గడ్చిరౌలిలో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం

గడ్చిరౌలిలో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం

ముంబై: మహారాష్ట్రలోని గడ్చిరౌలి జిల్లాలో  సోమవారం (అక్టోబర్ 21) భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు నక్సలైట్లు హతమయ్యారు. కాల్పుల్లో కొందరు జవాన్లు గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లా భామ్రాగడ్ తహసీల్ కోప్రి అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఘటన స్థలంలో ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. కాగా, తహసీల్ కోప్రి అటవీ ప్రాంతంలో నక్సలైట్లు ఉన్నారన్న ఇంటలిజెన్స్ సమాచారంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. 

స్థానిక పోలీసులు, నక్సల్ వ్యతిరేక దళం  సీ60 జవాన్లు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇరువైపులా నుండి కాల్పులు జరిగాయి. భద్రతా దళాల కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతం కాగా.. మరి కొందరు గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. మావోయిస్టుల కాల్పుల్లో ఓ జవాన్ గాయపడగా.. చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించామని వెల్లడించారు. ఘటన స్థలంలో ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఎన్ కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టుల వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు.

ALSO READ | జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర దాడి వెనుక లష్కరే తోయిబా అనుబంధ సంస్థ

 

 కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, నక్సల్ ప్రభావిత రాష్ట్రాలైన ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‎లో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా ఇటీవల భద్రతా దళాలు దూకుడు పెంచాయి. ఒక్క ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోనే గడిచిన నాలుగు నెలల్లో దాదాపు 150 మంది మావోయిస్టులు ఎన్ కౌంటర్‎లో హతమయ్యారు. గత నెల (సెప్టెంబర్)లో జరిగిన ఓ ఎన్ కౌంటర్‎లో దాదాపు 40 మంది మావోయిస్టులు ఒకేసారి మరణించడం గమనార్హం.