ఢిల్లీ జామా మ‌సీదు వద్ద ఉద్రిక్తత

ఢిల్లీ జామా మ‌సీదు వద్ద ఉద్రిక్తత

నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన కామెంట్స్ కు వ్యతిరేకంగా దేశంలోని పలుచోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. ఢిల్లీలోని జామా మసీదు దగ్గర ఆందోళనకారులు నిరసన చేపట్టారు. మసీదులో ప్రార్థనలు చేసిన తర్వాత ఆందోళన నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో జామా మసీదు పరిసర ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. మసీదు దగ్గర నిరసనలకు పిలుపు ఇవ్వలేదని జామా మసీద్ షాహీ ఇమామ్ చెప్పారు. ఇటు ఉత్తరప్రదేశ్ లోని సహరాన్ పూర్ లో కూడా ప్రార్థన తర్వాత ఆందోళనలు జరిగాయి. కాన్పూర్ లో ఇటీవల అల్లర్లు జరిగిన ప్రాంతంలో పోలీసులు భారీ భద్రతను  ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలతో భద్రతను పెంచారు.

పశ్చిమ బెంగాల్ లో ఆందోళనకారులు చేపట్టిన నిరసనలు హింసకు దారితీశాయి. నుపుర్ శర్మ, జిందాల్ దిష్టిబొమ్మలను తగలబెట్టారు. హౌరాలో ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్  ప్రయోగించారు.  ఇటు యూపీలోని  ప్రయాగ్ రాజ్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు విసిరారు. దీంతో ప్రయాగ్ రాజ్ అడిషనల్ DG కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పంజాబ్ లో కూడా రోడ్లపై నిరసన చేపట్టారు ఆందోళకారులు. నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇద్దరి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. 

హైదరాబాద్ లో చార్మినార్ దగ్గర ఆందోళన నిర్వహించారు. మక్కా మసీదులో ప్రార్థనలు చేసిన తర్వాత నిరసన చేపట్టారు ఆందోళకారులు. నుపుర్ శర్మ, జిందాల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో మక్కా మసీదు ప్రాంతంలో పోలీసులు, CRPF జవానులు భారీగా మోహరించారు.