- త్రిస్సూర్ రైల్వే స్టేషన్ పార్కింగ్‌లో చెలరేగిన మంటలు
- 200 కు పైగా వాహనాలు దగ్ధం
తిరువనంతపురం: కేరళలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. త్రిస్సూర్ రైల్వే స్టేషన్ పార్కింగ్ లో ఆదివారం ఉదయం 6.45 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పార్కింగ్ లోని వందలాది బైకులు దగ్ధమయ్యాయి. ఓ కరెంట్ వైర్ తెగి బైక్ లపై పడటంతో నిప్పు అంటుకుని ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాద సమయంలో పార్కింగ్‌లో 500 వరకు బైక్ లు ఉన్నాయని.. వాటిలో చాలావరకు కాలిపోయాయని తెలిపారు.
పార్క్ చేసిన వాహనాల్లో ఇంధనం ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి ప్రమాద తీవ్రత పెరిగిందని.. నిమిషాల్లోనే భారీ నష్టం వాటిల్లిందని అధికారులు భావిస్తున్నారు. వాహనాలతో పాటు షెడ్ మంటల్లో దెబ్బతిన్నట్టు చెప్పారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. మూడు ఫైరింజన్ల సహాయంతో అరగంట శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.
షార్ట్ సర్క్యూట్, ఇంధన లీక్‌తో ప్రమాదం..
షార్ట్ సర్క్యూట్, ఇంధన లీక్ లేదా మరేదైనా కారణం వల్ల మంటలు చెలరేగాయా అని తెలుసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఎటువంటి రైల్వే ఇన్ఫాస్ట్రక్చర్ దెబ్బతినలేదు, రైల్వే సేవలకు ఎలాంటి ఆటంకం కలగలేదని వెల్లడించారు. గురువాయూర్కు వెళ్లే రైళ్లు ఉపయోగించే ట్రాక్‌కు దగ్గరగా ఈ పార్కింగ్ ప్రాంతం ఉంది.
