క్యారెక్టర్ కోసం బ్రిటిషోళ్ళతోనే కొట్లాడి, గెలిచింది

క్యారెక్టర్ కోసం బ్రిటిషోళ్ళతోనే కొట్లాడి, గెలిచింది

మనిషికి క్యారెక్టర్​ చాలా ముఖ్యం. చేయని తప్పును అంటగట్టాలని చూస్తే ఎవరూ ఊరుకోరు. కానీ, ఎదుటివాళ్ళు బలవంతులైతే? డబ్బు, అధికారం, పలుకుబడి ఉంటే? ఇంకా చెప్పాలంటే అవతలివాళ్లు యజమానులైతే?... ఇంకేముంది! మౌనంగా నిందను భరించడమే అంటున్నారా? కానే కాదు. ఎదుటివాళ్ళు ఎంతటోళ్ళయినా తగ్గే ప్రసక్తే లేదని వందేళ్ళ కిందటే ధైర్యంగా నిలబడింది మేరీ యాన్​. మన దేశానికి చెందిన ఈ మహిళ తన క్యారెక్టర్ కోసం ఏకంగా బ్రిటిషోళ్ళతోనే కొట్లాడి, గెలిచింది.

అది 1826 మే. బ్రిటన్​ పాలనలో ఉన్న మనదేశంలోని కలకత్తా(ఇప్పటి కోల్​కతా) నుంచి ‘రాయల్​ జార్జ్​’ ​ నౌక బయల్దేరింది. అందులో స్కాట్​, వార్నర్​ అనే వితంతువులైన అక్కాచెల్లెలు ఉన్నారు. వీళ్ళు సర్​ హెన్రీ వైట్​ కూతుళ్ళు. బెంగాల్​ ఆర్మీలో పనిచేసేవాళ్ళు. తమ దేశం ఇంగ్లండ్​కు వెళ్తూ, తోడుగా ఆయా మేరీ యాన్​ను తీసుకెళ్ళారు. నౌక కొంతదూరం వెళ్ళాక తమ లగేజ్​లో కొంత భాగం మిస్సయినట్లు ఆ అక్కాచెల్లెలు​ గమనించారు. మేరీనే తమ సామాను దొంగతనం చేసిందని నౌక కెప్టెన్​ రేనాల్డ్స్​కు ఫిర్యాదు చేశారు. ఆయన మేరీ​ లగేజీని చెక్​ చేశారు. కానీ, పోయిన వస్తువులు దొరకలేదు.

దాదాపు నెల తర్వాత నౌక ఇంగ్లండ్​కు చేరుకుంది. ఆ వెంటనే మేరీపై మెరిల్​బోన్ కోర్టులో కేసు పెట్టారు స్కాట్​, వార్నర్​. మరోవైపు కొన్నేండ్ల కిందటే ఇంగ్లండ్​కు వచ్చి, పడవ నడుపుకొని బతుకుతున్న తన కొడుకును అనుకోకుండా కలిసింది మేరీ.  అతనితో కలసి కోర్టుకు హాజరైంది.​ వాళ్ళింట్లో పనిచేస్తే, తిరిగి ఇండియాకు వెళ్ళేటప్పుడు తనకు పది పౌండ్లు, క్యారెక్టర్​ సర్టిఫికెట్​ ఇస్తామని స్కాట్​, వార్నర్​​ అన్నట్లు కోర్టుకు చెప్పింది. అవి ఎగ్గొట్టడానికే తనపై దొంగతనం ఆరోపణలు చేస్తున్నారని బలంగా వాదించింది. తాను ఇంతకుముందు ఐదుసార్లు లండన్​కు వచ్చి పనిచేశానని, తన క్యారెక్టర్ మంచిదంటూ పాత యజమానులు ఇచ్చిన సర్టిఫికెట్లు కూడా చూపించింది. కావాలంటే తనపై పడవలో దర్యాప్తు జరిపిన కెప్టెన్​ రేనాల్డ్స్​ను కూడా ఆ విషయం అడగమంది. జడ్జితో రేనాల్డ్స్​కు లెటర్ రాయించింది. 

కొన్ని రోజులకు రేనాల్డ్స్​ నుంచి జడ్జికి లెటర్ వచ్చింది. అందులో మేరీ యాన్​ క్యారెక్టర్​ అనుమానించేలా ఏమీ లేదని ఉంది. దాంతో మేరీతో గొడవను పరిష్కరించుకోవాలంటూ స్కాట్​, వార్నర్​లను జడ్జి ఆదేశించాడు. ఆ తర్వాత మేరీకి ఐదు బంగారు నాణేలతోపాటు, ఎనిమిది రూపాయల డబ్బు, క్యారెక్టర్ సర్టిఫికెట్ ఇచ్చి పంపారు ఆ అక్కాచెల్లెలు. దాంతో తిరిగి ఇండియాకు వచ్చింది మేరీ. అలా క్యారెక్టర్​ కోసం బ్రిటీషోళ్లతోనే కొట్లాడి గెలిచింది.