ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిర్మల్, వెలుగు: వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా రైతులకు విస్తృత స్థాయిలో సేవలందాలని  మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం సారంగాపూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా  మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ రైతులకు సక్రమంగా అందేట్లు మార్కెట్ కమిటీ పాలకవర్గాలు కూడా దృష్టి సారించాలన్నారు. రైతులకు పంట కొనుగోలు, గిట్టుబాటు ధర లాంటి విషయాలలో కూడా తోడ్పాటును అందించాలన్నారు. ప్రభుత్వం ప్రతి ఏటా అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరతో కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతుబంధు పథకం ద్వారా రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరిందన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తో పాటు పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ పై కేంద్రం వివక్ష 

ఆదిలాబాద్, వెలుగు : తెలంగాణ  పై కేంద్రం  వివక్ష చూపుతోందని ఎమ్మెల్యే జోగురామన్న మండిపడ్డారు. భోరజ్ నుంచి బేల మహారాష్ట్ర సరిహద్దు వరకు నిర్మించనున్న జాతీయ రహదారి  పనులను త్వరగా ప్రారంభించడంతో పాటు.. నాలుగు వరసల రహదారి నిర్మించాలని డిమాండ్ చేస్తూ శనివారం భోరజ్ అంతరాష్ట్ర రహదారిపై టీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. నాలుగు వరసల జాతీయ రహదారిని రెండు వరసలకే పరిమితం చేస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానిక బీజేపీ నేతలు, ఎంపీ ఈ విషయమై కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని పేర్కొన్నారు. లేనిపక్షంలో ప్రజలే వారికి తగిన గుణపాఠం చెప్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో  జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్, నేతలు  గోడం నగేశ్​, అడ్డి భోజారెడ్డి,  మనోహర్, వైస్ చైర్మన్ జెహిర్ రంజాని,    తదితరులు పాల్గొన్నారు.

రాజాసింగ్​  విడుదల కోసం మహా హారతి

ఆదిలాబాద్, వెలుగు : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్​ను వెంటనే విడుదల చేయాలని శనివారం స్థానిక గోపాలకృష్ణ మఠంలో మహా హారతి కార్యక్రమం నిర్వహించారు. మఠాధిపతి యోగానంద సరస్వతి పాల్గొనగా..  కృష్ణునికి హారతి ఇచ్చి,  పూజలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం అక్రమంగా పీడీ యాక్ట్ పెట్టి జైల్లో వేశారని మండిపడ్డారు. కార్యక్రమంలో కార్యకర్తలు మనోజ్ పవర్, మద్నేసురేందర్, రాకేశ్, కృష్ణ, సూర్య కిరణ్ పాల్గొన్నారు.

చెరువులో గల్లంతైన వ్యక్తుల మృతదేహలు లభ్యం

భీమారం, వెలుగు:  భీమారం మండలం లోని నర్సింగాపూర్  చెరువులో గురువారం గల్లంతయిన అన్న దమ్ములు  మాన్తయ్య, పోచయ్య మృత దేహాలు శనివారం  దొరికాయి.   ఇద్దరి మృతదేహాలు నీటి పైన తేలాయి. విషయం తెలుసుకున్న శ్రీరాంపూర్ సీఐ రాజు  గజ ఈతగాళ్ళ సహాయం తో  మృత దేహాలను ఒడ్డుకు తెప్పించారు. జైపూర్  ఎస్సై  గంగా రాజ గౌడ్ స్థానిక ఏఎస్సై భూమన్న ఆధ్వర్యంలో మృతదేహలకు ఘటనా స్థలంలో పోస్ట్ మార్టం చేసి,  కుటుంబీలకు అప్పగించారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

పూడ్చిన  మృత దేహం వెలికితీత

ఇచ్చోడ, వెలుగు : గుడిహత్నూర్ మండలం ధంపూర్ అటవీ ప్రాంతంలో  పూడ్చిపెట్టిన మృతదేహాన్ని  స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు.  గుడిహత్నూర్​కు  చెందిన పారిశుద్ధ్య కార్మికులు శనివారం చెత్తను డంపింగ్ యార్డుకు తీసుకెళ్లారు . ఈ క్రమంలో దుర్వాసన రావడంతో  కార్మికులు అటువైపు వెళ్లి చూడగా, మృతదేహానికి సంబంధించిన కాలు ఒకటి బయటకు కనిపించింది.  వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ నైలు, ఎస్సై ప్రవీణ్ కుమార్ , తహసీల్దార్ సంధ్యారాణి  ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు . పూడ్చి ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు . దాదాపుగా 4 రోజుల క్రితం మృతిచెందినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వయస్సు దాదాపుగా 35 వరకు ఉంటుందని తెలిపారు . హత్యాకోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

సీపీఐ మహాసభలను సక్సెస్​ చేయాలె

మందమర్రి,వెలుగు:  విజయవాడలో ఈనెల 14  నుంచి 18వ తేదీ వరకు జరిగే  సీపీఐ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా సెక్రటరీ రామడుగు లక్ష్మన్​ కోరారు. శనివారం మున్సిపల్​ ఆఫీస్​ ఆవరణలో ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని కమ్యూనిస్టు లీడర్లతో పాటు ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరవుతున్నట్లు వివరించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పరిశ్రమలను  ప్రైవేటీకరణ చేస్తోందన్నారు.  కార్యక్రమమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భీమనాధుని సుదర్శనం, కౌన్సిల్​ సభ్యులు సలెంద్ర సత్యనారాయణ,  టౌన్​ సెక్రటరీ కామెర దుర్గారాజ్​  పాల్గొన్నారు. 

ఆత్మీయ సమ్మేళనం

కాగ జ్ నగర్, వెలుగు:  కౌటల మండలం విజయనగరం లోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శనివారం జరిగింది. ఒక్కచోట చేరిన ఉపాధ్యాయులు, స్టూడెంట్స్ ఆప్యాయంగా పలకరించుకుని,   విశేషాలు పంచుకున్నారు.  1997 లో పదో తరగతి చదివిన స్టూడెంట్స్ ఆత్మీయంగా ఆటాపాటలతో సరదాగా గడిపారు. అప్పటి స్కూల్ ఫాదర్ జేమ్స్ ఎం తుండియిల్ సహా టీచర్లు పాల్గొన్నారు.

బీజేపీ సెగ్మెంట్​ ఇన్​చార్జిల నియామకం

నిర్మల్, వెలుగు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ సెగ్మెంట్లకు బీజేపీ ఇన్​చార్జిలను నియమించింది. నిర్మల్ కు నాయుడు ప్రకాశ్​, ముధోల్ కు మ్యాన మహేశ్, ఖానాపూర్ కు నీలం రాజు,  అదిలాబాద్ కు అల్జాపూర్ శ్రీనివాస్, బోథ్ కు సుగుణాకర్ రావు, మంచిర్యాలకు పల్లె గంగారెడ్డి, బెల్లంపల్లి కి కౌశిక్ హరి, చెన్నూర్ కు మృత్యుంజయ, ఆసిఫాబాద్ కు శ్రీకాంత్, సిర్పూర్ కు రాజమౌళి గౌడ్ ఇన్​చార్జిలుగా నియమితులయ్యారు.

జోడేఘాట్ కు ప్రత్యేక బస్సులు

నిర్మల్, వెలుగు: కుమ్రం భీమ్ 82వ వర్ధంతి సందర్భంగా నిర్మల్ నుంచి జోడేఘాట్ కు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు నిర్మల్ ఆర్టీసీ డిఎం సాయన్న పేర్కొన్నారు. ఆదివారం ఉదయం  నుంచి మధ్యాహ్నం వరకు నిర్మల్ బస్టాండ్  నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయని  తెలిపారు.

అడవుల సంరక్షణ అందరి బాధ్యత

జన్నారం,వెలుగు: అడవులతోనే మానవుని మనుగడ ఆధారపడిఉందని,  అడవుల సంరక్షణకు అందరు బాధ్యత తీసుకోవాలని ఎఫ్​డీవో మాధవరావు అన్నారు. కవ్వాల్ టైగర్ జోన్ లో  వారం రోజులుగా  జరుగుతున్న వన్యప్రాణి వారోత్సవాలు శనివారంతో ముగిశాయి. మండల కేంద్రంలోని ఫారెస్ట్ డివిజన్ ఆఫీస్  నుంచి గోండుగూడ గెట్ నెం1 వరకు ఫారెస్ట్ ఆఫీసర్లు, ప్రజాప్రతినిధులు, స్టూడెంట్లు ర్యాలీ నిర్వహించారు. అనంతరం    సమావేశంలో ఆయన మాట్లాడారు.అడవులుంటేనే వర్షాలు పడతాయని,  వన్యప్రాణులు మానుగడ సాగిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, తాళ్లపేట, ఇందన్ పెల్లి రేంజ్ ఆఫీసర్లు రత్నకర్,హఫీజోద్దిన్,జన్నారం సర్పంచ్ గంగాధర్,కో అప్షన్ సభ్యుడు మున్వర్ ఆలీఖాన్,కాంగ్రెస్ జిల్లా సెక్రటరీమోహన్ రెడ్డి,డివిజన్ లోని ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.

 మహిళ హత్య

బెల్లంపల్లి రూరల్, వెలుగు: కాసిపేట మండలంలోని అశోక్​నగర్​లో భూతగాదాలతో శనివారం ఓ మహిళ హత్య కు గురైంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఏమూర్ల ఎల్లమ్మ(56) బెల్లంపల్లిలో ఉంటోంది.  ఆమె అక్కాచెల్లెల్లు తన తండ్రి భూమి అని  కాసిపేట శివారులోని మూడెకరాలకోసం కోసం నాలుగేండులగా ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో బంధువు బాలయ్య కుటుంబంతో వివాదం పెరిగింది.  ఎల్లమ్మ శనివారం భూమివద్దకు వెళ్లగా.. అక్కడ ప్రత్యర్థులు గొడ్డలితో నరికారు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఇంకా ఫిర్యాదు రాలేదని కాసిపేట ఎస్సై గంగారాం తెలిపారు.