అమ్మకాల్లో మారుతి హవా

అమ్మకాల్లో మారుతి హవా

న్యూఢిల్లీ: సెమీ కండక్టర్ల కొరత తీరిపోవడంతో పాటు సప్లై చెయిన్లు మెరుగుపడటంతో దాదాపు అన్ని ఆటోమొబైల్​ కంపెనీల అమ్మకాలు పోయిన నెలలో బాగా పెరిగాయి.  మారుతీ సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్  మహీంద్రా & మహీంద్రా వంటి ఆటో మేకర్లు జులైలో దేశీయ ప్యాసింజర్ వెహికల్​అమ్మకాల్లో రెండంకెల గ్రోత్​ సాధించాయి.  కియా ఇండియా, టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం), హోండా కార్స్ ఇండియా, స్కోడా ఆటో ఇండియా  కూడా తమ దేశీయ ప్యాసింజర్ వెహికల్స్​ను పెద్ద ఎత్తున అమ్మాయి. మారుతీ సుజుకి ఇండియా దేశీయ ప్యాసింజర్ వెహికల్​అమ్మకాలు 2021 జూలైలో 1,33,732 యూనిట్లతో పోలిస్తే పోయిన నెలలో 6.82 శాతం పెరిగి 1,42,850 యూనిట్లకు చేరుకున్నాయి. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కొరత ప్రధానంగా దేశీయ మోడళ్లలో వెహికల్ ఉత్పత్తిపై కొంచమే ప్రభావం చూపిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, టూర్ ఎస్​,  వ్యాగన్ఆర్‌‌లతో సహా కాంపాక్ట్ కార్లు  2022 జులైలో 84,818 యూనిట్లు అమ్ముడయ్యాయి. పోయిన ఏడాది జులై నెలలో 70,268 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఆల్టో  ఎస్​-ప్రెస్సో వంటి మినీ కార్ల అమ్మకాలు -- 2021 జూలైలో 19,685 యూనిట్ల నుండి పోయిన నెలలో 20,333 యూనిట్లకు పెరిగాయి.   బ్రెజ్జా, ఎర్టిగా, ఎస్​-క్రాస్ , ఎక్స్​ఎల్​6తో సహా యుటిలిటీ వెహికల్ అమ్మకాలు 32,272 యూనిట్ల నుంచి 23,272 యూనిట్లకు పడిపోయాయి.    ఎంఎస్​ఐ ఇండియా సీనియర్ డైరెక్టర్ (మార్కెటింగ్  సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ  మాట్లాడుతూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇండస్ట్రీ 37 లక్షల యూనిట్ల అమ్మకాల మార్క్​ను సాధిస్తుందని, ఇది రికార్డు లెవెల్​ అని పేర్కొన్నారు.

ఇతర కంపెనీల అమ్మకాలు
హ్యుందాయ్ మోటార్ ఇండియా దేశీయ అమ్మకాలు పోయిన నెలలో 50,500 యూనిట్లుగా ఉండగా, 2021 జూలైలో అమ్మిన 48,042 యూనిట్ల కంటే  ఇవి 5.1 శాతం ఎక్కువ అని కంపెనీ పేర్కొంది.  సెమీకండక్టర్ల పరిస్థితి మెరుగుపడటంతో, ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ అద్భుతమైన గ్రోత్​ సాధించిందని హెచ్​ఎంఐఎల్​ డైరెక్టర్ (సేల్స్, మార్కెటింగ్ & సర్వీస్) తరుణ్ గర్గ్ చెప్పారు. టాటా మోటార్స్ దేశీయ ప్యాసింజర్ వెహికల్​ అమ్మకాల్లో 57 శాతం గ్రోత్​తో 47,505 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ కంపెనీ పోయిన ఏడాది ఇదే నెలలో 30,185 యూనిట్లు అమ్మింది. కంపెనీ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వెహికల్​(ఈవీ) అమ్మకాలు కూడా 2021 జులైలో 604 యూనిట్ల నుంచి పోయిన నెలలో 4,022 యూనిట్లకు పెరిగాయి.

మహీంద్రా అండ్ మహీంద్రా, కియా... 
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ ఈ ఏడాది జూలైలో దేశీయ ప్యాసింజర్ వెహికల్​అమ్మకాలు 33 శాతం పెరిగి 28,053 యూనిట్లకు చేరుకున్నాయి. పోయిన ఏడాది ఇదే నెలలో 21,046 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈసారి  యుటిలిటీ వెహికల్​ అమ్మకాలు 27,854 యూనిట్లుగా ఉన్నాయి. అంతకు ముందు ఏడాది నెలలో 20,797 యూనిట్లను అమ్మింది. కియా ఇండియా 2021 జులై అమ్మకాలు 15,016 యూనిట్లతో పోలిస్తే ఈసారి అమ్మకాలు 47 శాతం పెరిగి 22,022 యూనిట్లకు చేరుకున్నాయి. సప్లై చెయిన్‌‌లో క్రమంగా మెరుగుదల,  బ్రాండ్‌‌కు నిరంతర డిమాండ్ కంపెనీ గ్రోత్​కు కారణమని కియా ఇండియా వైస్ ప్రెసిడెంట్ & సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ బ్రార్ తెలిపారు.

టొయోటా కిర్లోస్కర్...
టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) ఈ జులైలో 19,693 యూనిట్లను సేల్​ చేసింది. ఒక నెలలో అత్యధిక డిస్పాచ్‌‌లను రిపోర్టు చేయడం ఇదే మొదటిసారి. 2021 జులైలో అమ్మిన 13,105 యూనిట్ల కంటే ఇవి 50 శాతం ఎక్కువ. బజాజ్ ఆటో టూవీలర్​ వెహికల్​ అమ్మకాల్లో 5 శాతం తగ్గి 3,15,054 యూనిట్లకు పడిపోయాయి.  పూణేకు చెందిన ఈ వెహికల్​ తయారీ సంస్థ పోయినేడాది జూలైలో మొత్తం 3,30,569 టూవీలర్​ వెహికల్స్​ను డిస్పాచ్​ చేసింది. టీవీఎస్​ మోటార్స్​ మొత్తం అమ్మకాలు 13 శాతం పెరిగి 3,14,639 యూనిట్లకు చేరుకున్నాయి.  పోయిన ఏడాది ఇదే నెలలో కంపెనీ మొత్తం 2,78,855 యూనిట్లను సేల్​ చేసింది. టూవీలర్​ వెహికల్​ అమ్మకాలు 14 శాతం పెరిగి 2,99,658 యూనిట్లకు చేరుకున్నాయి. స్కోడా ఆటో అమ్మకాలు 3,080 యూనిట్ల నుంచి 4,447 యూనిట్లకు పెరిగాయి. హోండా కార్స్ ఇండియా అమ్మకాలు 12 శాతం పెరిగి 6,784 యూనిట్లకు చేరాయి. ఎంజీ మోటార్​ జూలైలో రిటైల్ అమ్మకాలు 5 శాతం తగ్గి 4,013 యూనిట్లకు చేరుకున్నాయని కంపెనీ తెలిపింది.