
సికింద్రాబాద్: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారంలో ఓ వివాహిత మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. తమ కూతుర్ని అల్లుడే చంపి ఆత్మ హత్య చేసుకున్నదంటూ నమ్మించాలని చూస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాకు చెందిన భవాని(29)కి ప్రకాశం జిల్లాకు చెందిన గంగాధర్(43)కు 2008 లో మ్యారేజ్ జరిగింది.వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. బ్రతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన వీరు.. కుషాయి గూడ లో నివాసం ఉంటున్నారు.ఆ దంపతుల మధ్య పెళ్లైన మూడు సంవత్సరాల నుండే మనస్పర్ధలు వచ్చి గొడవలు జరిగినట్లు అమ్మాయి తరుపు కుటుంబ సభ్యులు తెలిపారు.
రెండు రోజుల క్రితం.. మీ కూతురు చావు బతుకుల మధ్య ఉందంటూ గంగాధర్ భవాని తల్లికి ఫోన్ చేయడంతో ఆమె తల్లిదండ్రులు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి చేరుకోగా.. అప్పటికే తమ కూతురు చనిపోయిందని తెలుసుకొని బోరున విలపించారు. తమ కూతురు చనిపోయేంత పిరికిది కాదని, భర్త మరియు అతని కుటుంబ సభ్యులే చంపి ఆత్మహత్య చిత్రీకరిస్తున్నారంటూ అంటూ ఆరోపిస్తున్నారు.
2017 లోనే భవానికి గంగాధర్, అతని కుటుంబ సభ్యుల నుంచి వరకట్న వేధింపులు ఎక్కువ కావడంతో పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. పోలీసులు ఆ సమయంలో ఇరువురి మధ్య కౌన్సిలింగ్ ఇచ్చి పంపారని, ఆ తర్వాత మంచిగా ఉంటారనుకుంటే ఇలా జరిగిందని భవాని తరఫు బంధువులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఈ ఘటనకు కారకులు అయిన ఆమె భర్తను, అతని తోపాటు మిగతా నిందితులను కఠినంగా శిక్షించాలని కీసరా పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు భవాని కుటుంబ సభ్యులు.