మాస్కులు పెట్టుకోవాలె.. ఫిజికల్​ డిస్టెన్స్ పాటించాలె

మాస్కులు పెట్టుకోవాలె.. ఫిజికల్​ డిస్టెన్స్ పాటించాలె
  • నేచురల్ ఇమ్యూనిటీ, టీకాలతో రక్షణ: కేంద్రం 
  • అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని విజ్ఞప్తి 
  • మాస్కులు పెట్టుకోవాలె.. ఫిజికల్​ డిస్టెన్స్ పాటించాలె

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్రత తక్కువగానే ఉండొచ్చని శుక్రవారం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. డెల్టా వేరియంట్ వ్యాప్తి వల్ల చాలా మందికి యాంటీబాడీలు ఏర్పడ్డాయని, వ్యాక్సినేషన్ స్పీడప్ చేసినందున కొత్త వేరియంట్ ఎఫెక్ట్ పెద్దగా ఉండకపోవచ్చని తెలిపింది. అయినా మాస్క్​లు పెట్టుకోవాలని, కరోనా రూల్స్​ పాటించడం మర్చిపోవద్దని, అందరూ టీకాలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు దేశంలో 40 ఏండ్లు, ఆపై వయసున్నోళ్లకు బూస్టర్ డోస్ టీకాలు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని కేంద్రానికి ఇండియన్ సార్స్- కరోనా వైరస్ 2 జీనోమిక్స్ కన్సార్షియం(ఇన్సాకాగ్) సిఫార్సు చేసింది. అయితే సైంటిస్టుల సిఫార్సును బట్టి బూస్టర్ డోస్ పై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హెల్త్ మినిస్టర్ మన్ సుఖ్ మాండవీయ తెలిపారు. 12 నుంచి 17 ఏండ్ల పిల్లలకు టీకా విషయమై సైంటిఫిక్ ఎవిడెన్స్ లను ఎక్స్ పర్ట్​లు పరిశీలిస్తున్నారని పేర్కొన్నారు.

న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్రత తక్కువగానే ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ‘‘మన దేశంలో చాలా మందిపై డెల్టా వేరియంట్ ప్రభావం చూపింది. దీనివల్ల ఎక్కువ మందిలో యాంటీబాడీలు ఉన్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ ను కూడా స్పీడప్ చేశాం. కాబట్టి నేచురల్ ఇమ్యూనిటీతో పాటు టీకాల వల్ల ఒమిక్రాన్ తీవ్రత తక్కువగానే ఉంటుందని అంచనా వేశాం” అని తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. ‘‘సౌత్​ ఆఫ్రికాతో పాటు ఇతర దేశాల్లోనూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇది మరిన్ని దేశాలకూ విస్తరించే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో మన దేశంలో మరిన్ని కేసులు బయటపడొచ్చు” అని పేర్కొంది. కరోనా కట్టడికి టీకానే మార్గమని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతమున్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్ ను అడ్డుకోలేవని చెప్పడానికి ఎలాంటి ఎవిడెన్స్ లేదంది. కాగా, డెల్టా వేరియంట్ కట్టడికి తీసుకున్న చర్యలనే ఒమిక్రాన్ కట్టడి కోసం తీసుకోవాలని డబ్ల్యూహెచ్​వో సూచించింది. మాస్కులు పెట్టుకోవడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం ముఖ్యమని చెప్పింది. వ్యాక్సినేషన్ స్పీడప్ చేయాలని సూచించింది.

పిల్లలకు టీకాపై పరిశీలన
ఒమిక్రాన్ కేసులను గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ ముఖ్యమని చెప్పింది. ప్రయాణికులపై నిఘా పెట్టాలని, టెస్టుల సంఖ్యను పెంచాలని, కాంటాక్ట్ ట్రేసింగ్ చేయాలని సూచించింది. కాగా, సైంటిస్టుల సిఫార్సును బట్టి బూస్టర్ డోస్ పై నిర్ణయం తీసుకుంటామని.. ఇది పొలిటికల్ డెసిషన్ కాదని లోక్ సభలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ చెప్పారు. 12 నుంచి 17 ఏండ్ల పిల్లలకు టీకా ఇచ్చే విషయమై సైంటిఫిక్ ఎవిడెన్స్ లను ఎక్స్ పర్టులు పరిశీలిస్తున్నారని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు.

ఢిల్లీలో 12కు పెరిగిన అనుమానిత కేసులు
రోజురోజుకూ ఒమిక్రాన్ అనుమానిత కేసులు పెరుగుతున్నాయి. విదేశాల నుంచి శుక్రవారం ఢిల్లీకి వచ్చిన వారిలో.. ఒమిక్రాన్ లక్షణాలున్న నలుగురిని ఎల్ఎన్​జేపీ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అందులో ఇద్దరికి కరోనా పాజిటివ్​గా కన్ఫామ్​ అయిందని, మరో ఇద్దరి టెస్టుల రిజల్ట్ రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. వీరిలో ఇద్దరు లండన్ నుంచి, ఒకరు ఫ్రాన్స్ నుంచి, మరొకరు నెదర్లాండ్స్ నుంచి వచ్చారని చెప్పారు. కాగా, ఇప్పటివరకు ఢిల్లీలో ఒమిక్రాన్ అనుమానిత కేసుల సంఖ్య 12 కు చేరుకుంది. గురువారం నాటికే 8 మంది ఒమిక్రాన్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. వీళ్లందరి శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్స్​కు పంపించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు కర్నాటకలో రెండు ఒమిక్రాన్  కేసులు కన్ఫామ్ అయ్యాయి.

ఒమిక్రాన్​ పేషెంట్​ దుబాయ్​ పారిపోయిండు
బెంగళూరు: ఒమిక్రాన్​ వైరస్​ పాజిటివ్​ గా తేలిన పేషెంట్ ఒకరు హోటల్​ నుంచి దుబాయ్​ పారిపోయిండని  కర్నాటక ప్రభుత్వం వెల్లడించింది. ఈ నెల 20న సౌత్​ ఆఫ్రికా నుంచి వచ్చిన 66 ఏండ్ల వృద్ధుడికి ఎయిర్​పోర్టులో చేసిన టెస్టులో పాజిటివ్​ వచ్చిందని రెవెన్యూ మినిస్టర్​ ఆర్​ అశోక్​ చెప్పారు. కరోనా నెగెటివ్​ సర్టిఫికెట్​ వచ్చిన ఆ వృద్ధుడు ఓ హోటల్​లో దిగాడన్నారు. పాజిటివ్​ రావడంతో మరుసటి రోజు ప్రభుత్వ డాక్టర్​ వెళ్లి ఆయనను పరీక్షించగా వైరస్​ లక్షణాలు లేవని తేలిందన్నారు. దీంతో హోటల్​లోనే క్వారెంటైన్​ కావాలని సూచించామని, తర్వాత ఆయన శాంపిల్​ను జినోమ్​ సీక్వెన్సింగ్​ పరీక్షకు పంపగా.. ఒమిక్రాన్​ వేరియంట్​ సోకినట్లు తేలిందన్నారు. ఈలోగా ఆ వృద్ధుడు హోటల్​ను ఖాళీ చేసి వెళ్లిపోయాడని చెప్పారు. ఎక్కడికి వెళ్లాడని ఆరా తీయగా..  ప్రైవేట్​ ల్యాబ్​ నుంచి కరోనా నెగెటివ్​ సర్టిఫికెట్​తో దుబాయ్​ వెళ్లాడని తేలిందన్నారు. మరోవైపు  విదేశాల నుంచి వచ్చిన పదిమంది ఎయిర్​పోర్ట్​ నుంచి మిస్సయ్యారని, వారి ఆచూకీ కోసం గాలిస్తున్నామని మంత్రి చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో ఒమిక్రాన్​ కట్టడి కోసం కరోనా టీకా రెండు డోసులు వేసుకున్నోళ్లనే మాల్స్, థియేటర్లలోకి అనుమతించాలని బొమ్మై సర్కారు ఆర్డర్​ వేసింది.

బూస్టర్ డోస్‌‌కు సిఫార్సు
దేశంలో 40 ఏండ్లు, ఆపై వయసున్నోళ్లకు బూస్టర్ డోస్ ఇచ్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఇండియన్ సార్స్–కోవ్–2 జీనోమిక్స్ కన్సార్టియం(ఇన్సాకాగ్) సిఫార్సు చేసింది. ‘‘ప్రస్తుత వ్యాక్సిన్లతో వచ్చే యాంటీబాడీ లు ఒమిక్రాన్ ను అడ్డుకోవడానికి సరిపోయేలా కనిపించడంలేదు. అయితే వ్యాధి తీవ్రతను మాత్రం తగ్గించగలవు. అందుకే ఇంకా టీకాలు వేసుకోనోళ్లకు వేయడంతో పాటు ముప్పు ఎక్కువగా ఉండే 40 ఏండ్లు, ఆపై వయసు వారికి బూస్టర్ డోస్ ఇచ్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి” అని వీక్లీ బులెటిన్ లో పేర్కొంది.