అనుకూల వాతావరణం కల్పిస్తే చర్చలకు రెడీ

అనుకూల వాతావరణం కల్పిస్తే చర్చలకు రెడీ

భద్రాచలం, వెలుగు : అనుకూలమైన వాతావరణం కల్పిస్తే సర్కార్‌‌తో చర్చలకు తాము సిద్ధమేనని మావోయిస్టు పార్టీ పేర్కొంది. ఈ మేరకు దండకారణ్య స్పెషల్‌‌ జోనల్‌‌ కమిటీ ప్రతినిధి వికల్ప్‌‌ పేరిట గురువారం ఛత్తీస్‌‌గఢ్‌‌ సర్కారుకు ఓ లెటర్‌‌ రిలీజ్‌‌ చేశారు. మావోయిస్టులు చర్చలకు రావాలని ఛత్తీస్‌‌గఢ్‌‌ డిప్యూటీ సీఎం విజయ్‌‌శర్మ ఇటీవల ఆహ్వానించినా ఇప్పటివరకు మావోయిస్టులు స్పందించలేదు. తాజాగా చర్చల ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని అంటూనే కొన్ని షరతులు పెట్టారు. సాయుధ బలగాలను ఆరు నెలల పాటు క్యాంప్‌‌లకే పరిమితం చేయాలని, బూటకపు ఎన్‌‌కౌంటర్లు నిలిపివేయాలని, దండకారణ్యంలో కొత్తగా బేస్‌‌ క్యాంప్‌‌లు ఏర్పాటు చేయొద్దని డిమాండ్‌‌ చేసింది. 

రైతులు, కూలీలు, మధ్యతరగతి ప్రజలు, ఆదివాసీలు, దళితులు, ముస్లిం, మైనార్టీల ప్రయోజనాలే ముఖ్యమని చెప్పారు. తమ షరతులపై సమాధానం ఇవ్వకుండా చర్చలు అంటూ ప్రకటించడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం తాము చర్చలకు సిద్ధమేనని తమ పార్టీ ఎప్పటి నుంచో చెబుతోందన్నారు. భూమి లేని పేద రైతులకు భూమిని కేటాయించడం, రైతు హక్కులను మెరుగుపరచడం, రుణమాఫీ, అన్ని పంటలకు కనీస మద్దతు ధర హామీ, వ్యవసాయ సబ్సిడీల పెంపు, ఉచిత నీటిపారుదల, విద్యుత్‌‌ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌‌ చేశారు. 

వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్‌‌ సంస్థలకు అప్పగించడానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. దండకారణ్యంలో దేశీయ, విదేశీ కంపెనీలతో చేసుకున్న అన్ని అగ్రిమెంట్లను రద్దు చేసుకోవాలన్నారు. గిరిజనుల కోసం జనాభా గణనలో ప్రత్యేక కాలమ్‌‌ పెట్టాలని కోరారు. చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పిలుపునిచ్చారు.