పదో తరగతి బాలికకు పెండ్లి.. హాజరైన 200 మందిపై కేసు

పదో తరగతి బాలికకు పెండ్లి.. హాజరైన 200 మందిపై కేసు

ముంబై : ఆ బాలిక(16) చదువుతున్నది పదో తరగతి. ఇటీవల ప్రారంభమైన ఫైనల్ ఎగ్జామ్స్ లో మూడు పేపర్లు కూడా రాసింది. మ్యాథ్స్ ఎగ్జామ్ కోసం కష్టపడి ప్రిపేర్ అయ్యింది. కానీ పరీక్ష రాయడానికి వెళ్లాల్సిన రోజే ఆమె పెండ్లి కూతురైంది. దురదృష్టవశాత్తు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే టైమ్ కే బాలిక మెడలో తాళి కూడా పడింది. విషయం తెలుసుకున్న అధికారులు బాల్యవివాహంపై మండిపడ్డారు. పెండ్లికి వచ్చిన150 నుంచి-200 మందిపై పోలీసు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లా పెర్లిలో జరిగింది.

16 ఏళ్ల బాలికకు వివాహం చేస్తున్నారని  చైల్డ్‌లైన్ హెల్ప్‌లైన్ నంబర్ 1098కు ఓ వ్యక్తి సోమవారం సమాచారం అందించాడు. దాంతో గ్రామసేవక్ ( విలేజ్ వర్కర్ ) జ్ఞానేశ్వర్ ముకాడే బాలిక ఇంటికి బయలుదేరాడు. ఆయన గ్రామానికి చేరుకునేలోపే బాలిక పెండ్లి జరిగిపోయింది. వివాహం గురించి వివరాలు తెలియజేయాలని పెండ్లి పెద్దలను ముకాడే ప్రశ్నించగా.. అక్కడున్నవారెవ్వరూ  స్పందించలేదు. దాంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు. బాలిక ఇంటికి చేరుకున్న పోలీసులు.. బాల్య వివాహానికి హాజరైన150 నుంచి-200 మందిపై కేసు నమోదు చేశారు.