హసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్తి మండలంలో మావోయిస్టు స్మారక స్తూపం కూల్చివేత

హసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్తి మండలంలో మావోయిస్టు స్మారక స్తూపం కూల్చివేత

హసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్తి, వెలుగు: హసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్తి మండలం చింతగట్టు గ్రామంలో మావోయిస్టు స్తూపాన్ని కూల్చడంతో ఉద్రిక్తత నెలకొంది. చింతగట్టు గ్రామానికి చెందిన బూర రాకేశ్​ గతేడాది చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కౌంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మృతిచెందాడు. ఈ నెల 21న అతని వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు తమ ఇంటి ముందు స్తూపం నిర్మాణం చేపట్టారు. సీఐ రవికుమార్, ఎస్సైలు నవీన్, కల్యాణ్ అక్కడికి చేరుకొని ఎలాంటి అనుమతులు లేకుండా స్మారక నిర్మాణం చేపట్టవద్దన్నారు. రాకేశ్​ తల్లిదండ్రులు బూర బాసు, స్వరూప పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

నిర్మాణాన్ని అడ్డుకుంటే పురుగుల మందు తాగుతామని హెచ్చరించారు. దీంతో పోలీసులు బూర బాసు, స్వరూప దంపతులతో పాటు బూర రంజిత్ కుమార్, రేఖలను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. వారిని తహసీల్దార్​ ఎదుట బైండోవర్ చేశారు. అనంతరం స్మారక స్తూపాన్ని నేలమట్టం చేశారు. స్తూపం కూల్చడాన్ని అమరుల బంధు మిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అంజమ్మ ఖండించారు. ఇంటి వద్ద నిర్మించుకున్న స్తూపాన్ని కూల్చివేయడం అప్రజాస్వామిక చర్య అని అన్నారు.