
పన్ను ఎగవేతకు సంబంధించిన కేసులో మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డితో సహా.. మొత్తం 12 మందిని ఐటీ అధికారులు విచారిస్తున్నారు. మల్లారెడ్డి తమ్ముడు గోపాల్ రెడ్డి, కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి సహా 12 మంది హాజరయ్యారు. ఐటీ విచారణకు వచ్చిన వారిలో MLRIT కాలేజీ ఛైర్మన్ లక్ష్మణ్ రెడ్డి, మల్లారెడ్డి విద్యాసంస్థలకు చెందిన శివకుమార్ రెడ్డి, నర్సింహారెడ్డి, త్రిశూల్ రెడ్డి, మెడికల్ కాలేజీ డైరెక్టర్ రామస్వామిరెడ్డి ఉన్నారు. మల్లారెడ్డి కాలేజ్ ప్రిన్సిపల్ మాధవి.. మెడికల్ కాలేజీ అకౌంటెంట్, ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్, మల్లారెడ్డి ఎడ్యుకేషన్ గ్రూప్ కు చెందిన ఇద్దరు అకౌంటెంట్స్ కూడా ఐటీ విచారణకు హాజరయ్యారు.
మర్రి లక్ష్మణ్ రెడ్డి, నరసింహారెడ్డి, త్రిశూల్ రెడ్డి విచారణ ముగియడంతో ఐటీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు. డబ్బులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి తననేమీ ప్రశ్నించలేదన్నారు లక్ష్మణ్ రెడ్డి. తాను MLRIT ఛైర్మన్ గా మాత్రమే ఉన్నానని.. ఆర్థిక లావాదేవీలకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను కాలేజీలో పిల్లల ఫిట్నెస్, స్పోర్ట్స్ మాత్రమే చూసుకుంటానని ఇదే విషయాన్ని ఐటీ అధికారులకు చెప్పానన్నారు లక్ష్మణ్ రెడ్డి. మళ్లీ రావాలని ఐటీ అధికారులు తనకు చెప్పలేదన్న మర్రి లక్ష్మణ్ రెడ్డి.. తమ కాలేజీకి సంబంధించిన కొంతమందిని విచారిస్తున్నారని తెలిపారు.
ఎల్లుండి మరోసారి రావాలని నరసింహారెడ్డి, త్రిశూల్ రెడ్డికి ఐటీ అధికారులు సూచించారు. తమను ఎలాంటి ప్రశ్నలు ఐటీ అధికారులు అడగలేదన్నారు. ఆర్థిక లావాదేవీలు, కాలేజీ విషయాలే ఏవీ అడగలేదన్నారు. ఎల్లుండి విచారణకు హాజరవుతామని నరసింహారెడ్డి, త్రిశూల్ రెడ్డి అన్నారు.