
మంత్రికి కొండపోచమ్మ వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత
జగదేవపూర్( కొమురవెల్లి), వెలుగు : సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని తీగుల్ నర్సాపూర్ సమీపంలోని కొండపోచమ్మ అమ్మవారి 21వ వార్షికోత్సవ వేడుకలు ఈనెల 13వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. వేడుకలకు మంత్రి హరీశ్ రావును రావాలని కోరుతూ హైదరాబాద్ లోని ఆయన నివాసంలో ఆలయ చైర్మన్ జంబుల శ్రీనివాస్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రంగారెడ్డి మంగళవారం కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం గజ్వేల్ లో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డిని కలిసి పత్రికను ఇచ్చారు. కార్యక్రమంలో కొండపోచమ్మ ఆలయ ఈఓ మోహన్ రెడ్డి, ఆలయ పాలకమండలి సభ్యులు ఆర్కే శ్రీనివాస్, నిమ్మ రమేశ్, గోలి సంతోశ్, కుమ్మరి కనకయ్య ఉన్నారు.
ఆపదలో అండగా సీఎం రిలీఫ్ ఫండ్
మెదక్ టౌన్, వెలుగు : సీఎంఆర్ఎఫ్ పేదలను ఆపదలో ఆదుకుంటోందని ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మెదక్ టౌన్‌తోపాటు మెదక్, హవేలీఘనపూర్ మండలాలకు చెందిన 74 మందికి సీఎంఆర్ఎఫ్ కింద రూ.21 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మెదక్ జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్య, మెదక్ మున్సిపల్ కౌన్సిలర్లు భీమరి కిశోర్, లక్ష్మీనారాయణ గౌడ్, జయరాజు, శ్రీనివాస్, సర్పంచ్‌లు శ్రీహరి, సిద్దాగౌడ్, ప్రభాకర్, లింగం, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
కేంద్రానికి ధాన్యం కొనడం చేతకాదు: ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్
మెదక్ (రేగోడ్), వెలుగు : ధాన్యం కొనుగోళ్లు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వానికి చేతకాదని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. మంగళవారం రేగోడ్ మండల కేంద్రంతో పాటు కొత్వాల్పల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం మొండి చేయి చూపిస్తే చిత్తశుద్ధితో టీఆర్ఎస్ ప్రభుత్వం కొంటోందని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్లక్ష్మణ్, పీఏసీఎస్ చైర్మన్ రాజు, సర్పంచ్ బాదనపల్లి నర్సింలు, ఎంపీటీసీ గొల్ల నర్సింలు, డైరెక్టర్ రాధా కిషన్, రాములు, తదితరులు పాల్గొన్నారు.
టీచర్ల హక్కులను కాలరాసిన టీఆర్ఎస్ సర్కార్
మెదక్ టౌన్, వెలుగు : తెలంగాణ ప్రభుత్వం టీచర్ల హక్కులను పూర్తిగా కాలరాసిందని తపస్ మెదక్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్ ఆరోపించారు. మంగళవారం మెదక్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. ఉద్యమాలు చేసి సాధించుకున్న తెంగాణ రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్సీ, డీఏ బకాయిలు, మెడికల్, సరెండర్ లీవుల బిల్లులు సకాలంలో చెల్లించడంలేదన్నారు. జీవో 317తో స్థానికత కోల్పోయి ఇతర జిల్లాల్లో పనిచేసే దుస్థితి ఏర్పడిందని వాపోయారు. స్థానికత ఆధారంగా టీచర్లను వారి సొంత జిల్లాలకు పంపే వరకూ తపస్ పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. పేద పిల్లలు చదువుకునే సర్కారు బడుల్లో సరిపడే టీచర్లు లేక నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. భాష పండితులను, పీఈటీలను అప్ గ్రేడ్ చేయాలని, పాఠశాల నిర్వహణ గ్రాంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు మాధవరెడ్డి, శ్రీధర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి ఉన్నారు.
బాధిత కుటుంబాలకు అండగా ఉంటా
ఎమ్మెల్యే రఘునందన్‌రావు
దుబ్బాక, వెలుగు: ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించిన నిరుపేద మహిళా కుటుంబాలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. రాయపోల్ మండల కేంద్రంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన చింతకింది కవిత, ఇప్ప శ్యామల కుటుంబాలను, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత రాజమణిని మంగళవారం ఆయన పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాధిత కుటుంబాలను ప్రమాదానికి కారణమైన లారీ యాజమాని ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రాజమణికి మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్యులను ఆదేశించారు. అనంతరం రేకులకుంట మల్లన్న ఆలయ మాజీ చైర్మన్, దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామానికి చెందిన కోమటిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మరణించిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
తిగుల్ ను మండలంగా ప్రకటించాలని పాదయాత్ర
జగదేవపూర్ (కొమురవెల్లి), వెలుగు : తిగుల్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని తిగుల్ మండల సాధన సమితి రిలే నిరాహార దీక్షలు 100వ రోజుకు చేరడంతో మంగళవారం కొండ పోచమ్మ ఆలయం వరకు పాదయాత్ర చేశారు. సమితి ఆధ్వర్యంలో తిగుల్ లో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి కొండపోచమ్మ ఆలయం వరకు పాదయాత్రగా వెళ్లి అమ్మవారికి ముడుపుకట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ భానుప్రకాశ్‌రావు, పీఏసీఎస్ డైరెక్టర్ భూమయ్య మాట్లాడారు. తిగుల్ 5 వేల జనాభా ఉన్న గ్రామమని, మండలానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపారు. తిగుల్ను మండలం చేయాలని వంద రోజులుగా శాంతియుతంగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్నా పట్టించుకోకపోవడం సరికాదన్నారు. తమ డిమాండ్ తీర్చే వరకూ దీక్షలు కొనసాగిస్తూ వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. పాదయాత్రలో మండల సాధన సమితి సభ్యులు పరుశురాం, మహేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఐలయ్య, మహేందర్ రెడ్డి, గర్నెపల్లి కృష్ణమూర్తి, జంగని ఐలయ్య, ఈశ్వర్, అశోక్, ఎల్లారెడ్డి, నర్సింహ్మరెడ్డి, బునారీ రాజు, మనోజు, ఎల్లయ్య, నవీన్, శ్రీనివాస్ రెడ్డి, చంద్రారెడ్డి, బాల్ రెడ్డి, వెంకట్, భిక్షపతి, ఆంజనేయులు,హేచ్. ఎల్లయ్య, బాలమణి పాల్గొన్నారు.
నిరుద్యోగులను మోసగిస్తున్న మోడీ సర్కార్
సిద్దిపేట, వెలుగు : నిరుద్యోగలను మోడీ సర్కార్ మోసం చేస్తోందని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కనుకుంట్ల శంకర్ అన్నారు. ఈనెల 25న నిర్వహించే చలో పార్లమెంట్ కార్యక్రమం వాల్ పోస్టర్ ను మంగళవారం సిద్దిపేటలో ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చి గద్దె నెక్కిన మోడీ ప్రభుత్వం తరువాత వారిని పట్టించుకోవడంలేదన్నారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెడుతూ ఉపాధి పొందుతున్న లక్షలాది మంది యువత బతుకులను రోడ్డు పాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన మోడీ అది చేయకపోగా నిరుద్యోగాన్ని మరింత పెంచారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ యువజన వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు ఏఐవైఎఫ్ఆధ్వర్యంలో 25న చేపడుతున్న చలో పార్లమెంట్ కార్యక్రమానికి నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా ఆఫీస్ బేరర్స్ జనాగం రాజ్ కుమార్, వేల్పుల శ్రీనివాస్, చింతకింది కుమార్, మిట్టపల్లి సుధాకర్, రాయకుంట్ల మంజుల పాల్గొన్నారు.