అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'పై ఇళయరాజా కేసు.. ఓటీటీ నుంచి సినిమా తొలగింపు!

అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'పై ఇళయరాజా కేసు.. ఓటీటీ నుంచి సినిమా తొలగింపు!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రం ఊహించని వివాదంలో చిక్కుకుంది. మే 8వ తేదీన విడుదలైన ఈ మూవీలో తన అనుమతి లేకుండా పాటలను ఉపయోగించారంటూ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం..  ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ నుంచి తొలగించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.  కోర్లు ఆదేశాలతో ఓటీటీ నుంచి తొలగించేశారు. దీంతో తమిళంతో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో వీక్షిస్తున్న అజిత్ అభిమానులను నిరాశ ఎదురైంది.

ఇళయరాజా లీగల్ నోటీస్..

అసలు ఈ వివాదానికి ప్రధాన కారణం ఇళయరాజా పాటలు. 1982 నుంచి 1996 మధ్య కాలంలో ఆయన స్వరపరిచిన మూడు పాటలను 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రంలో ఉపయోగించారు.  ఈ పాటలకు సంబంధించిన కాపీరైట్ తనకే ఉందని పేర్కొంటూ..  ఇళయరాజా ఏప్రిల్ 11, 2025న చిత్ర నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్‌కు లీగల్ నోటీస్ పంపారు. అయితే నిర్మాతలు ఏప్రిల్ 28న ఒక సాధారణ సమాధానం మాత్రమే ఇచ్చారని, పాటల వాడకానికి సంబంధించి సరైన వివరణ ఇవ్వలేదని కోర్టు పేర్కొంది.

 దీంతో ఇళయరాజా కోర్టును ఆశ్రయించారు. సెప్టెంబర్ 8న జస్టిస్ ఎన్. సెంథిల్‌కుమార్ ఆదేశాలు జారీ చేస్తూ..  నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్‌ను ఈ సినిమాను ఏ వేదికపైనా ప్రదర్శించకుండా, విక్రయించకుండా, పంపిణీ చేయకుండా,  ప్రసారం చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ నుంచి తొలగించేశారు. 

 మైత్రి మూవీ మేకర్స్‌ చుక్కెదురు..

ఈ వివాదంపై నిర్మాత యలమంచిలి రవిశంకర్ స్పందిస్తూ, తాము పాటల వినియోగానికి సంబంధించి అన్ని మ్యూజిక్ లేబుల్స్ నుంచి అనుమతులు తీసుకున్నామన్నారు. తాము నిబంధనల ప్రకారమే వ్యవహరించామని తెలిపారు. అయితే, ఈ విషయంలో ఇళయరాజాకే కోర్టులో అనుకూలమైన తీర్పు రావడం గమనార్హం. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ 'గుడ్ బ్యాడ్ అగ్లీ' చిత్రంలో అజిత్‌తో పాటు త్రిష క్రిష్ణన్, అర్జున్ దాస్, ప్రభు, ప్రసన్న, జాకీ ష్రాఫ్ వంటి ప్రముఖ నటులు నటించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 248 కోట్లు వసూలు చేసి అజిత్‌కు భారీ విజయాన్ని అందించింది.

ఇది తొలిసారి కాదు..

పాటల కాపీరైట్స్ విషయంలో ఇళయరాజా లీగల్ చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది మలయాళ చిత్రం 'మంజుమ్మెల్ బాయ్స్' లో ఆయన పాట 'కన్మణి అన్బోడు కాదలన్..'ను అనుమతి లేకుండా ఉపయోగించగా, అప్పుడు కూడా ఆయన నోటీసులు పంపారు. ఆ సినిమా భారీ విజయం సాధించడంతో, తర్వాత నిర్మాతలు ఇళయరాజాకు రూ.60 లక్షలు పరిహారంగా చెల్లించి..  ఈ సమస్యను పరిష్కరించుకున్నట్లు సమాచారం.  లేటెస్ట్ గా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మూవీ ఈ లీగల్ సమస్య కారణంగా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ వివాదం ఎప్పుడు, ఎలా ముగుస్తుందో వేచి చూడాలి మరి.