మావోయిస్ట్ రంజిత్ లొంగుబాటు.. బాల్యమంతా మావోలతోనే..

మావోయిస్ట్ రంజిత్ లొంగుబాటు.. బాల్యమంతా మావోలతోనే..

సీపీఐ మావోయిస్టు సభ్యుడు రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ బుధవారం డీజీపీ మహేందర్ రెడ్డి ముందు లొంగిపోయారు. ఆయన పార్టీలో ఇబ్బందులు ఎదుర్కోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు డీజీపీ తెలిపారు. రంజిత్‌కు ఆర్థికసాయంగా ప్రభుత్వం తరపున రూ. 4 లక్షల చెక్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. రంజిత్ లొంగుబాటు గురించి డీజీపీ ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘వరంగల్ జిల్లాకు చెందిన రామన్న, సావిత్రిల కుమారుడు రంజిత్.. ఆరవ తరగతి నుంచే మావోలతో తిరిగేవారు. రంజిత్ బాల్యం అంతా మావోయిస్టు దళాల మధ్యే గడిచింది. రంజిత్ తండ్రి సెంట్రల్ కమిటీ సెక్రెటరీ రామన్న. ఆయన 1982లో పీపుల్స్ వార్ గ్రూప్‌లో జాయిన్ అయ్యారు. రామన్న గుండెనొప్పితో 2019లో మృతి చెందారు. రంజిత్‌ను నగేష్ అనే వ్యక్తి సీక్రెట్‌గా చదివించేవాడు. రంజిత్ టెన్త్ పూర్తి చేసుకున్నాడు. రంజిత్‌ను చదివించిన నగేష్.. 2015లో జరిగిన ఎదురు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. తండ్రి మృతి తర్వాత.. రంజిత్ పార్టీలో ఇబ్బందులు పడ్డాడు. చివరికి లోగుబాటు కావాలని నిశ్చయించుకొని ఈరోజు సరెండర్ అయ్యారు. రంజిత్ లొంగుబాటు.. పార్టీ సభ్యులకు, పార్టీ పెద్దలకు ఇష్టం లేదు. అయినా కూడా రంజిత్ లొంగిపోయాడు. రంజిత్ 2020 నుంచి 21 మధ్యకాలంలో జరిగిన దాడుల్లో పాల్గొన్నారు. ఆ దాడుల్లో 49 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు మావోలు కూడా మృతి చెందారు. చనిపోయిన పోలీసుల నుంచి 12 AK-47తో పాటు, 14 ఫైర్ ఆర్ముడ్ ఆయుధాలను పార్టీ రికవరీ చేసుకుంది. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్స్‌గా తెలంగాణ నుంచి 14 మంది ఉన్నారు. ccm సెక్రెటరీ యపనారాయణ కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయినట్టు రంజిత్ చెప్పాడు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్స్ అందరూ కోవిడ్‌ను దృష్టిలో పెట్టుకుని లొంగిపోవాలని కోరుతున్నాం. తండ్రి రామన్న మృతి తరువాత రంజిత్ పార్టీలో వేధింపులకు గురయ్యాడు. పార్టీలోని సభ్యులు.. రామన్న బతికి ఉన్నప్పుడు ఒకలా.. చనిపోయిన తర్వాత మరొకలా రంజిత్‌తో ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. పార్టీలో రంజిత్ ఎలాంటి ఇబ్బందులు పడ్డారనే దాని గురించి ఇంకా సమాచారం సేకరించాల్సి ఉంది. 
హరి భూషణ్ మృతి తర్వాత ఇంకెవరూ పార్టీ చీఫ్‌గా భాద్యతలు తీసుకోలేదని.. ఇంచార్జిగా దామోదర్ అనే వ్యక్తి ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది’ అని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.