 
                                    మెదక్, వెలుగు: ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు కోసం ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకున్న మెదక్ డీఈ చాంద్ షరీఫ్ పాషాను ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పాపన్నపేట మండలం సీతానగరం గ్రామానికి చెందిన భాస్కర్ ఇటీవల పౌల్ట్రీఫామ్ నిర్మించుకున్నాడు. 25 కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ కోసం ట్రాన్స్‌కో ఆఫీస్‌లో అప్లై చేసుకోగా రూ. 2.19 లక్షల ఎస్టిమేషన్ వేశారు.
ఆ డబ్బులతో పాటు రూ. 50 వేలు అదనంగా ఇస్తేనే ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేస్తామని డీఈ చాంద్ షరీఫ్ పాషా స్పష్టం చేశాడు. దీంతో భాస్కర్ అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో రూ. 30 వేలకు ఒప్పందం కుదిరింది. ఇందులో రూ. 9 వేలను ఇటీవల డీఈ సూచించిన వ్యక్తికి ఫోన్ పే ద్వారా పంపించాడు. మిగతా డబ్బులు ఇవ్వాలని డీఈ అడగడంతో భాస్కర్ ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు.
వారి సూచనతో గురువారం మెదక్ ఆఫీస్‌లో డీఈని కలిసి రూ. 21 వేలు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు డీఈ చాంద్ షరీఫ్ పాషాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి డీఈని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.

 
         
                     
                     
                    