మాస్టర్​ ప్లాన్​పై మడతపేచీ

మాస్టర్​ ప్లాన్​పై మడతపేచీ
  • ఒత్తిళ్లు, పైరవీలపై అనుమానాలు
  • జోన్​ల మార్పుపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
  • వ్యవసాయ భూముల్లో రోడ్ల ప్రతిపాదనపై అభ్యంతరాలు

నిర్మల్,వెలుగు: నిర్మల్ మాస్టర్ ప్లాన్​పై ప్రారంభంలోనే అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్లు, ఇండస్ట్రీయల్ జోన్ల ఏర్పాటుపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. కొంత మంది పొలిటికల్​ లీడర్లు, పలుకుబడి గల వ్యక్తులు తమ భూములను ఇండస్ట్రీయల్​ జోన్ పరిధి నుంచి తప్పించారని ఫిర్యాదులు వస్తున్నాయి. మంజులాపూర్, తల్వేద గ్రామాల మధ్య ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు కోసం వ్యవసాయ భూములు ప్రతిపాదించడం ఏమిటని రైతులు ఫైర్​ అవుతున్నారు. వ్యవసాయంపై ఆధారపడి బతికే తమకు ఇండస్ట్రీయల్​ జోన్​ తలనొప్పిగా మారిందంటున్నారు. అయితే ఇది కేవలం డ్రాఫ్ట్​ మాత్రమేనని, వచ్చేనెల10వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత ఫైనల్ ​ప్లాన్​ ప్రభుత్వానికి నివేదిస్తామని ఆఫీసర్లు పేర్కొంటున్నారు.

భూముల ధరలు పెరగడంతోనే...

ప్రస్తుతం నిర్మల్ లో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. శివారు ప్రాంతాల్లో వ్యవసాయ భూమి ఎకరానికి కోటి నుంచి ఐదు కోట్ల వరకు పలుకుతోంది. ఇలాంటి భూమల నుంచి మాస్టర్ ప్లాన్ పేరిట రోడ్ల నిర్మించడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారు. విలువైన భూముల నుంచి రోడ్లు వేస్తే నష్టపోతామంటున్నారు. ప్రభుత్వం చెల్లించే పరిహారం నామమాత్రమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రింగ్ రోడ్డు అలైన్ మెంట్​పై వివాదం...

నిర్మల్ రెడ్డి ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న హైవే రోడ్డు నుంచి కలెక్టరేట్, బంగల్​పేట్​మీదుగా విశ్వనాథ్ పేట వరకు నిర్మించనున్న రింగ్​రోడ్డు అలైన్ మెంట్​మార్పుపై ఆరోపణలు వస్తున్నాయి. కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికార పార్టీ లీడర్ల దీనికి కారణమని పట్టణవాసులు పేర్కొంటున్నారు. 

రైతులు ఆందోళన చెందవద్దు... 

కొత్త మాస్టర్ ప్లాన్ రూపకల్పన విషయంలో రైతులు ఆందోళనకు గురి కావద్దు. వారికి ఎలాంటి నష్టం జరగకుండా మాస్టర్ ప్లాన్ ను రూపొందించాం. ప్రస్తుతం తయారుచేసిన ప్లాన్​ కేవలం డ్రాఫ్ట్​ మాత్రమే. అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటాం. ఆమేరకు కొత్త మాస్టర్ ​ప్లాన్​ ఆమోదిస్తాం. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సహకారంతో ఇబ్బందులు రాకుండా చూస్తాం.
–మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్