మారుతి విస్తరణ కోసం 50 వేల కోట్ల పెట్టుబడులు​

మారుతి విస్తరణ కోసం 50 వేల కోట్ల పెట్టుబడులు​

న్యూఢిల్లీ: మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ తన కంపెనీని పెద్ద ఎత్తున విస్తరించనుంది.  2030–-31 నాటికి రూ. 50 వేల కోట్లకు పైగా ఇన్వెస్ట్​ చేయనుంది. ఈ పెట్టుబడిలో ఎక్కువ భాగం.. అంటే దాదాపు రూ. 45 వేల కోట్లను వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు పెంచడానికి కేటాయిస్తుంది. ప్రస్తుతం ఇది 20 లక్షల యూనిట్ల వరకు ఉంది.  సప్లయ్ చెయిన్‌‌ను మెరుగుపరచడం, ఎగుమతి మౌలిక సదుపాయాలను విస్తరించడం, మార్కెటింగ్  సేల్స్ టీమ్‌‌‌‌లను బలోపేతం చేయడం కోసం కూడా కొంత డబ్బును ఖర్చు పెడుతుంది. 

2031 ఆర్థిక సంవత్సరం నాటికి 7.50 లక్షల వెహికల్స్​ను ఎగుమతి చేయాలన్నది కంపెనీ టార్గెట్​. ప్రస్తుతం ఏటా  2.50 లక్షల బండ్ల వరకు ఎగుమతి చేస్తోంది. సెల్లర్లకు కూడా మద్దతును పెంచుతామని దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి చైర్మన్ ఆర్​సీ భార్గవ చెప్పారు. 

హర్యానాలోని ఖార్‌‌‌‌ఖోడాలోని ఫెసిలిటీ  మొదటి యూనిట్ 2025 ప్రారంభంలో ఉత్పత్తిని మొదలుపెడుతుంది. ఇది  2.50 లక్షల బండ్లను తయారు చేయగలుగుతుంది. ఈ ప్లాంట్ 10 లక్షల యూనిట్ల పూర్తి సామర్థ్యాన్ని చేరుకునే వరకు ప్రతి సంవత్సరం సామర్థ్యాన్ని పెంచుతుంటారు.

 అదనంగా పది లక్షల యూనిట్ల వార్షిక సామర్థ్యంతో రెండవ ప్లాంట్ కోసం స్థలాన్ని ఖరారు చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. ఇక్కడ 2027 ఆర్థిక సంవత్సరం నాటికి ఉత్పత్తి మొదలవుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.