వెంకట్రావ్పేటలోని భారీగా సీఎంఆర్ వడ్లు మాయం

 వెంకట్రావ్పేటలోని భారీగా సీఎంఆర్  వడ్లు మాయం
  • స్టేట్  విజిలెన్స్ టాస్క్ ఫోర్స్  ఓఎస్డీ టీమ్​ తనిఖీలో బయటపడ్డ బాగోతం
  • మరో మిల్లులో 13,424 క్వింటాళ్ల వడ్లు దారి మళ్లింపు

కాగజ్ నగర్, వెలుగు: సిర్పూర్(టి) మండలం వెంకట్రావ్​పేటలోని​ఒకే రైస్ మిల్లులో రూ.4.46 కోట్ల విలువైన 43,190 వడ్ల బస్తాలు మాయమయ్యాయి. స్టేట్  విజిలెన్స్  టాస్క్ ఫోర్స్  ఓఎస్డీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం శనివారం వెంకట్రావ్ పేటలోని శ్రీ సాయి బాలాజీ రైస్  మిల్లులో తనిఖీలు నిర్వహించింది. 

తహసీల్దార్ రహీముద్దీన్  తెలిపిన వివరాల ప్రకారం.. సాయి బాలాజీ రైస్  మిల్లుకు 2023–24 సీజన్ లో కేటాయించిన వడ్లలో 17,275 క్వింటాళ్ల దొడ్డు బియ్యం మాయమైనట్లు టాస్క్​ఫోర్స్​ టీమ్​ గుర్తించింది. మిల్లుపై కేసు నమోదు చేసి ఓనర్​కు నోటీస్  అందించారు. 

వారం రోజుల్లో సీఎంఆర్  ఇవ్వాలని లేదంటే దానికి సంబంధించిన డబ్బులు చెల్లించాలని నోటీస్ లో పేర్కొన్నట్లు తహసీల్దార్  తెలిపారు. దాడుల్లో విజిలెన్స్  టాస్క్ ఫోర్స్  టీమ్  ఏఎస్ వో సుదర్శన్ రెడ్డి, ఎన్​ఫోర్స్​మెంట్​ డీటీ రాజ్ కుమార్, ఆర్ఐ స్వప్న ఉన్నారు. అనంతరం అంతరాష్ట్ర చెక్ పోస్ట్ లు, పలు రేషన్ షాపులను సైతం తనిఖీ చేశారు.

కౌటాలలో..

కౌటాల మండలంలోని వెంకటేశ్వర రైస్ మిల్లులో విజిలెన్స్  టాస్క్ ఫోర్స్  టీమ్​ తనిఖీలు చేపట్టి, రూ.3.5 కోట్ల విలువైన 13,424 క్వింటాళ్ల వడ్లు దారి మళ్లించినట్లు గుర్తించారు.గత రెండు సీజన్లకు సంబంధించిన వడ్లు దారి మళ్లినట్లు గుర్తించామని ఎన్​ఫోర్స్​మెంట్, రెవెన్యూ అధికారులు తెలిపారు.

ఆదిలాబాద్​లో రూ.3 కోట్ల వడ్లు పక్కదారి

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ లో రైస్  మిల్లర్ల మాయాజాలంతో రూ.3 కోట్ల విలువైన వడ్లు పక్కదారి పట్టాయి. శనివారం సివిల్ సప్లై డీఎం సుధారాణి,  ఆదిలాబాద్  రూరల్  తహసీల్దార్  గోవింద్ నాయక్  రాంపూర్ లోని నికేతన్  రైస్ మిల్లుపై దాడులు నిర్వహించారు.

1,200 మెట్రిక్  టన్నుల బియ్యం తక్కువగా ఉన్నట్లు  తేలింది. దీనిపై ఆదిలాబాద్  రూరల్  పోలీస్​స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు డీఎం తెలిపారు. రూ.3.56 కోట్ల విలువైన వడ్లు పక్కదారి పట్టినట్లు చెబుతున్నారు. 

ఈ మేరకు రైస్  మిల్లు ఓనర్​ వినోద్ కుమార్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై విష్ణువర్ధన్  తెలిపారు. మాయమైన బియ్యం ఎక్కడికి తరలించారనే దానిపై దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.