నెల రోజులు కాల్పులు బంద్.. చర్చలకు సిద్ధం!

 నెల రోజులు కాల్పులు బంద్..  చర్చలకు సిద్ధం!
  • తాత్కాలిక సీజ్ ఫైర్ కు మావోయిస్టుల ప్రతిపాదన? 
  • ఆగస్ట్ 15వ తేదీతో రాసిన ప్రెస్ నోట్ వెలుగులోకి  
  • ఇది నిజమైనదో కాదో చెక్ చేస్తున్నాం: చత్తీస్ గఢ్ హోం మంత్రి విజయ్ శర్మ

రాయ్ పూర్: కేంద్ర ప్రభుత్వంతో నెల రోజులపాటు తాత్కాలిక కాల్పుల విరమణకు మావోయిస్టులు ప్రతిపాదన చేశారని పేర్కొంటున్న ఓ ప్రెస్ నోట్ మంగళవారం బయటకు వచ్చింది. తాత్కాలికంగా కాల్పులు ఆపేందుకు తాము సిద్ధమని.. కొన్ని షరతులతో చర్చలకు కూడా రెడీ అని ఇందులో పేర్కొన్నట్టుగా తెలుస్తున్నది. ఈ ప్రెస్ నోట్ ను సీపీఐ (మావోయిస్ట్) పార్టీ సెంట్రల్ కమిటీ అధికార ప్రతినిధి అభయ్ సంతకంతో, ఆగస్ట్ 15వ తేదీతో రాసినట్టుగా పేర్కొంటున్నారు.

 కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఇంటర్నెట్ ద్వారా, ప్రభుత్వ న్యూస్ చానెళ్ల ద్వారా తెలియజేయాలని మావోయిస్టులు కోరినట్టుగా ఈ మేరకు మీడియాకు అందిన ప్రెస్ నోట్ లో ఉంది. మావోయిస్టు పార్టీ ఇకపై సాయుధ పోరాటం ద్వారా కాకుండా, ప్రజా పోరాటాలతో దేశ సమస్యలను పరిష్కరించడంపై ఫోకస్ పెట్టనున్నట్టు ఇందులో తెలిపారు. అయితే, తొలిసారిగా ఫేస్ బుక్ ఐడీ, ఈమెయిల్ ఐడీతోపాటు అధికార ప్రతినిధి ఫొటోను కూడా మావోయిస్టుల ప్రెస్ నోట్ పై ముద్రించడం ఆశ్చర్యకరంగా మారింది. అంతేకాకుండా, ఈ రెండు పేజీల ప్రెస్ నోట్ కు ఒక వివరణను కూడా జతచేశారు. 

దీనిని ఆగస్ట్ 15వ తేదీనే రాసినా.. కొన్ని కారణాల వల్ల మంగళవారం రాత్రే బస్తర్ లో విడుదల చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. అయితే, ఈ ప్రెస్ నోట్ ఆథెంటిసిటీని తాము చెక్ చేస్తున్నామని చత్తీస్ గఢ్ డిప్యూటీ సీఎం, హోం మంత్రి విజయ్ శర్మ మీడియాకు తెలిపారు. అసలు యుద్ధం అనేదే కొనసాగడం లేదని, అందువల్ల సీజ్ ఫైర్ అనే పదానికే తావు లేదని ఆయన అన్నారు. అలాగే ప్రజాస్వామ్యంలో షరతులతో కూడిన చర్చలు కూడా ఉండవన్నారు. నిజానికి ఆగస్ట్ 15వ తేదీతో ఈ ప్రెస్ నోట్ ఉన్నా.. ఆ తేదీ తర్వాత కూడా మావోయిస్టులు కొందరు గ్రామస్తులను చంపారని, ఐఈడీలు పేల్చి, జవాన్లను గాయపర్చారన్నారు.