ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్​ జిల్లాలో ఆదివారం నిర్వహించిన  గ్రూప్-1 ప్రిలిమ్స్​ ఎగ్జామ్​ ప్రశాంతంగా ముగిసింది. సంగారెడ్డి జిల్లాలోని 26 పరీక్షా కేంద్రాలలో 8,654 మంది అభ్యర్థులకు గాను  6,650 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా,  2,004 మంది గైర్హాజరయ్యారు. 76.84  శాతం హాజరు నమోదైంది. సిద్దిపేట జిల్లాలోని 20 పరీక్షా కేంద్రాలలో 7786 అభ్యర్థులకు గాను 6475 మంది  పరీక్షకు హాజరు కాగా, 1311 మంది అబ్సెంట్ అయ్యారు. 83.16 శాతం హాజరు నమోదైంది. మెదక్  జిల్లాలోని ఏడు పరీక్షా కేంద్రాలలో  3,293 మంది అభ్యర్థులకు గాను 2,677 మంది హాజరయ్యారు కాగా,  616 మంది గైర్హాజరయ్యారు. 81.29 శాతం  హాజరు నమోదైంది. ఆయా కేంద్రాలను కలెక్టర్లు, అడిషనల్​ కలెక్టర్లు పరిశీలించారు. సెంటర్​కు లేటుగా వచ్చిన అభ్యర్థులను పోలీస్​ ఆఫీసర్లు గేట్ల వద్దనే అడ్డుకుని వెనక్కి పంపించారు. పరీక్ష సజావుగా సాగేందుకు కృషి చేసిన ఆఫీసర్లను, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

భక్తులతో కిటకిటలాడిన ఏడుపాయల

పాపన్నపేట, వెలుగు : ఏడుపాయల వన దుర్గ భవానీ మాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కొన్ని రోజులుగా మంజీరా నదీ ఆలయం ముందు నుంచి పరవళ్లు తొక్కుతుండడంతో రాజగోపురంలోనే పూజలు నిర్వహిస్తున్నారు. బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పరిసర ప్రాంతాలు మొత్తం నీళ్లు ప్రవహించడంతో ఏడుపాయల పర్యాటక కళ సంతరించుకుంది. పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా పాలక మండలి, దేవాదాయ శాఖ ఆఫీసర్లు ఏర్పాటు చేశారు. పాపన్నపేట ఎస్సై విజయ్ కుమార్ ఆలయం వద్ద తగిన బందోబస్తు చర్యలు చేపట్టారు. 

సేవ చేసినోళ్లను సమాజం గుర్తిస్తుంది

చేర్యాల, వెలుగు: పేద, ధనిక  అన్న తేడా లేకుండా సేవ చేసిన నాయకులను సమాజం గుర్తిస్తుందని ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. ఆదివారం చేర్యాల పట్టణ కేంద్రంలో ప్రముఖ రిపోర్టర్ పుర్మా రాంరెడ్డి సంతాప సభలో ఆయన మాట్లాడారు. సామాజిక సేవ చేసిన ఎందరో నాయకులను ప్రజలు అక్కున చేర్చుకుని ఉన్నత పదవులను ఇచ్చి గౌరవించారని చెప్పారు. ఈ సందర్భంగా రామ్ రెడ్డి ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వరూపా రాణి శ్రీధర్ రెడ్డి, డాక్టర్ పరమేశ్వర్, ఏ.మల్లారెడ్డి, శేశిధర్ రెడ్డి, ఆగం రెడ్డి, సంజీవ రెడ్డి నాగేశ్వర రావు పాల్గొన్నారు.

కలకుంట్ల జగదయ్య పుస్తకాల ఆవిష్కరణసభ

సిద్దిపేట, వెలుగు :  వెన్నెల సాహితీ సంగమం ఆధ్వర్యంలో ఆదివారం సిద్దిపేటప్రెస్ క్లబ్ లో కవిరచయిత కలకుంట్ల జగదయ్య రచించిన  ‘అష్టాదశశక్తిపీఠాలు-మహిమలు,  శ్రీమద్రామాయణకథామృతం’ పుస్తకాలను ఆవిష్కరించారు. జీడిపల్లి రాంచంద్రారావు అధ్యక్షతన జరిగిన ఈసమావేశానికి దుబ్బాక ఎంపీడీవో భాస్కరశర్మ, నారాయణరావుపేట ఎంపీడీవో  మాడ్గుల మురళీధర శర్మ, తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు  మహమూద్ పాషా, రిటైర్డు డిప్యూటి డీఈవో  పెద్దివైకుంఠం అతిథులుగా హాజరయ్యారు. రచయితలు గుమ్మన్నగారి బాలసరస్వతి,  పెండెం శ్రీధర్  పుస్తకాలను సమీక్షించారు. కార్యక్రమంలో వెన్నెల సాహితీ ప్రతినిధులు పర్కపెల్లి యాదగిరి,  అశోక్ రాజు,  స్రవంతి,  మహిపాల్,  పిడిశెట్టి రాజు,  పిల్లి మహేందర్,   కొండి మల్లారెడ్డి,  కాముని సుధాకర్,  మిట్టపల్లి పర్శరాములు పాల్గొన్నారు. 

సీడీఆర్ యువసేన మండల అధ్యక్షుడిగా విక్రమ్

పుల్కల్, వెలుగు : మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అభిమాన సంఘమైన  సీడీఆర్ యువసేన పుల్కల్ మండల అధ్యక్షుడిగా మండలంలోని  మిన్​పూర్​ గ్రామానికి చెందిన గాండ్ల విక్రమ్​ ఎన్నికయ్యాడు. ఈ మేరకు  కాంగ్రెస్ పార్టీ  మండల అధ్యక్షుడు దుర్గారెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్ యూఐ, యూత్ కాంగ్రెస్ నాయకులు కలిసి సీడీఆర్ యువసేన అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు విక్రమ్ ధన్యవాదాలు తెలిపారు.  కాంగ్రెస్​ పార్టీ అభివృద్ధికి తన వంతు  కృషి చేస్తానన్నారు. దామోదర​రాజనర్సింహ యువసేన ఆధ్వర్యంలో పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతామన్నారు.  కార్యక్రమంలో సీడీఆర్ యువసేన సీనియర్ నాయకులు బోయిని శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్, ఎన్ఎస్ యూఐ అధ్యక్షుడు ఇమ్రాన్, మిన్​పూర్​ ఎంపీటీసీ దుర్గయ్య ఉన్నారు.  

వరి, పత్తి  రైతులు అప్రమత్తంగా ఉండాలి

మెదక్​ టౌన్, వెలుగు: ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రభావంతో వరి,  పత్తి పంటల్లో చీడ-పీడలు అధికంగా సోకే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి ఆశాకుమారి తెలిపారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. వరి పంట చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు వర్షాలు పడితే మాని పండు తెగులు వచ్చే ఆకాశం ఉందన్నారు. అలాగే అగ్గి తెగులు సోకి  వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని చెప్పారు. అందుకు ప్రతి రైతూ అలర్ట్​గా ఉండి నివారణకు అవసరమైన మందులు చల్లాలని సూచించారు. ఎప్పటికప్పుడు  వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించాలని వారి సూచనల మేరకు  పురుగు, తెగులు మందులు 
వినియోగించాలని చెప్పారు.