ఇండియా, మారిషస్ సహజ మిత్రులు: ప్రధాని మోదీ

ఇండియా, మారిషస్ సహజ మిత్రులు: ప్రధాని మోదీ
  •    భారత్ జన ఔషధి స్కీంలో చేరిన తొలి దేశం ఇదే: ప్రధాని మోదీ 
  •     ఇండియా సాయంతో మారిషస్ లో పలు ప్రాజెక్టులు ప్రారభం 
  •     ఆ దేశ పీఎంతో కలిసి వర్చువల్​గా ప్రారంభించిన ప్రధాని

న్యూఢిల్లీ: హిందూ మహాసముద్రంలో మారిషస్​, ఇండియా సహజ మిత్ర దేశాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ ప్రారంభించిన జన ఔషధి స్కీంలో చేరిన తొలి దేశంగా మారిషస్ నిలిచిందన్నారు. ఈ పథకంలో చేరిన సభ్య దేశాలకు మనదేశం అందుబాటు ధరలకే మెడిసిన్ అందజేస్తుందన్నారు. ఇండియా సాయంతో మారిషస్ లో నిర్మించిన కొత్త ఎయిర్​స్ట్రిప్, జెట్టీ, 6 కమ్యూనిటీ డెవలప్​మెంట్ ప్రాజెక్టులను ఆ దేశ ప్రధాని ప్రవింద్ జుగ్నాథ్​తో కలిసి మోదీ గురువారం వర్చువల్​గా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సవాళ్లను ఎదుర్కోవడంలో భారత్, మారిషస్ కలిసి పనిచేస్తున్నాయన్నారు. ఈ రీజియన్​లో భద్రత, స్థిరత్వం సాధించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.  అగలెగ ఐల్యాండ్​లో ఎయిర్ స్ట్రిప్, జెట్టీల నిర్మాణానికి సాయం చేసిన భారత్​కు మారిషస్ పీఎం జుగ్నాథ్​ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రపంచ తొలి వేదిక్ గడియారం ప్రారంభం

మధ్యప్రదేశ్​లో రూ. 17,551 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ గురువారం వర్చువల్​గా ప్రారంభించారు. ఇందులో నీటిపారుదల, విద్యుత్, రోడ్డు, రైల్వే, నీటి సరఫరా, బొగ్గు, పరిశ్రమలు వంటి కీలక రంగాలకు చెందిన ప్రాజెక్టులున్నాయి. వీటితో పాటు సైబర్ తహసీల్ ప్రాజెక్టునూ ప్రారంభించారు. ప్రాచీన భారతీయ పంచాంగం ఆధారంగా సమయాన్ని చూపించే ప్రపంచంలోనే మొట్టమొదటి గడియారం ‘‘విక్రమాదిత్య వేద గడియారం(పంచాంగ్)”ను ప్రధాని ఓపెన్ చేశారు. ఉజ్జయినిలోని జంతర్ మంతర్ వద్ద నిర్మించిన 85 అడుగుల ఎత్తైన టవర్​పై వేదిక్ గడియారాన్ని ఏర్పాటు చేశారు. ఈ గడియారం వేద పంచాగం, గ్రహాల స్థానాలు, ముహూర్తం, జ్యోతిష్య సమాచారాన్ని కూడా తెలియజేస్తుంది. 

నేడు, రేపు బెంగాల్, జార్ఖండ్, బిహార్ కు మోదీ.. 

ప్రధాని మోదీ శుక్ర, శనివారాల్లో బెంగాల్, జార్ఖండ్, బిహార్‌‌‌‌లో పర్యటించనున్నారు. శుక్రవారం బెంగాల్‌‌‌‌లో రూ. 22,200 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం జార్ఖండ్‌‌‌‌లో రూ. 35,700 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. శనివారం బిహార్​లో రూ. 1.83 లక్షల కోట్ల ప్రాజెక్టులను  ప్రారంభించనున్నారు.