కరీంనగర్​లో భారీ అగ్ని ప్రమాదం

కరీంనగర్​లో భారీ అగ్ని ప్రమాదం

కరీంనగర్/కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్‌లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. నిరుపేదల కష్టార్జితం మంటల్లో కాలి బూడిదైంది. 20 గుడిసెలు తగలబడ్డాయి. మోటార్ బైక్స్, నిత్యవసరాలు, బంగారం, నగదు కలిపి సుమారు రూ.30లక్షలకుపైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రమాద సమయంలో గుడిసెల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. జిల్లా ఫైర్ ఆఫీసర్ వెంకన్న, బాధితుల కథనం ప్రకారం.. ఆదర్శ నగర్ హాస్పిటల్స్ ఏరియాలోని ప్రైవేట్ స్థలంలో దాదాపు 25 ఏండ్లుగా 20 వడ్డెర కుటుంబాలు గుడిసెలు వేసుకుని ఉంటున్నాయి. వీరంతా రోజువారీ కూలీలే. 

మంగళవారం తెల్లవారుజామున చాలా మంది గుడిసెవాసులు మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు తరలివెళ్లారు. ఉదయం 9.15 గంటల సమయంలో ఓ గుడిసెలో చెలరేగిన మంటలు అన్ని గుడిసెలకు వ్యాపించినట్లు ప్రత్యక్ష సాక్షి చల్లా తిరుమలయ్య చెప్పాడు. తన కొడుకు రమేశ్ తో కలిసి మంటలార్పే ప్రయత్నం చేసినప్పటికీ అదుపు కాలేదన్నాడు. మొత్తంగా మంటల్లో 20 గుడిసెలు కాలిబూడిదయ్యాయి. 5 సిలిండర్లు పేలడంతో భారీ శబ్దాలు వచ్చాయి. సమాచారం అందుకున్న స్థానిక ఫైర్​సిబ్బంది వచ్చి, దాదాపు మూడు గంటలపాటు శ్రమించి మంటలను ఆర్పివేశారు. అప్పటికే గుడిసెలతోపాటు లోపల ఉన్న వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. పక్కనే ఒక ప్రైవేట్‌హాస్పిటల్ వైపు మంటలు వ్యాపిస్తుండగా ఫైర్‌ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది అదుపు చేశారు. కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్‌ సునీల్‌రావు, త్రీటౌన్‌ సీఐ శ్రీనివాస్‌, మున్సిపల్, రెవెన్యూ అధికారులు, కార్పొరేటర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించి, బాధితులను ఓదార్చారు.

మిన్నంటిన బాధితుల రోదనలు.. 

సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిపోవడంతో బాధితుల రోదనలు మిన్నంటాయి. మంటలను ఆర్పాక దాచుకున్న బంగారం, నగదు, నిత్యవసరాలు, విలువైన సామగ్రిని వెతుకుతూ కన్నీరుమున్నీరయ్యారు. పుస్తకాలు, బట్టలతోపాటు ఇంట్లోని అన్ని వస్తువులు కాలిపోయాయంటూ బత్తుల వైష్ణవి అనే బాలిక రోదించిన తీరు అందరినీ కలచివేసింది. 

బాధితులు వీళ్లే..

బత్తుల రాంబాబు, చల్ల తిరుమలయ్య, చల్ల రమేశ్, గుంజ రమేశ్, బత్తుల కృష్ణ, కుంచం తిరుమలేశ్, వేముల రాములు, వేముల నాగరాజు, వేముల ఎల్లయ్య, ఆలకుంట్ల నర్సయ్య, చల్లా వెంకటేశ్, బత్తుల రాంప్రసాద్, గోగుల యాదయ్య, కుంచపు శివ, వేముల శ్రీను, ఒర్సు శ్రీను, వేముల ఉప్పలయ్య, గుర్రం కుమార్, మక్కల శ్రీను, బట్టుల వెంకన్న, ఒర్సు కృష్ణకు చెందిన పూరి గుడిసెలు కాలిపోయినట్లు ఫైర్ అధికారులు వెల్లడించారు. ఈ ల్యాండ్ ఓనర్ షిప్ విషయంలో కొన్నేళ్లుగా వివాదం నెలకొన్నట్లు తెలిసింది. 

గుడిసెలు వేసుకున్నవారు ఇక్బాల్ అనే వ్యక్తికి నెలనెలా అద్దె చెల్లిస్తున్నారు. అయితే కొద్ది రోజులుగా మాస్కులు పెట్టుకున్న కొంతమంది వ్యక్తులు ల్యాండ్ ఖాళీ చేయాలని తమను బెదిరిస్తున్నట్లు గుడిసెవాసులు తనతో చెప్పారని ఇక్బాల్ వెల్లడించారు. తాను 2000 సంవత్సరంలో 7 1/4 గుంటల భూమిని తన సమీప బంధువు వద్ద  కొనుగోలు చేశానని, పక్క ప్లాట్ ఓనర్ కు తనకు మధ్య 2007 నుంచి కోర్టులో కేసు ఉందని, గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాల నుంచి ప్రతీ నెలా రూ.500 అద్దె రూపంలో తీసుకుంటున్నానని, ఈ అగ్నిప్రమాదానికి తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

చెల్లి పెండ్లికి దాచిన బంగారం, పైసలు బూడిదయ్యాయి

నేను మిడ్ ఎగ్జామ్స్ రాసేందుకు సెంటర్ కు వెళ్లా. విషయం తెలియగానే పరీక్ష రాయకుండానే వచ్చేసిన. ఈ మధ్యే నా చెల్లికి ఎంగేజ్ మెంట్ అయింది. ఏప్రిల్ 4న పెళ్లి ఉంది. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నం. పెళ్లి కోసం ఇంట్లో దాచిన రూ.70 వేల నగదు, 1.5 తులాల బంగారం, నా ల్యాప్ టాప్, టూవీలర్ కాలిపోయాయి. పెండ్లికి కొన్న వస్తువులన్నీ బూడిదయ్యాయి.
- వేముల సాయిశంకర్, బీటెక్ స్టూడెంట్