
- రెండో స్థానంలో ఎం అండ్ ఎం.. హ్యుందాయ్ 4వ స్థానానికి
న్యూఢిల్లీ: మనదేశంలో అతిపెద్ద కార్ల కంపెనీ మారుతి సుజుకి ఇండియా మార్కెట్ వాటా గత నెల దేశీయ ప్యాసింజర్ వెహికల్స్ విభాగంలో 40 శాతం దిగువకు పడిపోయింది. మహీంద్రా అండ్ మహీంద్రా రెండో అతిపెద్ద ఆటో కంపెనీగా ఎదిగింది. ఎంతోకాలంగా నంబర్ 2 కంపెనీ అయిన హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఐఎల్) ఈ ఏడాది ఏప్రిల్‌లో 12.47 శాతం మార్కెట్ వాటాతో నాలుగో స్థానానికి పతనమయింది. టాటా మోటార్స్ 12.59 శాతం మార్కెట్ వాటాతో మూడవ స్థానాన్ని నిలబెట్టుకుంది.
ఫాడా విడుదల చేసిన డేటా ఈ విషయాలను తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మొత్తం దేశీయ ప్యాసింజర్ వెహికల్స్ (పీవీ) రిటైల్ అమ్మకాలు 3,49,939 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏప్రిల్‌లో 3,44,594 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఏడాది లెక్కన ఇది 1.55 శాతం వృద్ధి అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమోటివ్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) తెలిపింది.
మారుతి సుజుకి ఇండియా రిటైల్ అమ్మకాలు 2025 ఏప్రిల్‌లో 39.44 శాతం మార్కెట్ వాటాతో 1,38,021 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో కంపెనీ 1,39,173 యూనిట్ల రిటైల్ అమ్మకాలను సాధించింది. అప్పుడు దీని మార్కెట్ వాటా 40.39 శాతంగా ఉంది. 2024-–25లో కంపెనీ 40.25 శాతం మార్కెట్ వాటాతో 16,71,559 యూనిట్ల రిటైల్ అమ్మకాలను సాధించింది. 2023–-24లో ఇది 40.6 శాతం మార్కెట్ వాటాతో 16,08,041 యూనిట్లను అమ్మింది.
జోరు మీదున్న మహీంద్రా అండ్ మహీంద్రా
ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యధికంగా మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ఎం) లాభపడింది. బలమైన ఎస్యూవీ అమ్మకాల కారణంగా దూసుకుపోయింది. ఈసారి మహీంద్రా అండ్మహీంద్రా రిటైల్ అమ్మకాలు 48,405 యూనిట్లుగా ఉన్నాయి. ఇవి 13.83 శాతం మార్కెట్ వాటాకు సమానం. గత ఏడాది ఇదే నెలలో కంపెనీ 38,696 యూనిట్లను విక్రయించి 11.23 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. మార్కెట్ వాటా పరంగా నాలుగో స్థానంలో నిలిచింది. 2024-–25లో కంపెనీ రిటైల్ అమ్మకాలు 5,12,626 యూనిట్లుగా ఉన్నాయి. అప్పుడు 12.34 శాతం మార్కెట్ వాటా ఉంది. టాటా మోటార్స్ కంటే వెనుకబడింది. 2023–-24లో ఇది 4,27,390 యూనిట్లను అమ్మి 10.79 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది.
43,642 యూనిట్లను అమ్మిన హ్యుందాయ్
హ్యుందాయ్ గత నెలలో 43,642 యూనిట్లను సేల్చేసింది. 12.47 శాతం మార్కెట్ వాటాతో నాలుగో స్థానంలో ఉంది. ఇది గత ఏప్రిల్‌లో 49,243 యూనిట్లను విక్రయించి, 14.29 మార్కెట్ వాటాతో రెండో అతిపెద్ద ఆటో కంపెనీగా నిలిచింది. 2024-–25లో మొత్తం రిటైల్ అమ్మకాలు 5,59,149 యూనిట్లు కాగా,13.46 శాతం మార్కెట్ వాటా ఉంది. 2023-–24లో, ఇది 5,62,865 యూనిట్లను అమ్మి 14.21 శాతం మార్కెట్ వాటాను సంపాదించుకుంది.
మూడో స్థానంలో టాటా
టాటా మోటార్స్ 2025 ఏప్రిల్‌లో 44,065 యూనిట్లను అమ్మి 12.59 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. మూడో అతిపెద్ద ఆటో కంపెనీగా కొనసాగుతోంది. గత సంవత్సరం ఇదే నెలలో, కంపెనీ 46,915 బండ్లను అమ్మి 13.61 శాతం మార్కెట్ వాటాతో మూడోస్థానంలో నిలిచింది. అప్పుడు కూడా హ్యుందాయ్ రెండోస్థానంలో ఉంది. మార్చి 31, 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో, టాటా మోటార్స్ రిటైల్ అమ్మకాలు 5,35,960 యూనిట్లుగా ఉన్నాయి. దీని మార్కెట్ వాటా 12.9 శాతంగా ఉంది. కంపెనీ 2024 ఆర్థిక సంవత్సరంలో 5,39,567 యూనిట్లను అమ్మి 13.62 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది.