ఐపీ పెట్టేస్తున్నరు!.. చీటీ దందాలతో నమ్మినోళ్లను నట్టేట ముంచుతున్నరు

ఐపీ పెట్టేస్తున్నరు!.. చీటీ దందాలతో నమ్మినోళ్లను నట్టేట ముంచుతున్నరు

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో ఈ మధ్యకాలంలో డబ్బులు ఎగ్గొట్టి పారిపోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. కొందరు రాత్రికి రాత్రే పారిపోతుండగా మరికొందరు ఐపీ పెడుతున్నారు.  ఇలా ఇప్పటికే రూ. కోటి నుంచి రూ. 10 కోట్ల వరకూ ఐపీ పెట్టిన ఘటనలు ఉన్నాయి.  తాజాగా యాదగిరిగుట్టకు చెందిన ఓ హిజ్రా రూ. 6 కోట్లకు ఐపీ పెట్టడంతో అప్పులు ఇచ్చిన వాళ్లు ఆందోళన చెందుతున్నారు. 

అత్యాశతో..

అధిక వడ్డీ వస్తుందన్న ఆశతో వ్యాపారులను గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఒక్కో వ్యాపారి అత్యవసరమని చెప్పి నూటికి రూ. 5 నుంచి రూ. 10 వరకూ వడ్డీ ఇస్తామని నమ్మబలుకుతున్నారు. డబ్బు చేతికి రాగానే కొన్నాళ్లు వడ్డీ సక్రమంగా ఇస్తున్నారు. చివరకు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసుకొని పారిపోతున్నారు. మరికొందరు కోర్టులను ఆశ్రయించి ఐపీ పెడుతున్నారు. ఇంకొందరు అనధికారికంగా చీటీలు నడిపిస్తున్నారు. రూ. 50 వేల నుంచి రూ. 50 లక్షల వరకూ చీటీలు నడిపిస్తున్న వారు జిల్లాలో అనేకమంది ఉన్నారు. నమ్మకంగా కొందరు చీటీలు నడిపిస్తుంటే.. మరి కొందరు నమ్మకం కలిగించి.. చీటీలు ఎత్తుకున్న వారికి డబ్బులు ఇవ్వకుండా కొన్ని నెలలు గడిపి పారిపోతున్నారు. ఇటీవల  రిజిస్ట్రేషన్​ ఉన్న ఓ చిట్​ఫండ్​ కంపెనీ కూడా డబ్బులు సరిగా చెల్లించకపోవడంతో ఖాతాదారులు ఆందోళనకు దిగారు.

పలు ఘటనలు

  • కేరళకు చెందిన ఓ వ్యక్తి.. జిల్లాలోని యాదగిరిగుట్టలో బట్టల దుకాణం తెరిచాడు. 20 ఏండ్లుగా షాపు నడిపిస్తూ అందరికీ నమ్మకం  కలిగించాడు. ఎక్కువ వడ్డీ ఇస్తానని నమ్మబలికి అనేక మంది వద్ద, చివరకు ఒక కుటుంబంలోనే ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద డబ్బులు తీసుకున్నాడు. మూడేండ్ల కింద షాపు క్లోజ్​ చేసి పారిపోయాడు. సదరు వ్యాపారి చేసిన అప్పు రూ. 2 కోట్లకు పైనే.  అతడు ఐపీ పెట్టి వెళ్లిపోవడంతో బాధితులు లబోదిబోమన్నారు. 
  • జిల్లా కేంద్రమైన భువనగిరికి చెందిన ఓ వ్యాపారి పరిచయమున్న వారితో పాటు కస్టమర్ల వద్ద అప్పులు చేశాడు. వడ్డీ ఎక్కువగా ఇస్తానని నమ్మించడంతో పెద్ద వ్యాపారి కదా అనుకొని అనేక మంది అప్పు ఇచ్చారు. రూ. కోట్లు అప్పులు చేసిన ఆ వ్యాపారీ ఐపీ పెట్టి ఓ రోజు కుటుంబంతో సహా మాయమయ్యాడు. 
  • చిట్​ఫండ్​పెట్టి బిజినెస్‌‌‌‌ చేసిన మరో వ్యాపారి చీటీలు ఎత్తుకున్న వారికి సరిగా డబ్బులు ఇవ్వకుండా నెలలు గడిపాడు. పలువురికి చీటీల డబ్బులు ఇవ్వకుండానే  బిచాణా ఎత్తేశాడు.  సదరు వ్యాపారి కూడా రూ. 10 కోట్ల వరకు ముంచేశాడు.
  •  
  • రియల్​ ఎస్టేట్​ బిజినెస్ చేస్తున్న ఇంకో వ్యాపారి.. లాభాలు బాగా వస్తున్నాయని చెబుతూ పెట్టుబడి కోసం అప్పులు చేశాడు. అత్యవసరమని రూ. 10 వడ్డీకి కూడా అప్పులు చేశాడు. అత్యాశకు లోనైన పలువురు డబ్బులు ఇచ్చారు. చివరకు అతడు కూడా మాయమయ్యాడు.  ఇలా చెప్పుకుంటూ పోతే.. అనేకమంది పారిపోయిన సంఘటనలున్నాయి..

తాజాగా రూ. 6 కోట్లతో  హిజ్రా 

యాదగిరిగుట్టలో ఓ హిజ్రా 25 ఏండ్లుగా నివాసం ఉంటూ చీటీలు నడిపిస్తోంది. రెగ్యులర్ చీటీలతో పాటు ఆరు నెలలకోమారు నిర్వహించే పంట చీటీలు కూడా కొనసాగిస్తోంది.  అయితే, కొన్నాళ్లుగా చీటీలు ఎత్తుకున్న వారికి డబ్బులు ఇవ్వకుండా, రేపుమాపు అంటూ తప్పించుకుంటూ వస్తోంది. ఇలా ఆమె చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ. 6 కోట్లకు చేరాయి. చీటీలు తీసుకున్న వారి నుంచి  ఒత్తిడి ఎక్కువ కావడంతో.. ముందస్తు జాగ్రత్తగా కోర్టును ఆశ్రయించి ఐపీ పెట్టుకొని నాలుగు రోజుల కింద పారిపోయింది. దీంతో బాధితులు స్థానికంగా నివాసం ఉంటున్న హిజ్రాలపై ఒత్తిడి తేవడంతో.. వారు ఆమె ఆదివారం తీసుకొచ్చి బాధితులకు అప్పగించారు. అయితే ఆమె ఐపీ పెట్టుకోవడంతో తాము ఏం చేయలేమని పోలీసులు చెప్పినట్టు తెలిసింది.

చిట్​ఫండ్​ యాక్ట్ ​ కింద  కేసు

రిజిస్ట్రేషన్​ లేకుండా అనధికారికంగా చీటీలు నడిపించడం నేరం. తాజాగా ఐపీ పెట్టిన హిజ్రా కూడా ఎక్కువగా చీటీలు ఇలాగే నడిపించింది.  చీటీలు వేసిన వాళ్లు ఫిర్యాదు చేస్తే చిట్​ఫండ్​ యాక్ట్​ కింద కేసులు నమోదు చేస్తం.

ఉదయ్​ కిరణ్​, ఎస్సై, యాదగిరిగుట్ట