రామగుండం బల్దియాకు..నో మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌

రామగుండం బల్దియాకు..నో మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌
  •      20 ఏండ్లుగా మాస్టర్​ప్లాన్​ అమలు కాలే
  •      2001లో ప్రతిపాదించి వదిలేశారు 
  •      2017లో తీర్మానం చేసినా కాగితాలకే పరిమితం
  •       సిటీలో విస్తరించని రోడ్లు 
  •      ఊసేలేని అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీలు

గోదావరిఖని, వెలుగు: రామగుండం మున్సిపల్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్​లో 20 ఏండ్లుగా మాస్టర్​ ప్లాన్​ అమలుకావడం లేదు. దీంతో బల్దియాలో అభివృద్ధి కుంటుపడుతోంది.  2001లో అమలు చేయాల్సిన ప్లాన్​ఇప్పటిదాకా అతీగతీ  లేదు. దీంతో రామగుండం కార్పొరేషన్​పరిధిలో రోడ్ల విస్తరణ జరగలేదు. 

అండర్​ గ్రౌండ్ ​డ్రైనేజీలు నిర్మించలేదు. 2017లో కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ఆమోదం తెలిపి రోడ్ల విస్తరణకు మార్కింగ్‌‌‌‌‌‌‌‌ చేసినా ఇప్పటిదాకా ఒక్క అడుగు ముందుకు పడలేదు. దీంతో ప్రజలు ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలను రోడ్లపైనే పార్కింగ్‌‌‌‌‌‌‌‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజకీయ ఒత్తిళ్ల వల్లే  మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ అమలుకు నోచుకోలేదనే చర్చ సాగుతోంది. 

ప్రతి 20 ఏండ్లకోసారి మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ 

మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌లలో ప్రతి 20 ఏండ్లకోసారి మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ రూపొందించాల్సి ఉంటుంది. పట్టణాలు మరింత విస్తరించడానికి, అభివృద్ధి చెందడానికి ఈ మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ ఉపయోగపడుతుంది. రోడ్ల విస్తరణ, కొత్త పార్క్‌‌‌‌ల నిర్మాణం, అండర్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ డ్రైనేజీల ఏర్పాటు.. వంటి వాటిని ప్లాన్‌‌‌‌‌‌‌‌లో పొందుపర్చాలి. 2001లో రామగుండం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌లో మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ అమలు చేయాల్సి ఉండగా చాలా ఏండ్ల తర్వాత 2017లో కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో తీర్మానం చేసి ఆమోద ముద్ర వేశారు. దీని ప్రకారం గోదావరిఖని పట్టణంలోని పలు ఏరియాల్లో రోడ్లు విస్తరించాల్సి ఉండగా టౌన్​ప్లానింగ్​ఆఫీసర్లు మార్కింగ్​చేసి వదిలేశారు. 

మేయర్లు, ఎమ్మెల్యేలు మారినా.. 

గోదావరిఖని పట్టణంలోని ప్రధాన వ్యాపార కేంద్రమైన లక్ష్మీనగర్‌‌‌‌‌‌‌‌, కల్యాణ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, పాత మున్సిపల్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌, స్వతంత్ర చౌక్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌వంటి 10 ఏరియాల్లోని అంతర్గత రోడ్లను ఇరువైపులా ఐదు నుంచి ఆరు ఫీట్ల వెడల్పుతో విస్తరించడానికి 2017 తర్వాత మార్కింగ్‌‌‌‌‌‌‌‌ చేశారు. కానీ ఆనాటి నుంచి నేటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. 

ఎమ్మెల్యేలుగా సోమారపు సత్యనారాయణ, కోరుకంటి చందర్‌‌‌‌‌‌‌‌, మేయర్లుగా కొంకటి లక్ష్మీనారాయణ, జాలి రాజమణి పదవీ కాలంలో ఎలాంటి ముందడుగు పడలేదు. రోడ్లకు ఇరువైపులా అండర్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌‌‌‌‌ డ్రైనేజీ, దానిపైనే పుట్‌‌‌‌‌‌‌‌పాత్‌‌‌‌‌‌‌‌ల నిర్మాణం చేపట్టారు. పుట్‌‌‌‌పాత్‌‌‌‌లను ఆక్రమించుకుని వ్యాపారులు, ప్రజలు తమకనుకూలంగా నిర్మాణాలు చేసుకుని వినియోగించుకుంటున్నారు. 

2022లో సర్వే చేపట్టినా ...

2001లో అమలుచేయాల్సిన ప్లాన్‌‌‌‌ను పక్కన పెట్టేసి, 2021లో చేయాల్సిన ప్లాన్‌‌‌‌‌‌‌‌ కోసం 2022లో నాటి ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీ ద్వారా సర్వే చేయించింది. సర్వేలో ఆ ప్రాంతంలోని లయన్స్‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌, చాంబర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ కామర్స్‌‌‌‌‌‌‌‌, సీనియర్‌‌‌‌‌‌‌‌ సిటిజన్లు, ప్రముఖుల అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంది. కానీ సదరు ఏజెన్సీ ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా గతంలో ఉన్న మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌లో స్వల్ప మార్పులు చేసి నివేదిక సమర్పించింది. 

ఈ మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ను ఆమోదించాలని కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో ప్రవేశపెట్టగా కార్పొరేటర్లు పూర్తిగా వ్యతిరేకించారు. రామగుండం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ అభివృద్ధికి అనుగుణంగా మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ లేదని, తప్పుల తడకగా ఉందని ప్రకటించారు. అప్పటి నుంచి నేటి వరకు కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ గురించి ఎవరూ పట్టించుకోలేదు. రామగుండం ఎమ్మెల్యేగా గెలిచిన రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌పై ప్రత్యేక దృష్టి సారించాలని నగర ప్రజలు కోరుతున్నారు.