తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం: గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం !

తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం: గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసం !

తిరుపతి పరిధిలోని తిరుచానూరులో భారీ అగ్ని ప్రమాదం తప్పింది. వసుంధర నగర్‌లో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సమాచారం ప్రకారం...  తిరుచానూరు వసుంధర నగర్‌లో నివసించే శరత్ అనే వ్యక్తి ఓ సోలార్ ప్యానెల్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో ఆయన కుటుంబం ఊరెళ్లారు. అయితే, ఇంట్లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీనివల్ల మొదట ఫ్రిజ్ పేలి, ఆ మంటలు గ్యాస్ సిలిండర్‌కు అంటుకోవడంతో అది కూడా భారీ శబ్దంతో పేలిపోయింది.

 రంగంలోకి ఫైర్ సిబ్బంది
సిలిండర్ పేలిన ధాటికి ఇల్లంతా మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున శబ్దం రావడంతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఫైర్ ఫైటర్లు శ్రమించి మంటలను అదుపు చేశారు. అలాగే విద్యుత్ శాఖ సిబ్బంది రంగంలోకి దిగి, ప్రమాదం మరింత పెరగకుండా ఉండేందుకు ఆ ప్రాంతంలో పవర్ కట్ చేసారు. 

ఇంట్లో ఎవరూ లేకపోవడం వల్లే ప్రాణనష్టం తప్పిందని, కానీ ఇంట్లోని సామాన్లు, విలువైన వస్తువులు కాలి బూడిదవ్వడంతో భారీగా ఆస్తి నష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.