3 నెలల గరిష్టానికి హోల్‌‌సేల్‌‌ ఇన్‌‌ఫ్లేషన్‌‌

3 నెలల గరిష్టానికి హోల్‌‌సేల్‌‌ ఇన్‌‌ఫ్లేషన్‌‌

న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చిలో హోల్‌‌సేల్ ఇన్‌‌ఫ్లేషన్ మూడు నెలల గరిష్టాన్ని టచ్ చేసింది. బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, కూరగాయలు, క్రూడాయిల్ ధరలు పెరగడంతో కిందటి నెలలో హోల్‌‌సేల్‌‌ ప్రైస్‌‌ ఇండెక్స్‌‌ (డబ్ల్యూపీఐ)  0.53 శాతానికి పెరిగింది. అంతకు ముందు నెలలో 0.20 శాతంగా రికార్డయ్యింది. కిందటేడాది ఏప్రిల్‌‌ నుంచి అక్టోబర్‌‌‌‌ వరకు డబ్ల్యూపీఐ నెగెటివ్‌‌లో రికార్డవ్వగా, నవంబర్‌‌‌‌లో పాజిటివ్‌‌గా మారింది. 

కిందటేడాది మార్చిలో హోల్‌‌సేల్ ఇన్‌‌ఫ్లేషన్ 1.41 శాతంగా ఉంది. ఫుడ్‌‌ ఇన్‌‌ఫ్లేషన్ మార్చిలో 6.88 శాతానికి పెరిగిందని, కిందటేడాది మార్చిలో ఈ నెంబర్ 5.42 శాతంగా ఉందని ప్రభుత్వం పేర్కొంది. కూరగాయల ధరలను కొలిచే ఇన్‌‌ఫ్లేషన్‌‌ మైనస్‌‌ 2.39 శాతం నుంచి 19.52 శాతానికి పెరిగింది. పెట్రోలియం సెగ్మెంట్‌‌ను కొలిచే ఇన్‌‌ఫ్లేషన్‌‌ కిందటేడాది 23.53 శాతం ఉండగా, ఈ ఏడాది మార్చిలో 10.26 శాతానికి తగ్గింది.