మే 28న పార్లమెంట్ బిల్డింగ్ ఓపెనింగ్

మే 28న పార్లమెంట్ బిల్డింగ్ ఓపెనింగ్
  • ప్రారంభించనున్న ప్రధాని 
  •  ట్విట్టర్​లో ఉభయ సభల వీడియో పోస్టు 
  •  ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న అశోక చక్రాలు, హాల్స్ 

న్యూఢిల్లీ: కొత్త పార్లమెంట్ బిల్డింగ్​ను ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిర్వహించే ప్రోగ్రామ్ షెడ్యూల్​ను కూడా కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. పార్లమెంట్ కొత్త బిల్డింగ్ లోని లోక్​సభ, రాజ్యసభ కాంప్లెక్స్​కు సంబంధించిన వీడియోను ప్రధాని మోడీ శుక్రవారం తన ట్విట్టర్​లో పోస్టు చేశారు. ఎంట్రీ నుంచి లోపల స్పీకర్, చైర్మన్​ కూర్చునే చైర్ వరకు ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో చిత్రించారు. ఉభయ సభల్లో అశోక చక్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘మై పార్లమెంట్ మై ప్రైడ్’ అనే హ్యాష్​ట్యాగ్​ను ఉపయోగించి వీడియోను అందరితో పంచుకోవాలని ప్రజలను మోడీ కోరారు. వీడియోకు వాయిస్ ఓవర్ జోడించాలని, అందులో కొన్నింటిని తాను రీట్వీట్ చేస్తానన్నారు. కాగా, పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా అన్ని పార్టీలకు కేంద్రం ఆహ్వానం పంపింది.

ఈ వేడుకకు 25 పార్టీలు హాజరవుతున్నాయి. మరో 20 పార్టీలు ఓపెనింగ్​ను బహిష్కరిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. ప్రారంభోత్సవంలో రాజదండం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇన్నేండ్లు అలహాబాద్ మ్యూజియంలోని నెహ్రూ గ్యాలరీలో ఉన్న ‘సెంగోల్’ ఢిల్లీకి చేరుకుంది. సెంగోల్ ను తయారు చేసిన తమిళనాడు  మఠం నిర్వాహకులతో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్​కు కూడా కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్విటేషన్ పంపింది. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి హాజరుకావాల్సిందిగా కోరింది.

ఎంతో గర్వంగా ఉంది: ఉమ్మిడి ఈతిరాజు

కేంద్రం ఆహ్వానంపై సెంగోల్‌‌‌‌ను తయారుచేసిన తమిళనాడులోని ఉమ్మిడి బంగారు చెట్టి కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా 95 ఏండ్ల ఉమ్మిడి ఈతిరాజు మాట్లాడుతూ.. ‘‘సెంగోల్ తయారు చేసే టైంలో నాకు 20 ఏండ్లు. తిరువడుతురై అథీనం సహకారం, ఇతరుల సపోర్ట్​తో సెంగోల్ తయారు చేశాం. పార్లమెంట్​లో సెంగోల్ ను ప్రతిష్టిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది”అని అన్నారు.