
వాషింగ్టన్: భారత దిగుమతులపై 25 శాతం సుంకం, అదనపు జరిమానాలు విధించి బిగ్ షాకిచ్చిన ట్రంప్.. తాజాగా ఇండియాకు మరో ఝలక్ ఇచ్చాడు. భారత శత్రు దేశం పాకిస్థాన్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్లు ట్రంప్ ప్రకటించాడు. పాకిస్థాన్‌లో చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి ఆ దేశంతో అమెరికా కొత్త వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుందని వెల్లడించాడు.
ఈ ఒప్పందం వల్ల భవిష్యత్‌లో పాకిస్థానే ఇండియాకు చమురు అమ్మే రోజు రావొచ్చని ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘పాకిస్తాన్‌తో మేము ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. ఈ అగ్రిమెంట్లోభాగంగా పాకిస్తాన్, అమెరికా కలిసి.. పాక్‌లో భారీ చమురు నిల్వలను అభివృద్ధి చేయడంలో కలిసి పనిచేస్తాయి. ఎవరికి తెలుసు బహుశా ఏదో ఒక రోజు పాకిస్థాన్ భారతదేశానికి చమురు అమ్మే రోజు రావచ్చు’’ అని పేర్కొన్నాడు ట్రంప్.
అమెరికాలో భారత దిగుమతులపై 25 శాతం టారిఫ్స్ విధిస్తున్నట్లు బుధవారం (జూలై 30) ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే పాకిస్థాన్‌తో చేతులు కలిపి భారత్‌కు ఊహించని షాకిచ్చాడు. రష్యా నుంచి చమురు, ఆయుధాల కొనుగోలు.. బ్రిక్స్ కూటమిలో భాగస్వామ్య దేశమనే సాకు చూపి భారత్‌పై భారీగా టారిఫ్స్ విధించాడు. ఇటీవల ఇండియా విషయంలో ట్రంప్ వ్యవహరిస్తోన్న తీరు, తీసుకుంటున్న నిర్ణయాలు పూర్తిగా మనదేశానికి వ్యతిరేకంగా ఉంటున్నాయి.
అమెరికాలో ఇండియన్స్‌కు ఉద్యోగాలు ఇవ్వొద్దనడం, పాక్-భారత్ మధ్య తానే సీజ్ ఫైర్ ఒప్పందం కుదిర్చాననడం వంటి మాటలతో భారత్‌ను ఇరుకున పెడుతున్నారు. ఇదిలా ఉండగానే.. భారత్‌పై టారిఫ్స్ విధించడమే కాకుండా.. మరో అడుగు ముందుకేసి దాయాది దేశం పాకిస్థాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ తీరుపై ఇండియన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.