జిల్లా కార్యదర్శిగా ఎదిగారు. 1992 లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికైన ఆయన..దక్షిణ తెలంగాణ ఉద్యమానికి నాలుగేళ్లు నాయకత్వం వహించారు. 2000 సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక కాగా...2001 లో జరిగిన పీపుల్స్ వార్ తొమ్మిదొ కాంగ్రెసులో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

2004లో  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన శాంతి చర్చల్లో పార్టీ ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహించారు ఆర్కే. ప్రభుత్వం ముందు ప్రజల డిమాండ్లను పెట్టి సమర్థవంతంగా తమ వాణి వినిపించారు. ఐతే తర్వాత ఆర్కేను హత్య చేయడానికి ప్రయత్నాలు చేయడంతో ఆయను ఆంధ్రా ఒడిశా బొర్డర్ ఏరియాకు కేంద్రకమిటీ బదిలీ చేసి అక్కడ బాధ్యతలు అప్పగించింది.

2014 వరకు ఏవోబి కార్యదర్శిగా పని చేశారు ఆర్కే.  తర్వాత ఏవోబీని కేంద్ర కమిటీ ద్వారా గైడ్ చేసే బాధ్యత తీసుకున్నారు. 2018లో ఆయన్ని కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరోలో నియమించింది. ప్రస్తుతం AOBలో ప్రభుత్వం కొనసాగిస్తున్న నిర్బంధ కాండ నుంచి పార్టీని, కేడర్ ను రక్షించే బాధ్యతలు చూసుకున్నారు. ఇదే క్రమంలో అనారోగ్యం బారిన పడ్డాడు ఆర్కే. విప్లవోద్యమంలోనే శిరిషతో ఆర్కే వివాహం జరిగింది. వీరికి మున్నా అనే కొడుకు పుట్టాడు. 2016లో జరిగిన ఎదురుకాల్పుల్లో మున్నా చనిపోయాడు. ఆర్కే మరణ వార్త పై స్పందించిన ఆయన భార్య శిరీష. దీనిని ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నట్లు చెప్పింది. ప్రభుత్వం మావోయిస్టు పార్టీని అంతం చేయాలని చూస్తొందని చెప్పింది. ప్రస్తుతం టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఉంటున్న శిరీషను పలువురు విరసం నేతలు పరామర్శించారు.

పలువురి నివాళులు

ఆర్కేకు నివాళులర్పించింది జనశక్తి పార్టీ. భారతదేశ విప్లవానికి, ప్రజా విముక్తికి తన జీవితాన్ని అంకింతం చేసిన అక్కినేని హరగోపాల్ అలియాస్ RKకు విప్లవ జోహర్లు సమర్పించారు జనశక్తి లీడర్ అమర్. RK మరణం విప్లవోద్యమానికి తీరని లోటన్నారు అమర్. RK, ఆయన కుటుంబం చేసిన మహోన్నత త్యాగాలు విప్లవాదర్శాలుగా నిలుస్తాయన్నారు. శాంతి చర్చల టైంలో ఏడాది పాటు R.K తో కలిసి  పనిచేయడం, విప్లవకారుల ఐక్యతకు పాటు పడటం తన జీవితంలో మరిచిపోలేని విషయాలన్నారు అమర్. 

CPI మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ నాయకుడు ఆర్కే మృతికి న్యూడెమోక్రసీ నివాళులర్పించింది. ఈ సందర్భంగా ఆర్కే సేవలను గుర్తు చేసుకున్నారు నేతలు. ప్రజల కోసం ఆర్కే, ఆయన కుటుంబం చేసిన సేవలను కొనియాడారు నేతలు. ఆర్కే మృతి ప్రజా ఉద్యమానికి తీవ్ర నష్టమన్నారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు CPI ML న్యూ డెమోక్రసీ సహాయ కార్యదర్శి పోటు రంగారావు.

మరిన్ని వార్తల కోసం..

రైతు నిరసనల మధ్య దారుణ హత్య

ప్రిన్సిపాల్‌ పోస్ట్‌ కోసం ఆఫీసులోనే కొట్టుకున్నరు

గ‌ద్వాల జిల్లాలో ఆర్టీసీ బ‌స్సు బోల్తా