జీహెచ్‌ఎంసీలో భారీగా బదిలీలు..పునర్ వ్యవస్థీకరణలో భాగంగా చర్యలు

 జీహెచ్‌ఎంసీలో భారీగా బదిలీలు..పునర్ వ్యవస్థీకరణలో భాగంగా చర్యలు

హైదరాబాద్ సిటీ, వెలుగు: దేశంలోనే అతి పెద్ద మహానగరంగా ఏర్పడిన జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించే దిశగా కసరత్తు ముమ్మరమైంది. పునర్ వ్యవస్థీకరణలో భాగంగా కమిషనర్ కర్ణన్ భారీగా ఇంజినీర్ల బదిలీలు చేశారు. ఏఈ, ఏఈఈ, డీఈ, డీఈఈలతో పాటు క్వాలిటీ కంట్రోల్ సెల్​లో విధులు నిర్వహిస్తున్న ఇంజినీర్లను కొత్తగా ఏర్పడిన 12 జోన్లలో అవసరమైన ప్రాజెక్టులు, మెయింటెనెన్స్ తోపాటు ఇతర విభాగాల్లోకి బదిలీ చేశారు.

అదనపు కమిషనర్లకు స్థానచలనం  

ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్ (అడ్మిన్)గా విధులు నిర్వహిస్తున్న కే. వేణుగోపాల్​ను మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఉప్పల్ జోన్లకు అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ విభాగాలకు జాయింట్ కమిషనర్​గా నియమించారు. రిజర్వ్​లో ఉన్న అదనపు కమిషనర్ గీతారాధికను కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లకు అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ విభాగాలకు జాయింట్ కమిషనర్​గా నియమించారు.

12 జోన్లకు టౌన్ ప్లానింగ్ పర్యవేక్షణ అధికారులు

భవన నిర్మాణాల అనుమతుల విషయంలో ఇబ్బందులు లేకుండా ఫీల్డ్​స్థాయిలో చర్యలు తీసుకునేందుకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని 12 జోన్లకు టౌన్ ప్లానింగ్ పర్యవేక్షణ అధికారులుగా సీనియర్ టౌన్ ప్లానింగ్ అధికారులను నియమించారు. శంషాబాద్, రాజేంద్రనగర్, గోల్కొండ, చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లకు చీఫ్ సిటీ ప్లానర్ శ్రీనివాస్​కు బాధ్యతలు అప్పగించారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లకు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ బీ వెంకన్నకు బాధ్యతలు అప్పగించారు. మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్లకు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ బీ ప్రదీప్​కు బాధ్యతలు అప్పగించారు.

జోనల్, డిప్యూటీ కమిషనర్లకు కీలక అధికారాల బదిలీ

జీహెచ్‌ఎంసీ పరిధి 650 చ.కి.మీ నుంచి 2,053 చ.కి.మీకి విస్తరించిన నేపథ్యంలో ప్రజలకు వేగవంతమైన, సమర్థవంతమైన పరిపాలన అందించేందుకు వికేంద్రీకృత పాలనను బలోపేతం చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. 

ఈ క్రమంలో జోనల్, డిప్యూటీ కమిషనర్లకు కమిషనర్ ఆర్వీ కర్ణన్ కీలక అధికారాలను బదిలీ చేశారు. జీహెచ్‌ఎంసీ చట్టం-1955లోని సెక్షన్ 119 ప్రకారం ఆస్తి పన్ను అంచనాలు, సవరణలు, మ్యూటేషన్లు, మినహాయింపులు తదితర సేవలకు సంబంధించిన అధికారాలను నిర్దిష్ట పరిమితులు, షరతులతో జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు అప్పగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో పరిపాలనా ఆలస్యాలు తగ్గి, ప్రజల దరఖాస్తుల పరిష్కారం వేగవంతం అవుతుంది.

విస్తరించిన జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రజలకు మరింత చేరువైన పాలన సాధ్యమవుతుంది. అప్పగించిన అధికారాలు సంబంధిత ఎస్​వోపీలు, జీహెచ్‌ఎంసీ చట్టం-1955 నిబంధనల ప్రకారం అమలు కానున్నాయి. పరిపాలన ప్రయోజనాల కోసం ఈ అధికారాలను కమిషనర్ సమీక్షించి సవరించవచ్చు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రానున్నాయి.