పత్తి రైతులు మునుగుతున్నరు

పత్తి రైతులు మునుగుతున్నరు
  • 12% తేమ మించితే కొనుగోలు చేయని సీసీఐ
  • అందినకాడికి దోచుకుంటున్న వ్యాపారులు
  • క్వింటాల్​కు రూ. 1500 కూడా దక్కని పరిస్థితి
  • అకాల వర్షాలతో భారీగా తగ్గిన దిగుబడి
  • కూలీ పైసలు కూడా వెళ్తలేవంటున్న రైతులు

హైదరాబాద్​/జయశంకర్‌‌ ‌‌భూపాలపల్లి,  వెలుగు: రాష్ట్రంలో పత్తిసాగు భారీగా పెరిగినా అకాల వర్షాలు దిగుబడిపై ప్రభావం చూపించాయి. పత్తిని మార్కెట్‌‌కు  తీసుకువస్తే తేమ ఎక్కువగా ఉందని మార్కెట్​ వర్గాలు వెనక్కి పంపుతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థ సీసీఐ రాష్ట్రవ్యాప్తంగా 306 పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే.. 8 శాతంలోపు తేమ ఉన్న పత్తికే పూర్తి మద్దతు ధర (క్వింటాల్​కు రూ. రూ. 5,550) చెల్లిస్తోంది. ఆపై తేమ శాతం ఉంటే క్వింటాలుకు పదిశాతం కోత విధిస్తోంది.

12 శాతం తేమ మించితే అసలు కొనుగోలు చేయడం లేదు. దీంతో గత్యంతరం లేక రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదునుగా వ్యాపారులు అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్​ జిల్లాలో అయితే తేమ 12 శాతానికి పైగా ఉంటే.. రూ. 2 వేలు కూడా చెల్లించడం లేదు. కొన్ని ప్రాంతాల్లోనైతే పత్తి నల్లగా మారిందని చెప్పి రూ. 1200 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో చాలా ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగాల్సి వస్తోంది. రాస్తారోకోలు చేయాల్సి వస్తోంది.

వ్యాపారుల అతి తెలివి

తీసుకొచ్చిన పత్తిని రైతులు తిరిగి తీసుకెళ్లరని వ్యాపారులు ఉద్దేశపూర్వకంగానే ధరను భారీగా తగ్గిస్తున్నారు.  రోజువారీ వేలం పాటలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తన్నారనే విమర్శలు ఉన్నాయి. రైతుల వద్ద పత్తి పంట ఉన్నప్పుడు ధర పెంచని వ్యాపారులు.. పంట విక్రయించిన తర్వాత చివరిలో  ధరను పెంచుతూ రావడం గత కొన్నేళ్లుగా జరుగుతోంది.  దీంతో  రైతులు నష్టపోవాల్సి వస్తుండగా.. వ్యాపారులు లాభపడుతున్నారు.

అప్పుల కుప్ప

దున్నడం, విత్తనాల కొనుగోలు, విత్తనాలు నాటడం, కలుపు, గుంటకలు తిప్పడం, ఎరువులు, పురుగు మందులు, పత్తి ఏరడం వంటి పనుల కోసం ఎకరానికి రూ. 25 వేలకు పైగా రైతులు పెట్టుబడిపెట్టారు. ఈ సారి పలు చోట్ల బ్యాంకర్లు అప్పులివ్వకపోవడంతో వడ్డీ వ్యాపారుల వద్ద రూ. 2 నుంచి రూ. 5 వడ్డీకి అప్పులు తీసుకొచ్చి పంట సాగు చేపట్టారు. గులాబీ రంగు పురుగు ఉధృతి లేకపోవడంతో పత్తులు చాలా ఏపుగా ఎదిగాయి. చెట్టుకు వందకు పైగా పూత, కాత వచ్చింది. వాతావరణం అనుకూలిస్తే ఎకరానికి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని రైతులు ఆశించారు. సెప్టెంబర్‌‌‌‌, అక్టోబర్‌‌‌‌ నెలల్లో ఎడతెరపిలేకుండా కురిసిన వానలతో పూత రాలింది. కాయలు మురిగిపోయాయి. పెద్దగా విచ్చుకోలేదు. నల్లగా మారిపోయాయి. కొన్ని కాయలు మాత్రం విచ్చుకొని పత్తి ఏరడానికి వీలైంది. రైతులు కూలీలతో పత్తి కాయలు తెంపి పత్తి వేరుచేయాల్సి వచ్చింది. ఇలా వేరు చేసిన పత్తి నల్లగా మారడంతో గాలికి ఆరబోయడం చేశారు. రెండు నెలల పాటు కురిసిన అకాల వర్షాల వల్ల  పత్తి పంటకు భారీ నష్టం వాటిల్లింది. ఎకరానికి 5 క్వింటాళ్లకు మించి పత్తి దిగుబడి రాలేదని రైతులు వాపోతున్నారు. నల్లగా మారిన పత్తి క్వింటాల్‌‌‌‌కు రూ. 2 వేలలోపే ప్రైవేటు వ్యాపారులు చెల్లిస్తున్నారని ఉమ్మడి వరంగల్​ జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోనైతే రూ. 1200 వరకే చెల్లిస్తున్నారు. ఎకరానికి సుమారు 3 క్వింటాళ్ల నాణ్యమైన పత్తి, మిగతా 2 క్వింటాళ్లు నల్లగా మారిన పత్తి కావడంతో రైతులకు పెట్టుబడులు కూడా చేతికి అందడం లేదు.

47.46 లక్షల ఎకరాల్లో సాగు

పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 42..62లక్షల ఎకరాలు కాగా,  సాధారణ విస్తీర్ణం కంటే అదనంగా ఐదు లక్షలు ఎకరాలు ఎక్కువగానే సాగేంది. ఈ ఏడాది గణనీయంగా 47.46 లక్షల  ఎకరాల్లో పత్తి పంట సాగైంది. ప్రారంభంలో వర్షాలు పడక సీజన్‌‌ ఆలస్యంగా ప్రారంభమైంది. జులై నెలాఖరు నుంచి ఆగస్టులో భారీగా వర్షాలు కురువడంతో పత్తి సాగు గణనీయంగా పెరిగింది. కీలకమైన అక్టోబర్​లో  పంట మొదటి దశ సమయంలో ఎడ తెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పత్తి పంట బాగా దెబ్బతిన్నది. ఈ ఏడాది పత్తిపంట సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగినా లక్షలాది ఎకరాల్లోని పంట నష్టం జరిగింది. తీరా పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాల కారణంగా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

12 శాతం కన్నా ఎక్కువ తేమ ఉంటే వెనక్కే

రోజూ 20 వేల క్వింటాళ్ల పత్తి మార్కెట్‌‌కు వస్తోంది. 8 శాతం తేమ ఉన్న పత్తికి మద్దతు ధర రూ.5,550 చెల్లిస్తున్నాం.   9 శాతం తేమ ఉంటే మరో రూ. 55.50 తగ్గుతోంది. 10 శాతం తేమ ఉంటే రూ.100 తగ్గుతోంది. 12 శాతం దాటితే  కొనడం లేదు. నాణ్యత నిబంధనల మేరకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తేమ శాతంపై ధరను పెంచాలని సీసీఐకి  లేఖ రాశాం. అనుమతి లభిస్తే ఎక్కువశాతం తేమ ఉన్నా కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది. – లక్ష్మీభాయి, మార్కెటింగ్​ శాఖ డైరెక్టర్‌‌, జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి జిల్లా

దిగుబడి తగ్గింది

ఈ ఏడాది మూడెకరాల్లో పత్తి సాగు చేశా. ఇప్పటి వరకు మొత్తంగా రూ. 90 వేలు  పెట్టుబడి పెట్టాను. కానీ అకాల వర్షాల కారణంగా దిగుబడి తగ్గింది. రెక్కల కష్టం పోను పెట్టిన పైసలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ సారి పత్తికి గులాబీ పురుగు బెడద లేదు. అయినా అకాల వర్షాలతో నష్టం చవిచూడాల్సి వస్తుంది. నల్లబడిన పత్తికి మార్కెట్లో  ధర తక్కువ అంటున్నారు. పత్తి అమ్మగా వచ్చే పైసలు కూలీలకు కూడా సరిపోవడం లేదు. ‒  లెంకల రాఘవరెడ్డి, జూబ్లీనగర్​, జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి జిల్లా

క్వింటాల్‌‌‌‌కు రూ.1,200 ఇచ్చారు

రెండెకరాలలో పత్తి పంట సాగు చేశాను. అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిని. పూత, కాత రాలిపోయింది. కాస్త పండిన పత్తిని ఏరడానికి 32 మంది కూలీలు అవసరమయ్యారు. ఎకరానికి 3 క్వింటాళ్ల చొప్పున 6 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పత్తి నల్లగా ఉందని క్వింటాల్‌‌‌‌కు రూ.1,200 చొప్పున రూ.7,200 ఇచ్చారు. ఈ డబ్బు కూలీలకు ఇవ్వడానికి సరిపోయాయి.‒ గొట్టం రవీందర్‌‌‌‌, వెంకటాపూర్‌‌, ములుగు జిల్లా

ఎట్ల బతికేది?

రెండెకరాల్లో పత్తి పంటవేశాను. భారీ వర్షాల కారణంగా పత్తి పంట మొత్తం ధ్వంసమైంది. ఎకరానికి రూ. 30 వేల చొప్పున రూ. 60 వేలు పెట్టుబడి పెట్టాను. ప్రస్తుతం ఎకరానికి రూ. 4 వేలు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కూలీల ఖర్చుకు కూడా సరిపోవడం లేదు. ఇలాగైతే ఎట్ల బతికేది? ‒ ఏలేటి జయపాల్, ఏలేటి రామయ్యపల్లి,

Market sources are backing out the cotton because of moisture is high