- వడ్ల కొనుగోలుపై సీఎం ఒక్కసారైనా సమీక్షించారా ?
- మాజీమంత్రి హరీశ్‌రావు
మెదక్, వెలుగు : వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీమంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నా రేవంత్‌రెడ్డి కనీసం పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే కలెక్టరేట్ ఎదుట ధర్నాలు చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చన్నారు.
మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్‌పల్లిలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ... వడ్ల కొనుగోళ్లపై సీఎంకు, మంత్రులకు పట్టింపే లేదన్నారు.
కర్నాల్‌పల్లిలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి 25 రోజులు అయినా ఇప్పటివరకు రెండే లారీలు వచ్చాయన్నారు. అకాల వర్షాలకు వడ్లు తడిసిపోతున్నాయని, వాటిని ఆరబెట్టినా కొనలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. వడ్ల కొనుగోళ్లపై సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు ఒక్క రివ్యూ అయినా చేశారా ? అని ప్రశ్నించారు.
ఢిల్లీకి పోవడం, హైదరాబాద్‌కు రావడం తప్ప వేరే పనేమీ లేదా ? ఢిల్లీకి కప్పం కట్టడం తప్ప రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతుల కష్టాలు సీఎంకు, మంత్రులకు పట్టవా ? అని నిలదీశారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏసీ రూముల్లో కూర్చుని అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. ఆయన కొనుగోలు కేంద్రాల్లో తిరిగితే రైతుల కన్నీళ్లు, కష్టాలు అర్థం అవుతాయన్నారు. ప్రతిపక్ష నాయకులు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తే కేసులు పెట్టి అరెస్ట్‌లు చేస్తున్న సీఎంకు.. రైతుల బాధల గురించి ఇంటెలిజెన్స్, పోలీసులు నివేదికలు ఇవ్వడం లేదా ? అని ప్రశ్నించారు.
మక్కలు, శనగలు, సన్‌ఫ్లవర్ అమ్మిన రైతులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వేయలేదన్నారు. రేషన్ షాపుల్లో ఏండ్ల తరబడి నిల్వ ఉన్న సుమారు రూ.500 కోట్ల విలువైన దొడ్డు బియ్యం పురుగులు పట్టి ముక్కిపోయాయని, వాటిని అమ్మి రికవరీ చేయాలన్న కనీస సోయి, బాధ్యత కూడా ఈ ప్రభుత్వానికి లేదన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వచ్చాక వరుసగా మూడు యాసంగి సీజన్లలో రైతులు నష్టపోతూనే ఉన్నారన్నారు. ప్రభుత్వం స్పందించి లారీలు పంపించి, కాంటాలు పెట్టి వడ్లు కొనాలని, లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు కలెక్టరేట్లను ముట్టడిస్తారని
హెచ్చరించారు.
