ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

బెల్లంపల్లి రూరల్,వెలుగు: మావోయిస్టులు లాస్ట్​స్టేజీలో ఉన్నారని స్టేట్​ఇంటలిజెన్స్​బ్యూరో ఆపరేషన్ చీఫ్​ఐజీ ప్రభాకర్ రావు చెప్పారు. శుక్రవారం మంచిర్యాల జిల్లాలోని ప్రాణహిత ఏరియా, పలు పోలీస్​స్టేషన్లను డీసీపీ అఖిల్​మహాజన్​తో కలిసి ఆయన తనిఖీ చేశారు. మావోయిస్టుల కదలికలపై నిఘా తీవ్రతరం చేయాలన్నారు. పోలీసులు ప్రజల్లో మమేకమై పనిచేయాలన్నారు. ఆయన వెంట జైపూర్ ఏసీపీ నరేందర్, తాండూర్​ సీఐ జగదీశ్, చెన్నూర్​ రూరల్​ సీఐ విద్యాసాగర్, కన్నెపల్లి, నీల్వాయి ఎస్సైలు సురేశ్, నరేశ్​ ఉన్నారు.

నక్సల్స్​కు సహకరించవద్దు: ఎస్పీ

దహెగాం,వెలుగు: నక్సల్స్​కు ఎవరూ సహకరించవద్దని కుమ్రంభీం ఆసిఫాబాద్​ ఎస్పీ కె. సురేశ్​కుమార్​సూచించారు. శుక్రవారం ఆయన దహెగాం పోలీస్ స్టేషన్​ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. యువత మావోయిస్టులకు సహకరించి విలువైన భవిష్యత్​ను నాశనం చేసుకోవద్దన్నారు. క్రైం కంట్రోల్​కోసం అంతటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అచ్చేశ్వరరావు, కాగజ్ నగర్ డీఎస్పీ కరుణాకర్, సీఐ నాగరాజు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కేసీఆర్​కు భయం

భైంసా,వెలుగు: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణలో విమోచన దినోత్సవం నిర్వహిస్తుండడంతో సీఎం కేసీఆర్​కు భయం పట్టుకుందని, దీంతో ఆయన సమైక్యతా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్​రావు పటేల్​ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక దారాబ్జీ ఫ్యాక్టరీలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చరిత్రను, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏనాడు విమోచన కార్యక్రమాలు నిర్వహించని కేసీఆర్ ఇప్పుడెందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఎంఐఎంకు భయపడే విమోచన దినోత్సవం నిర్వహించడం లేదన్నారు. శనివారం భైంసాలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగుర వేస్తామన్నారు. ప్రధాని మోడీ బర్త్​డే సందర్భంగా హోమం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు కపిల్​ శిండే, దశరథ్, లీడర్లు సుభాష్​ పటేల్, తాడేవార్​ సాయినాథ్, గాలి రవికుమార్, రామకృష్ణ, దిలీప్, స్వామి, బాజనోళ్ల సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు.

టీఆర్ఎస్​ తప్పుడు ప్రచారాలు తిప్పికొట్టాలి

ఆదిలాబాద్​టౌన్,వెలుగు: తెలంగాణ ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయి కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టేందుకు బీజేపీ కార్యకర్తలు రెడీ కావాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్​శంకర్​ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక పార్టీ ఆఫీస్​లో సేవాహీ సంఘటన్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి పార్టీ ఇన్ చార్జి అల్జాపూర్ శ్రీనివాస్, పార్లమెంట్ ఇన్ చార్జి అయ్యన్న గారి భూమన్న చీఫ్​గెస్ట్​లుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాయల్​శంకర్​మాట్లాడుతూ కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటోందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన విమోచన దినోత్సవంతో కేసీఆర్​వణుకు పుట్టిందన్నారు. కార్యక్రమంలో పార్టీ లీడర్లు సుహాసినీరెడ్డి, సాకటి దశరథ్, మయూర్ చంద్ర, జోగు రవి, వేద వ్యాస్, దినేశ్​ మాటోలియ తదితరులు పాల్గొన్నారు. 

విమోచన చరిత్రను గడపగడపకు తీసుకెళ్తాం

నిర్మల్, వెలుగు: తెలంగాణ విమోచన చరిత్రను ప్రతీ గడపకు తీసుకెళ్తామని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి చెప్పారు. శుక్రవారం వేయి ఉరుల మర్రి అమరవీరుల స్తూపం వద్ద ఆమె ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, సీనియర్ లీడర్లు రావుల రామనాథ్, అయ్యన్న గారి భూమయ్య, మెడిసిమ రాజు, జడ్పీటీసీ జానుబాయి, డాక్టర్ మల్లికార్జున్ రెడ్డితో కలిసి మాట్లాడారు. నిర్మల్ లోని వేయి ఉరుల మర్రి చెట్టుకు వెయ్యి మందిని రజాకార్లు ఉరితీశారన్నారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడంలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ చరిత్ర, అమరవీరుల త్యాగాలను విస్మరిస్తోందన్నారు. కార్యక్రమంలో పార్టీ లీడర్లు రాజేశ్వర్ రెడ్డి, పడిపెల్లి గంగాధర్, మానాజీ, హరినాయక్, అలివేలు, కమల్ నయన్, భూషణ్, బాలాజీ, శ్రావణ్ రెడ్డి, రాజేందర్, ఒడిసెల అర్జున్, రాచకొండ సాగర్, ముత్యం రెడ్డి, భీంరావు తదితరులు పాల్గొన్నారు.

సోలార్​ పవర్​ ప్లాంట్​ పనులు స్పీడప్​ చేయాలి

జైపూర్,వెలుగు: జైపూర్ లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ప్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ పనులను శుక్రవారం ఈ అండ్ ఎం డైరెక్టర్ సత్యనారాయణ రావు పరీశీలించారు. ఈ సందర్భంగా ఆయ కాంట్రాక్టర్​తో మాట్లాడారు. పనులు తొందరగా పూర్తిచేయాలని ఆదేశించారు. అనంతరం ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. కార్యక్రమంలో చీఫ్​టెక్నికల్​అడ్వైజర్​ సంజయ్ కుమార్ సూర్, జీఎంలు రాజు, జైన్ సింగ్, విశ్వనాథ రాజు, జానకి రాం , ఏజీఎంలు ప్రసాద్, రాజ శేఖర్ రెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.

కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి  

రామకృష్ణాపూర్​, వెలుగు: రామకృష్ణాపూర్ విద్యానగర్​కు చెందిన దళిత మహిళ గట్టు పోచమ్మ ఇంటిని కబ్జా చేసిన గూడెపు రాజయ్యపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పసుల రామ్మూర్తి అన్నారు. శుక్రవారం ఆయన పోచమ్మ కుటుంబసభ్యులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. రాజయ్య కుటుంబసభ్యులు వికలాంగుడైన తన కొడుకును, తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టి ఇంటి రేకులు పగలగొట్టి ఇంటిని కబ్జా చేశారని అన్నారు. టీఆర్ఎస్ నాయకుల ప్రోద్బలంతోనే ఈ కబ్జా జరిగిందన్నారు. అధికారులు స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసర్ల యాదగిరి, రాష్ట్ర కార్యదర్శి సుద్దాల వెంకటి, జిల్లా అధ్యక్షుడు బైరం ప్రభాకర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు దాసరి జయ, ఉపాధ్యక్షురాలు భోగి రజిని పాల్గొన్నారు.

సింగరేణి కార్మికుల సొత్తు సర్కార్​ పాలు

రామకృష్ణాపూర్​,వెలుగు: సింగరేణిలో టీబీజీకేఎస్​ కారణంగానే రాజకీయ జోక్యం పెరిగిందని, వారి చేతకాని తనం వల్లే కార్మికుల సొత్తు సర్కార్​ పాలవుతుందని ఏఐటీయూసీ జనరల్​ సెక్రటరీ వాసిరెడ్డి  సీతారామయ్య ఆరోపించారు. శుక్రవారం మందమర్రి ఏరియా ఆర్కేపీ ఓపెన్​కాస్ట్​ గనిపై ఏర్పాటు చేసిన గేట్​ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. కార్మికుల కష్టపడి బొగ్గు ఉత్పత్తి సాధించి సంస్థకు వేల కోట్ల లాభాలు తీసుకవస్తే వాటిని వారి సంక్షేమానికి ఖర్చు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి మళ్లిస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు చెల్లిస్తున్నప్పటికి రాష్ట్ర సర్కార్​ నుంచి వచ్చే రూ.10 వేల కోట్ల బకాయిలను ఇవ్వడంలేదన్నారు. ఇటీవల వాసిరెడ్డి సీతారామయ్య ఇండియన్​ మైన్స్​ వర్కర్స్​ ఫెడరేషన్​ ఆలిండియా వర్కింగ్​ ప్రెసిడెంట్​గా ఎన్నికైన సందర్భంగా ఏఐటీయూసీ శ్రేణులు, కార్మికులు ఆయనను సన్మానించారు. సమావేశంలో ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ ఎండీ అక్బర్​అలీ, వైస్ ప్రెసిడెంట్​ ఇప్పకాయల లింగయ్య, పిట్​సెక్రటరీలు ఆంజనేయులు, సంజీవ్, కమిటీ మెంబర్లు రామకృష్ణ, పూరిల్ల శ్రీనివాస్, రాజయ్య, తిరుపతి, వెంకటరెడ్డి, టి.రవీందర్, సంపత్​, వీరయ్య, హుస్సేన్​పాషా, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలి

భైంసా,వెలుగు: తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని  ఢిల్లీలోని టీఆర్ఎస్​ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలచారి డిమాండ్​ చేశారు. శుక్రవారం ఆయన  భైంసాలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ తెలంగాణపై అడుగడుగునా కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. హైదరాబాద్​కు వస్తున్న కేంద్ర మంత్రి అమిత్​షా తెలంగాణకు రావాల్సిన రూ.1.5 వేల కోట్లు విడుదల చేస్తామని ప్రకటించాలని డిమాండ్​చేశారు. విద్యుత్​బకాయిల విషయంలో కేంద్రం చెబుతున్న లెక్కలన్నీ అబద్దాలేనన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏపీకి రూ.33,312 కోట్లు కట్టాలని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆంధ్రప్రదేశ్​ నుంచే తెలంగాణకు రూ. 17,026  కోట్లు రావాల్సి ఉందన్నారు. ఆయన వెంట లీడర్లు కొట్టె హన్మాండ్లు, దేవేందర్, ప్రభాకర్, నరేందర్​తదితరులు ఉన్నారు.

సాయిశ్రీవల్లికి జాతీయ స్థాయి ఇన్​స్పైర్ అవార్డు 

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల శ్రీచైతన్య హైస్కూల్​లో 8 క్లాస్​ చదువుతున్న సాయి శ్రీవల్లికి జాతీయ స్థాయి ఇన్​స్పైర్​ అవార్డు –2021 దక్కింది.  ఈ నెల 14 నుంచి 16 వరకు న్యూఢిల్లీలోని ప్రగతి స్టేడియంలో జరిగిన జాతీయ స్థాయి ఇన్​స్పైర్​ పోటీల్లో సుమారు వెయ్యి మంది విద్యార్థులు పాల్గొనగా, సాయిశ్రీవల్లి తన ప్రదర్శనతో అందరినీ అలరించింది. ఆమె రూపొందించిన 'శ్రీస్​ రుతుమిత్ర కిట్' మన రాష్ట్రం తరుపున ఉత్తమ ప్రదర్శనగా ఎంపికైంది. శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్​లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేందర్ ​సింగ్​ చేతుల మీదుగా అవార్డును అందుకుంది.

డాక్టర్లు అంకిత భావంతో పనిచేయాలి

బెల్లంపల్లి,వెలుగు: డాక్టర్లు అంకితభావంతో పనిచేయాలని వైద్యవిధానపరిషత్ (టీవీవీపీ) కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ సూచించారు. బెల్లంపల్లిలో కొత్తగా నిర్మించిన వంద పడకల ఏరియా హాస్పిటల్​ను ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, వైద్య విధాన పరిషత్ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ అర్వింద్​తో కలిసి ఆయన పరిశీలించారు. అంతకు ముందు కమిషనర్ కమ్యూనిటీ హెల్త్​సెంటర్​ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య సిబ్బంది రోగులకు మెరుగైన సేవలందించాలన్నారు. బాలింతలకు కేసీఆర్​కిట్లు అందించాలన్నారు. కరోనా, గర్భిణులకు ఒకేచోట పరీక్షలు నిర్వహిస్తున్నారని తన దృష్టికి వచ్చిందన్నారు. మరోసారి ఇలా జరగకుండా చూడాలని వైద్యాధికారిని ఆదేశించారు. బెల్లంపల్లిలో డయాలసిస్ సెంటర్​ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎమ్మెల్యే చిన్నయ్య మాట్లాడుతూ రానున్న రోజుల్లో మెడికల్​కాలేజీ అందుబాటులోకి వస్తుందన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్​వో అర్వింద్,​మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమారి, తాండూర్ ఎంపీటీసీ రంగి శంకర్  తదితరులు పాల్గొన్నారు.

గిరిజనుల సమస్యలు పరిష్కరించాలె

బెల్లంపల్లి, వెలుగు: ఆదివాసీ గిరిజనుల సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి సోయం జంగు స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన చలో జోడే ఘాట్ పాదయాత్ర శుక్రవారం బెల్లంపల్లికి చేరింది. ఈ సందర్భంగా జంగు మాట్లాడుతూ లంబాడాలను ఎస్టీల జాబితా నుంచి తొలగించాలన్నారు. పోడు భూములకు హక్కుపత్రాలు ఇవ్వాలన్నారు. ర్యాలీలో లీడర్లు పెద్రం హనుమంతు, మడావి వెంకటేశ్, వెడ్మ కిషన్, కమ్మరి భీమయ్య, అడ జంగు  పాల్గొన్నారు.

సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు కీలకం

రామకృష్ణాపూర్/బెల్లంపల్లి/ఆదిలాబాద్ టౌన్/నస్పూర్,వెలుగు: తెలంగాణ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర కీలకంగా వ్యవహరించారని సీపీఐ లీడర్లు చెప్పారు. శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా  తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాలు ఆవిష్కరించారు.  రామకృష్ణాపూర్​లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్​, బెల్లంపల్లిలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు మిట్లపల్లి వెంకటస్వామి, ఆదిలాబాద్​లో జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, శ్రీరాంపూర్​లో జాతీయ సమితి సభ్యుడు శంకర్ పాల్గొన్నారు.

కాంట్రాక్ట్ కార్మికుల భిక్షాటన

మందమర్రి/నస్పూర్/బెల్లంపల్లి, వెలుగు: న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ శుక్రవారం బెల్లంపల్లిలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు భిక్షాటన చేశారు. ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. నిరసనలో ఐఎఫ్ టీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా, జిల్లా కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్, హెచ్ఎంఎస్ డివిజన్ సీనియర్ లీడర్ ఎండీ గౌస్, ఏఐటీయూసీ బెల్లంపల్లి ఏరియా ప్రధాన కార్యదర్శి ప్రశాంత్  పాల్గొన్నారు. మందమర్రి, శ్రీరాంపూర్ లో జరిగిన ఆందోళనలో  జేఏసీ లీడర్లు శ్రీనివాస్​, ఎండీ జాఫర్, జెట్టి మల్లయ్య, దాసు, రోడ్డ రవీందర్, యాదగిరి,  యాదగిరి, తిరుపతి, మాల్లారెడ్డి, రఘు, సంతోష్​ లు పాల్గొన్నారు.