రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు :కలెక్టర్ రాహుల్ రాజ్

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు :కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, వెలుగు: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కలెక్టర్​ రాహుల్​ రాజ్​ సూచించారు. ఆదివారం ఆయన మెదక్​ మండలంలోని రాజ్​పల్లిలో పర్యటించి  ధాన్యం కొనుగోలు కేంద్రం, సబ్ స్టేషన్ తనిఖీ చేశారు.  ధాన్యం సేకరణ తీరును అడిగి తెలుసుకున్నారు. విద్యుత్ సరఫరా ఏ విధంగా అవుతుంది.. ఎన్ని గంటలు రైతులకు అందిస్తున్నారు తదితర వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 498 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, రైతులు ఆరబెడుతున్న ధాన్యానికి టోకెన్ అందిస్తున్నామని,మిల్లులకు ట్యాగింగ్ ఇచ్చేస్తున్నామన్నారు. 

 ధాన్యం సరఫరాకు వాహనాలన్నీ సిద్ధంగా ఉన్నాయన్నారు. ధాన్యం కొనుగోలు బిల్లులు త్వరగా చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.  రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లలోనే  ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. 

 పారదర్శకంగా మద్యం లాటరీ ప్రక్రియ 

వైన్స్​ షాప్​ల కేటాయింపునకు సంబంధించిన లాటరీ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్​ రాహుల్​ రాజ్​ తెలిపారు. మెదక్ పట్టణ శివారులోని వెంకటేశ్వర గార్డెన్ లో సోమవారం లాటరీ తీయనున్నట్టు చెప్పారు. 

అందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.  జిల్లాలోని 49 మద్యం షాపులకు 1,420 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తు ఫీజు రూపంలో రూ.42.60  కోట్ల  ఆదాయం వచ్చిందన్నారు. దరఖాస్తుదారులు సోమవారం ఉదయం వెంకటేశ్వర గార్డెన్స్ లో హాజరు కావాలన్నారు. దరఖాస్తు  చేసినపుడు ఇచ్చిన రశీదు, ఎంట్రీపాస్​ను తీసుకొని హాజరు కావాలని సూచించారు.