కరోనా పేషెంట్లకు భోజనం బిల్లులిస్తలేరని..

కరోనా పేషెంట్లకు భోజనం బిల్లులిస్తలేరని..
  • తండ్రితో కలిసి ప్రభుత్వాస్పత్రి ఎదుట బాధితుడి దీక్ష

భూపాలపల్లి అర్బన్, వెలుగు: కరోనా సమయంలో క్వారంటైన్​లో ఉన్న పేషెంట్లకు సరఫరా చేసిన భోజనాలకు సంబంధించిన బిల్లులను ఇప్పించి తనను, తన కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటూ ప్రభుత్వాస్పత్రి ఎదుట ఓ వ్యక్తి తండ్రితో కలిసి దీక్షకు దిగాడు. భూపాలపల్లి పట్టణ కేంద్రానికి చెందిన కప్పల రాజేశ్​కుటుంబంతో కలిసి చిన్నాచితక క్యాటరింగ్​లు చేస్తూ జీవనం సాగించేవాడు. కరోనా మొదటి దశ టైంలో పేషెంట్లకు కాంటాక్టుగా ఉన్న పలువురికి భూపాలపల్లి పట్టణంలోని 100 పడకల ప్రభుత్వ దవాఖానలో క్వారంటైన్​ సెంటర్​ఏర్పాటు చేశారు. క్వారంటైన్​లో ఉన్న పేషెంట్లకు భోజనాలు సరఫరా చేయాలని అప్పటి కలెక్టర్​అబ్దుల్​అజీమ్, ఇతర ఆఫీసర్లు రాజేశ్​కు చెప్పారు.

వారి భరోసా మేరకు 9 నెలల పాటు కరోనా పేషెంట్లకు భోజనాలను సరఫరా చేశాడు. మొదటి రెండు నెలలు బిల్లులను సక్రమంగానే ఇచ్చినప్పటికీ తర్వాత నుంచి అందలేదు. సుమారు రూ. 10 లక్షల వరకు బిల్లులు బకాయి పడడం, అప్పులు పెరిగి కుటుంబం రోడ్డున పడే పరిస్థితి రావడంతో దవాఖాన ఎదుట దీక్షకు దిగాడు. ఇప్పటికైనా ఆఫీసర్లు తనకు రావాల్సిన డైట్​ బిల్లులను వెంటనే ఇప్పించి ఆదుకోవాలని, అలాగే గతంలో ఇచ్చిన వాగ్దానం మేరకు ప్రభుత్వ ఆస్పత్రిలో డైట్​కాంట్రాక్టును ఇచ్చి ఉపాధి కల్పించాలని వేడుకున్నాడు. లేదంటే కుటుంబంతో కలిసి ఆస్పత్రి ఎదుట ఆమరణ దీక్షకు దిగుతానని చెప్పాడు.