చత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్ తొమ్మిది మంది మావోయిస్టులు మృతి

చత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్ తొమ్మిది మంది మావోయిస్టులు మృతి
  • మృతుల్లో ఆరుగురు మహిళలు

భద్రాచలం, వెలుగు: చత్తీస్​గఢ్​లో జరిగిన భారీ ఎన్​కౌంటర్​లో 9 మంది మావోయిస్టులు  మృతి చెందారు. వీరిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. మంగళవారం బీజాపూర్, దంతెవాడ జిల్లాల బార్డర్​లో భద్రతా దళాలు కూంబింగ్ జరుపుతుండగా ఈ ఎన్​కౌంటర్ జరిగిందని బస్తర్​ ఐజీ సుందర్​రాజ్, దంతెవాడ ఎస్పీ గౌరవ్​రాయ్​ మీడియాకు తెలిపారు. దంతెవాడ జిల్లా కిరండోల్ పోలీస్​స్టేషన్​ పరిధిలోని లోహాగావ్​, పురంగీల్​, ఎండ్రీ అడవుల్లో భారీ ఎత్తున దర్బా డివిజన్​, పీఎల్​జీఏ 2వ కంపెనీ మావోయిస్టులు సమావేశం అయ్యారని సమాచారం వచ్చింది. మావోయిస్టులు భారీ విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందింది. దీంతో దంతెవాడ డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్, సీఆర్​పీఎఫ్​ 111, 230 బెటాలియన్ జవాన్లు, యంగ్ ప్లాటూన్స్ బలగాలు సోమవారం అర్ధరాత్రి నుంచే కూంబింగ్ మొదలు పెట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు కనిపించడంతో ఇరువర్గాల మధ్య ఏడెనిమిదిసార్లు కాల్పులు మొదలయ్యాయి.

మావోయిస్టులు పారిపోతూ కూడా కాల్పులు కొనసాగించారు. భారీ సంఖ్యలో మోహరించిన భద్రతా సిబ్బంది వారిని చుట్టుముట్టి కాల్పులు జరిపారు. అనంతరం వేర్వేరు చోట్ల 9 మంది మావోయిస్టుల మృతదేహాలు లభించాయని, స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

భారీగా ఆయుధాలు స్వాధీనం

మావోయిస్టుల మృతదేహాలతోపాటు 303, ఎస్ఎల్ఆర్, బీజీఎల్​ లాంచర్లు, 12 బోర్​ తుపాకులు, 315 బందూకులు, డిటోనేటర్లు, టిఫిన్​ బాక్స్ మందుపాతరలు, ప్రెషర్​ కుక్కర్​ బాంబులు, తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిత్యావసర సరుకులు, మందులు, విప్లవ సాహిత్యంతో పాటు మృతదేహాలను తీసుకుని దంతెవాడకు బలగాలు బయలుదేరాయి. మృతులంతా దర్బా డివిజన్​ కమిటీ, పీఎల్​జీఏ 2వ కంపెనీకి చెందిన వారని ఐజీ సుందర్ రాజ్, ఎస్పీ గౌరవ్​ రాయ్​ తెలిపారు. చనిపోయినవారిని గుర్తించేందుకు మాజీ మావోయిస్టులు, ఇన్​ఫార్మర్లను దంతెవాడకు తీసుకొస్తున్నామన్నారు. 2024లో బస్తర్​ రేంజ్​లో ఇప్పటి వరకు జరిగిన ఎన్​కౌంటర్లలో 153 మంది మావోయిస్టులు చనిపోయారని, 669 మందిని అరెస్ట్ చేశామని, 656 మంది లొంగిపోయారని ఐజీ వెల్లడించారు.