ఈ ఏడాదిమస్తు వానలు : లష్కర్ బోనాల రంగంలో భవిష్యవాణి

ఈ ఏడాదిమస్తు వానలు : లష్కర్ బోనాల రంగంలో భవిష్యవాణి
  • పంటలు బాగా పండుతయ్‌‌.. జనాలకు వ్యాధులు రాకుండా చూసుకుంటా 
  • నన్ను నమ్ముకున్న వారిని కాపాడుకుంటా..ఏ ఇబ్బందీ రానివ్వను
  • లష్కర్ బోనాల రంగంలో భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత 

సికింద్రాబాద్, వెలుగు: ‘‘ఈసారి రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తాయి. పంటలు సమృద్ధిగా పండుతాయి. నా ప్రజలకు ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడుతా’’అని లష్కర్‌‌‌‌‌‌‌‌ బోనాల రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర వేడుకల్లో భాగంగా సోమవారం ఉదయం నిర్వహించిన రంగం కార్యక్రమంలో మాతంగి కన్య స్వర్ణలత అమ్మవారికి ఎదురుగా పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి వినిపించారు.

తనను నమ్ముకున్న వారిని కాపాడుకుంటానని, ఎవరికీ ఏ ఇబ్బందుల్లేకుండా చూసుకుంటానని చెప్పారు. ‘‘ఈ ఏడాది ప్రజల నుంచి సంతోషంగా పూజలు అందుకున్నాను. మట్టి బోనమైనా, బంగారు బోనమైనా.. ఎవరు తెచ్చినా సంతోషంగా అందుకుంటాను. బాలికలు, యువతులు, మహిళలు ఎవరు బోనం సమర్పించినా స్వీకరిస్తాను. ఈ ఏడాది కోరినంత వర్షాలు ఉంటాయి. మంచిగా చూసుకుంటాను. ఎలాంటి లోటు లేదు. ఆనందంగా, సంతోషంగా ఉండండి. అనుమానాలు పెట్టుకోకండి.

నా దర్శనం కావాలంటే 48 గంటలు వేచి ఉండటం కష్టంగా ఉందని భక్తులు అంటున్నారు. నా కోసం ఆ మాత్రం కష్టపడలేరా? నా దర్శనం చేసుకోవాలంటే ఆ మాత్రం కష్టపడాలి. లేదంటే సోమరిపోతులు అవుతారు. జనాలకు ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడుతా. పిల్లలు, పెద్దలు, జంతువులకు ఇబ్బందుల్లేకుండా చూసుకుంటా”అని భవిష్యవాణి పలికారు. 

మీరు ఏదిచ్చినా స్వీకరిస్తా..

‘‘రక్తపాశం ఇవ్వడం లేదు.. మీకు నచ్చింది ఇస్తున్నారు.. దానినే సంతోషంగా స్వీకరిస్తున్నా.. నా రూపం పెట్టాలి అనుకుంటున్నారు కదా.. పెట్టండి. ఎవరు ఏం చేసినా, ఎవరెంత అడ్డుపడిన నా రూపాన్ని నేను శాశ్వతంగా పెట్టించుకుంటాను. నా గ్రామ ప్రజలు అందరూ నేను సంతోషంగా ఉండటానికి చల్లని సాక పెడుతున్నారు. ఈసారి కూడా 5 వారాల పాటు పప్పు, బెల్లంతో సాక పెట్టండి.

పాడి పంటలు ఇదివరకులా పండించడం లేదు. మందులు ఎక్కువ వాడుతున్నారు. అందుకే మీరు అనారోగ్యం బారిన పడుతున్నారు. వాటిని తగ్గించుకుంటే వ్యాధులు తగ్గుతాయి. పిల్లలకు, గర్భిణులకు ఏ ఇబ్బంది రానివ్వను. అందరూ సంతోషంగా, ఆనందంగా ఉండేలా చూసుకుంటాను”అని భవిష్యవాణి వినిపించారు. రంగం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్​, పీసీసీ జనరల్ ​సెక్రటరీ కోట నీలిమా, ఆలయ ఈవో మనోహర్​ రెడ్డి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.