నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

వెలుగు, నెట్​వర్క్​: స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో సామూహిక జనగణమన గీతాలాపన మంగళవారం విజయవంతంగా జరిగింది. కామారెడ్డి లో ప్రభుత్వ విప్​ గంప గోవర్ధన్​, కలెక్టర్​ జితేష్​ వి పాటిల్​ ఎస్పీ శ్రీనివాస్​రెడ్డి, అడిషనల్​​ కలెక్టర్​ వెంకటేశ్​ దోత్రే, మున్సిపల్​ చైర్​ పర్సన్​ మిట్టు జహ్నవి, వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్​జిల్లా కేంద్రంలోని నెహ్రూపార్క్ చౌరస్తా వద్ద జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు, అడిషనల్​ కలెక్టర్ చిత్రామిశ్రా, ఏసీపీలు వెంకటేశ్వర్, గిరిరాజ్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, ప్రముఖ విద్యావేత్త మారయ్య గౌడ్ గీతాలాపన చేశారు.అలాగే బుధవారం రక్తదాన శిబిరాలు, ఫ్రీడం కప్ క్రీడా పోటీలు ఉంటాయని కలెక్టర్​ తెలిపారు. దీంతో ఆయా ​మండలాల్లో స్కూల్​ విద్యార్థులు, స్థానిక నాయకులు గీతాలాపనలో పాల్గొన్నారు. పిట్లం అంబేద్కర్​ చౌరస్తాలో ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే హన్మంత్​షిండే స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మహిళలు హక్కుల కోసం పోరాడాలి

ఆర్మూర్, వెలుగు : తమ హక్కుల కోసం మహిళలు పోరాడాలని ప్రగతిశీల మహిళా సంఘం డివిజన్ కన్వీనర్ పద్మ అన్నారు. ఆ సంఘం డివిజన్ జనరల్ బాడీ మీటింగ్ ను టౌన్​లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ... మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి చైతన్యం కావాలని పిలుపునిచ్చారు. తమ హక్కుల కోసం ఏకమై పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు, బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సూర్య శివాజీ, అరుణోదయ సాంస్కృతిక సమైక్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సురేశ్​ బాబు, ఎస్.కె అబ్దుల్, బాలయ్య, పీవో డబ్ల్యూ రాష్ట్ర నాయకులు పిట్ల సరిత, పీవై ఎల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎస్ రవి, సి.గంగామణి,అనిత, బి. పద్మ, భాను, భారతి పాల్గొన్నారు.

డీసీసీబీ చైర్మన్​కు నిరసన సెగ

డబుల్​ బెడ్​రూం ఇండ్లు రాలేదని అడ్డుకున్న మహిళలు 

కోటగిరి, వెలుగు: కొత్త పెన్షన్లు రాలేదని, డబుల్​ బెడ్​రూం ఇండ్లు ఇవ్వలేదని ఆరోపిస్తూ కోటగిరిలో మహిళలు డీసీసీబీ చైర్మన్​ పోచారం భాస్కర్​రెడ్డి వెహికల్​ను అడ్డుకున్నారు. మంగళవారం కోటగిరిలో కొత్తగా కట్టిన సొసైటీ బిల్డింగ్​ కాంప్లెక్స్​ను ప్రారంభించి తిరిగి వెళ్తుండగా.. పలువురు మహిళలు ఆయన వాహనానికి అడ్డం పడి తమ గోడు వెళ్లబోసుకున్నారు. మహిళలు నిరసన వ్యక్తం చేశారు. దాంతో పోలీసులు వారిని బలవంతంగా నెట్టేసి.. భాస్కరరెడ్డి వెహికల్​ను పంపించారు. రైతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తూ అనేక స్కీమ్​లను అమలు చేస్తోందని డీసీసీబీ చైర్మన్​ పోచారం భాస్కర్​రెడ్డి అన్నారు. సొసైటీ బిల్డింగ్​ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వయానా రైతు అయిన కేసీఆర్​కు రైతన్నల అవసరాలు తెలుసునన్నారు. బాన్సువా
డ నియోజకవర్గ అభివృద్ధికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కూచి సిద్దు, జడ్పీటీసీ శంకర్ పటేల్​, ఎంపీపీ వల్లెపల్లి సునీత, వైస్​ ఎంపీపీ గంగాధర్, స్థానిక సర్పంచ్​ పత్తి లక్ష్మన్​పాల్గొన్నారు.

స్వాతంత్ర్య సమరయోధుని కుటుంబానికి సన్మానం

నిజామాబాద్ టౌన్ , వెలుగు: ఇందూరు నగరంలోని వివేకానంద నగర్ లో ఉంటున్న స్వాతంత్ర్య సమర యోధుడు కాశం భాగారెడ్డి కుటుంబాన్ని అజాది కా అమృత్ మహోత్సవం లో భాగంగా బీజేపీ నాయకులు మంగళవారం సన్మానించారు. ఈ సందర్భంగా కాశం భాగారెడ్డి భార్య మాట్లాడుతూ.. స్వాతంత్రోద్యమ సమయంలో ఏడాదిన్నర పాటు తాము జైలు జీవితాన్ని అనుభవించామని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అర్బన్ నియోజకవర్గ నాయకులు సుధాకర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్, కోడూరు నాగరాజు, లింబాద్రి పాల్గొన్నారు. 

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

భిక్కనూరు, వెలుగు : మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్​ గంగగోవర్ధన్​ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాదాపు రూ. 2కోట్ల 18లక్షలతో సీసీరోడ్లు, సంఘ భవనాలు నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఎస్సీకాలనీలో గడపగడపకు వెళ్లి సమస్యలు తెలుసుకున్నారు. అర్హులైన వారికి ఆసర పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత వీఆర్​ఏల సమ్మె శిభిరానికి చేరుకొని వారితో మాట్లాడారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం తెలంగాణ సౌత్​ క్యాంపస్​లో కొత్తకోర్సుల కోసం కృషిచేసిన గోవర్ధన్​ను విద్యార్థులు సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో ఆయనతో పాటు ఎంపీపీ గాల్​రెడ్డి, సర్పంచ్​ తునికి వేణు,ఉపసర్పంచ్​ నరేశ్​, టీఆర్​ఎస్​మండలాధ్యక్షుడు నరసింహరెడ్డి, పట్టణ అధ్యక్షుడు మల్లేశం పాల్గొన్నారు. 

సమస్యలు పరిష్కరించాలని టీయూ విద్యార్థుల ధర్నా

సమస్యలపై వీసీని నిలదీసిన స్టూడెంట్లు

డిచ్​పల్లి, వెలుగు: తెలంగాణ యూనివర్సిటీ లో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ యూనివర్సిటీ ఎదుట స్టూడెంట్లు మంగళవారం ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. వర్సిటీలో గర్ల్స్​ హస్టల్, ఆడిటోరియం , స్టాఫ్​, హెల్త్​ సెంటర్​ లో ఎంబీబీఎస్​ డాక్టర్​ నియామకం, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్​ ఛార్జీల పెంపు, కొత్త కోర్సుల ఏర్పాటు, నాణ్యమైన ఆహరం, మౌలిక వసతుల కల్పించాలని డిమాండ్​ చేశారు. అలాగే ​వీసీ, రిజిస్ట్రార్​ హస్టల్​ మెస్​లలో వారనికోసారి భోజనం చేయాలని, వర్సిటీలో జరుగుతున్న అవినీతి పై విచారణ జరిపించాలన్నారు. ధర్నా విషయం తెలుసుకున్న వీసీ రవీందర్​ అక్కడికి వచ్చారు. విద్యార్థులను సముదాయించేందుకు ప్రయత్నించారు. సమస్యల పై ఎన్ని సార్లు ధర్నాలు, నిరసనలు చేసిన ఎందుకు స్పందించడంలేదని, యూనివర్సిటీలో అవినీతి జరుగుతోందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నిధులే లేనప్పుడు అవినీతి ఎలా చేస్తామని వీసీ బధులిచ్చాడు. దీంతో అసహనానికి గురైన స్టూడెంట్స్​ నిధులు లేకుండా ఇంటర్నేషనల్​ కాన్ఫరెన్స్ ను స్టార్​ హోటల్​ లో ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. నిధులు తేనందుకు, సమస్యలు పరిష్కరించనందుకు వీసీ వెంటనే రాజీనామ చేయాలని నినాదాలు చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ధర్నా నిర్వహించారు. బుధవారం కూడా ధర్నా చేస్తామని తెలిపారు. స్టూడెంట్స్​ ధర్నా కు మద్దతుగా పలు సంఘాల లీడర్లు పాల్గొన్నారు.

ఇరిగేషన్ స్థలంలో అక్రమ నిర్మాణం తొలగింపు

ఆర్మూర్, వెలుగు : టౌన్​లోని జర్నలిస్ట్ కాలనీలోని ఇరిగేషన్ స్థలంలో నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్ మున్సిపల్, రెవెన్యూ ,ఇరిగేషన్ అధికారులు మంగళవారం కూల్చేశారు. అక్రమ నిర్మాణం జరుగుతుందన్న సమాచారంతో అధికారులు ఫీల్డ్​ విజిట్​ చేసి, చర్యలు తీసుకున్నారు. ఇరిగేషన్ డీఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ.... ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​కు చెందిన ప్రభుత్వ స్థలాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, తహసీల్దార్ వేణు గౌడ్​, సర్వేయర్ రాజు, టీపీవోలు హరీశ్​, వినీత్ పాల్గొన్నారు.

వీఆర్​ఏల సమ్మెకు సీఐటీయూ నాయకుల మద్దతు

బోధన్, వెలుగు: వీఆర్​ఏల సమస్యలను వెంటనే పరిష్కారించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్​ డిమాండ్​ చేశారు. పట్టణంలోని తహాసీల్దార్​ ఆఫీసు ఎదుట వీఆర్​ఏలు చేస్తున్న సమ్మెకు మంగళవారం ఆమె మద్దతు తెలిపారు. ఈసందర్భంగా నూర్జహాన్​ మాట్లాడుతూ.. కేసీఆర్​ ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమోషన్లు, పేస్కేల్​ అమలు, వారసత్వంగా వచ్చే ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్​ చేశారు. డిమాండ్లను త్వరగా పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. ఆమెతో పాటుగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.గంగాధరప్పు, జిల్లా సహాయకార్యదర్శి జె.శంకర్​గౌడ్​ పాల్గొన్నారు. 

తహసీల్దార్​ ఆఫీస్​ ముట్టడి.. 

ధర్పల్లి : మండలకేంద్రంలో వీఆర్ఏలు మంగళవారం మండల తహసీల్దారు కార్యాలయాన్ని ముట్టడించారు. 23 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని డివిజన్​ అధ్యక్షుడు చెలమెల రాములు, మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు హరిచరణ్​  ఆవేదన వ్యక్తంచేశారు. 

అవార్డు అందుకున్న డాక్టర్​కు సన్మానం

ఆర్మూర్, వెలుగు: టౌన్​ లోని అపర్ణ హాస్పిటల్​కు ఆయుష్మాన్ భారత్​ ప్రధాన మంత్రి జన్​ ఆరోగ్య యోజన (ఏబీపీఎం జేఏవై) అందుకున్న సందర్భంగా డాక్టర్​ ప్రకాశ్​​ను మంగళవారం ఆర్మూర్ లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. తన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందని డాక్టర్​ ప్రకాశ్​​ అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రెసిడెంట్​సదమస్తు గణపతి, కొక్కుల విద్యాసాగర్, మ్యాకల అశోక్,​ రాపెల్లి సతీశ్​​, సీహెచ్​ సత్యనారాయణ పాల్గొన్నారు.

రోడ్డు కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్ క్రైమ్, వెలుగు : జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతంలో రోడ్డును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు కడుతున్నారని, తమ ఇంటికి వెళ్లేందుకు రోడ్డు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాలనీకి చెందిన ఇందిరా అనే మహళ తమ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం ప్రెస్​మీట్​ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోడ్డు కబ్జాపై ప్రజావాణిలో కలెక్టర్​కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఆరు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నామని, ఫిర్యాదుల గురించి తెలుసుకొని స్థానిక నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. 

సార్వజనిక్ గణేశ్​ ఉత్సవ కమిటీ ఎన్నిక

బోధన్​, వెలుగు: పట్టణలోని సార్వజనిక్ గణేశ్​ఉత్సవ కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా గుమ్ముల శంకర్​రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధానకార్యదర్శిగా గంగుల దినేశ్, కోశాధికారిగా పూజారి లింగం, డైరెక్టర్లుగా సింగం బాగారెడ్డి, బీర్కూర్ బుజ్జి, జల్ల సూర్యప్రకాష్ రెడ్డి,శివకుమార్ గౌడ్,గుమ్ముల అశోక్ రెడ్డి, బెంజర్ గంగారాం, రుద్ర సత్యనారాయణ, శ్రీకాంత్ గౌడ్, పిట్ల సత్యం, వినోద్ పట్వారి, కొండ్ర వెంకటి, మాసిని వినోద్, రాములు యాదవ్, గడ్డం సాయిలు, జల్ల నారాయణ, మీర్జాపురం బాలరాజ్, బీర్కూర్ యాదవ్,భరత్ యాదవ్, గుంత గంగాధర్, ఎంబెల్లి రవి కమిటీలో ఉన్నారు. 

విద్యార్థులకు నోట్​బుక్స్​ పంపిణీ

ఆర్మూర్, వెలుగు: ఆర్మూర్ మండం పిప్రి గ్రామం ఇందిర నగర్ కాలనీలోని ప్రైమరీ స్కూల్​ స్టూడెంట్స్​కు రోటరీ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో మంగళవారం నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్​, కౌన్సిలర్​ బండారి ప్రసాద్, ప్రాజెక్ట్ చైర్మన్ పట్వారి గోపి కృష్ణ, సెక్రటరీ లక్ష్మీ నారాయణ, కోశాధికారి పట్వారి తులసీ, మాజీ ప్రెసిడెంట్​ ప్రవీణ్ పవార్, హెడ్మాస్టర్​ శివ లింగం, టీచర్స్, స్టూడెంట్స్​ పాల్గొన్నారు.

సీఎంఆర్​ఎఫ్​ చెక్కుల పంపిణీ

పిట్లం, వెలుగు: మండలంలోని 22 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్​ ఫండ్​ చెక్కులను ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే హన్మంత్ ​షిండే మంగళవారం అందించారు. పిట్లం ఎంపీపీ ఆఫీసులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రూ. 5.34 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందిన పేదవారికి సీఎం రిలీఫ్​ ఫండ్​ ఎంతో ఆసరా అవుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ కవితా విజయ్​, తహసీల్దార్​ రామ్మోహన్​రావు నాయకులు పాల్గొన్నారు.