
- మారిషస్ ఇన్వెస్టర్ కొత్త పంథా
- ఇండియా కార్పొరేట్ హిస్టరీలో మొదటిసారి !
హైదరాబాద్, వెలుగు : కంపెనీ లాభాల్లో నడుస్తుంటే షేర్‌హోల్డర్లకు ఎక్కువ డివిడెండ్, స్పెషల్ డివిడెండ్, బోనస్, ఉచిత రైట్స్ షేర్లు ఇవ్వడం సాధారణంగా మనం చూస్తుంటాం. ఐతే, ఏదైనా కంపెనీలో పెట్టుబడి పెట్టి, ఆ పెట్టుబడి వల్ల భారీగా ప్రతిఫలం పొందితే…అందుకు ఆ కంపెనీకి ఇన్సెంటివ్ ఇవ్వడం ఇప్పుడు కొత్త కాన్సెప్ట్. హైదరాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ నాట్కో ఫార్మా లిమిటెడ్‌కు మారిషస్‌కు చెందిన ఇన్వెస్టర్ సీఎక్స్ సెక్యూరిటీస్ లిమిటెడ్ రూ. 48 కోట్ల (6.83 మిలియన్ డాలర్లు) ఇన్సెంటివ్ ఆఫర్ చేస్తోంది. 2013 లో నాట్కో ఫార్మా ప్రిఫరెన్షియల్ ఇష్యూలో భాగంగా పెట్టుబడులు పెట్టింది సీఎక్స్ సెక్యూరిటీస్. షేర్‌హోల్డర్ల సంపద పెరిగితే ఇన్సెంటివ్ ఇస్తామంటూ నాట్కో ఫార్మాకు చెప్పిందట.
ఆ తర్వాత కాలంలో తమకున్న 17 లక్షల షేర్లను అమ్మడం ద్వారా లాభాలు గడించింది ఈ సీఎక్స్ సెక్యూరిటీస్ . తాము పెట్టుబడి పెట్టాక నాట్కో ఫార్మా అంచెలంచెలుగా అద్భుతంగా ఎదిగిందని…ఆ క్రమంలో తమ పెట్టుబడులు చాలా రెట్లు పెరిగాయని … అలా లాభాలు సంపాదించుకున్నందుకు కృతజ్ఞత తెలపడానికి ఈ వినూత్న పద్ధతిని ఎంచుకున్నట్లు చెబుతోంది ఆ మారిషస్ కంపెనీ సీఎక్స్ సెక్యూరిటీస్ లిమిటెడ్. ఇన్వెస్టర్ నుంచి ఈ గిఫ్ట్ తీసుకోవడానికి అంగీకరించినట్లు నాట్కో ఫార్మా లిమిటెడ్ గురువారం స్టాక్‌ఎక్స్చేంజ్‌లకు తెలిపింది. ఇండియాలోని చట్టాలను అనుసరించి నిబంధనలు పాటిస్తూ ఈ గిఫ్ట్ తీసుకోవాలనుకుంటున్నట్లు నాట్కో ఫార్మా పేర్కొంది. ఇలా ఒక ఇన్వెస్టర్ కంపెనీకి గిఫ్ట్ ఇవ్వడం ఇండియా కార్పొరేట్ హిస్టరీలో మొదటిసారి కావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తమ మూడున్నర దశాబ్దాల అనుభంలో ఎప్పుడూ ఇలాంటిది వినలేదని వారు చెబుతున్నారు.